సూర్యాపేట : అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్(Congress) పార్టీకి ప్రజలు ఓటుతోనే (Parliament elections) బుద్ధి చెబుతారని సూర్యాపేట(Suryapet) ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) అన్నారు. నల్లగొండ లోక్సభ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి మద్దతుగా జిల్లాలోని పెన్ పహడ్ మండలం నువ్వు దూపాడు గ్రామంలో బీఆర్ఎస్ నేతలతో కలిసి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలుచేస్తామని మాటిచ్చి ఇంతవరకూ అమలు చేయకపోవడం ప్రజలను మోసం చేయడమేనని మండిపడ్డారు.
కాంగ్రెస్ను నమ్మి మోసపోయామంటూ ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు. ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేనని విమర్శించారు. ఎన్నికలు ఉన్న సమయంలోనే రైతుబంధు నాలుగెకరాల వరకు ఇచ్చేందుకు నాలుగు నెలలు పట్టిందని, ఎన్నికల తతంగం పూర్తయితే అదికూడా నిలిపివేస్తారని, ఈ విషయాన్ని రైతులు గుర్తించాలన్నారు.
అన్ని వర్గాలకు కొండంత అండ కేసీఆరే అన్న జగదీష్ రెడ్డి, బీఆర్ఎస్ పాలనకు ప్రస్తుత ప్రభుత్వ పాలనను ప్రజలే బేరీజు వేసుకోవాలని సూచించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం ఖాయమన్నారు. మన మన పిల్లల భవిష్యత్తు కోసం మే13న కారు గుర్తుకు ఓటు వేసి కంచర్ల కృష్ణారెడ్డి, క్యామ మల్లేషంను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.