సూర్యాపేట : రాష్ట్రంలో సంవత్సర కాలంలోనే పరిస్థితులు అన్నీ తారుమారు అయ్యాయి. అభివృద్ధి ఆగిపోయి ప్రభుత్వ శాఖలు పడకేశాయని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) విమర్శించారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పోలీస్ శాఖ ఒక్కటే (Police department)ప్రశ్నించే గొంతులను అణిచివేసేందుకు పని చేస్తుందన్నారు. స్కూళ్లలో పిల్లలు చనిపోతున్నారని, దవాఖానల్లో మందులు అందుబాటులో లేక డాక్టర్లు బయట నుంచి తెచ్చి వైద్యం చేస్తున్నారన్నారు.
రాష్ట్రంలో కట్టించే శాఖ జాడలేదు కానీ కూలగొట్టే శాఖ మాత్రం ఉందని ఎద్దేవా చేశారు. నల్లగొండలో సినిమా సెట్టింగ్ కన్నా అధ్వానంగా పత్తి కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ శాఖ మంత్రి ప్రారంభించినట్లు ఫొటోలకు ఫోజు ఇచ్చారు. కానీ, నేటి వరకు కొనుగోలు జరగడం లేదు. వడ్లు, పత్తి కొనుగోలు చేయకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. వందల కోట్ల కుంభకోణం ఉందని, అది బయట పెడతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి కొనుగోలు జరపాలని డిమాండ్ చేశారు.
వికారాబాద్లో అధికారులపై ప్రజలు దాడి చేయడం ప్రభుత్వ పరిపాలన విధానానికి నిదర్శనమన్నారు.
మోసపూరిత మాటలను ప్రజలు ప్రశ్నిస్తున్నారని వారిని భయపెట్టేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి హోదాను దిగజార్చారు. సోయ లేకుండా మాట్లాడుతూ మంత్రులు వారి నైజం బయట పెట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడుతున్న మాటలను ప్రజలు గమనిస్తున్నారని, మూసీ నీళ్లతో వాళ్ల నోర్లు బాగు చేసుకోవాలన్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందన్నారు.