నల్లగొండ : రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ(Congress) ఎన్నో అలవిగాని హామీలను ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి(MLA Jagadish Reddy )అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు దేవరకొండ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీజీ విగ్రహానికి వినత పత్రం అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల పేరుతో 420 బూటకపు హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు. వంద రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పి.. 420 రోజులైనా హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదంటూ అబద్ధాలు చెబుతున్నారు. 2021లోనే మా కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మీ బట్టి విక్రమార్క పాల్గొన్నారని తెలిపారు. కేసీఆర్ మానవతా దృక్పథంతో ఆలోచించి ప్రతి నిరుపేదకు రేషన్ కార్డులు రావాలనే ఆలోచనతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆదాయ పరిమితిని సడలించారని పేర్కొన్నారు. రేషన్ కార్డులు జారీ కూడా ఏదో చారిత్రాత్మక కార్యక్రమమని ఎన్నడూ చెప్పుకోలేదని తెలిపారు. కానీ, రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చారిత్రాత్మకమైన కార్యక్రమం అంటున్న ముఖ్యమంత్రి భావదారిద్య్రాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
గోబెల్స్ సిగ్గుపడేలా కాంగ్రెస్ అబద్దాలను ప్రచారం చేసిందని విమర్శించారు. తెలంగాణ యువతకు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి రాహుల్ గాంధీ మొహం చాటేసారు. మా ప్రభుత్వం అధికా రంలో ఉన్నప్పుడు 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామన్నారు. కరోనా సమయంలో కూడా రైతు బంధు క్రమం తప్పకుండా వేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది అని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చాక 412 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అని తెలిపారు. సుమారు 100 మందికి పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చలేక బీఆర్ఎస్ పార్టీ పై నిందలు వేస్తున్నదని మండిపడ్డారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.