మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి వాదన, ఆక్రోశం, ఆవేదన చూస్తుంటే ఆల్రెడీ చర్లపల్లి జైలులో ఉన్నట్టు ఉంది. జ్యుడీషియల్ ఆర్డర్ ఇస్తామని మేము అనలేదు. అయితే వారు, మేము సత్యహరిశ్చంద్రులం, ఆ వంశంలోనే ఉన్నాం. ఆయన తర్వాతే కలియుగంలో కేసీఆర్ జన్మించిండని వారే అడిగారు. మీరు నిజాయతీ పరులు, సత్యహరిశ్చందులైతే మీరెందుకు అక్కడ వాదన వినిపించలేదు?
– రేవంత్‌రెడ్డి
సీఎం ఎందుకు జైలు జీవితం గుర్తు చేసుకుంటున్నారు. చర్లపల్లి జైలు జీవితం వారికి అనుభవం కాబట్టి. వారు మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు. మళ్లీ ఎట్లాగూ అక్కడికే వస్తానని అనుకుంటున్నాడేమో. మా జ్ఞపకాలు మాకుంటయి. వారి జ్ఞాపకాలు వారికి ఉంటయి. ఉద్యమకాలంలో నన్ను అరెస్టు చేశారు కాబట్టి చంచల్‌గూడ జైలు గుర్తుంది. ఆయన సంచులు మోశారు కాబట్టి చర్లపల్లి మాత్రమే గుర్తుంటుంది.
– జగదీశ్‌రెడ్డి
బీహెచ్ఈఎల్కు ‘బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ వర్క్’ చేసే అధికారం లేదు. ఆ సివిల్ వర్క్‌లో బీఆర్ఎస్ అవినీతికి పాల్పడింది. వారి బినామీలు, బంధువులు, అయినోళ్లకు ఇచ్చుకుంది. వందల కోట్ల కుంభకోణానికి పాల్పడింది. విచారణకు ఇస్తే ఎందుకు గుండెలు బాదుకుంటున్నారు? బీహెచ్ఎల్ నుంచి సివిల్ వర్క్‌లు ప్రైవేట్‌వాళ్లకు, వాళ్ల బినామీలకు ఇచ్చారు. అందులో భారీ మోసం జరిగింది
– సీఎం రేవంత్‌రెడ్డి
సబ్ కాంట్రాక్టులు ఇచ్చామని సీఎం చెబుతున్నారు. అందులో ఒక్కడు కూడా కాంట్రాక్టర్, సబ్ కాంట్రాక్టర్ నాకు తెల్వదు. ఉంటే గింటే మీ చుట్టాలు అందులో ఉండాలె. నా చుట్టపోడు ఒక్క కాంట్రాక్టర్ లేడు. నా చుట్టపోడు ఒక్కడ్ని నిరూపించినా దేనికైనా సిద్ధంగా ఉన్నా. కాంట్రాక్టులు చేసే అలవాటు మీది. బీహెచ్ఈఎల్కు వద్దు.. అదానీకి ఇవ్వాలనేది మీ ఆలోచన
– జగదీశ్‌రెడ్డి
జార్ఖండ్‌లో 2017, జూలై 18న 2,400 మెగావాట్ల పవర్ ప్లాంట్‌కు టెండర్లు పిలిస్తే.. ఒక కొరియన్ కంపెనీ, బీహెచ్ఈఎల్కు, ఎల్అండ్టీ వచ్చాయి. అక్కడ ఇదే బీహెచ్ఈఎల్ 18శాతం తక్కువగా కోట్ చేసి, ఆ వర్క్ సొంతం చేసుకుంది
– సీఎం రేవంత్‌రెడ్డి
2017 మార్చి చివరి నాటికి పూర్తి కాగలిగిన ప్లాంట్లను సబ్ క్రిటికల్ ద్వారా కూడా పూర్తి చేసుకోవచ్చు. ఆ తర్వాత పూర్తయ్యేవి సబ్ క్రిటికల్లోకి రావు అన్ని కేంద్రం తేల్చి చెప్పింది. అప్పటి విద్యుత్తు అవసరాల దృష్ట్యా బీహెచ్ఈఎల్తో కేసీఆర్ మాట్లాడారు. కేటీపీపీని ఇచ్చాం. సివిల్ వర్క్‌ను చేసుకుంటే రెండేండ్లలో పూర్తి చేస్తామని వారు చెప్పారు. మార్చి 2017 లోపే పూర్తి చేస్తామని చెప్పారు. ఆ తర్వాత ఎన్జీటీ కేసు, కరోనా వల్ల ఆలస్యమైంది. అయినా తక్కువ సమయంలో పూర్తిచేశాం. యాదాద్రితోపాటు, కొత్తగూడెం ప్రాజెక్టు కూడా బీహెచ్‌ఈఎల్‌కే ఇచ్చాం’
– జగదీశ్‌రెడ్డి
‘కుంభకోణానికి ఆద్యులు మాజీ మంత్రి జగదేశ్‌రెడ్డి, ఆయన గురువు కేసీఆర్. వారి అవినీతి చరిత్ర’
– సీఎం రేవంత్‌రెడ్డి
‘నేను మాట్లాడే మాటల్లో ఏమైనా తప్పుందా? ఎందుకు ముఖ్యమంత్రి భుజాలు తడుముకుంటూ దూసుకొచ్చిండు? మీ దొంగతనం దొరికిపోతుంది కాబట్టే భయపడ్డరు. ఎస్.. మా నాయకుడు కేసీఆర్ హరిశ్చంద్రుడే. మీలాగా సంచులు మోసే చంద్రుడు కాదు. మీ చంద్రుడికి సంచులు మోసి జైలుకు పోయింది నువ్వు. మా నాయకుడు హరిశ్చందుడ్రే
– జగదీశ్‌రెడ్డి
గుజరాత్‌కు చెందిన ఇండియా బుల్ అనే కంపెనీ అక్కడ 1000 మెగావాట్ల నిర్మాణానికి సబ్క్రిటికల్లో బీహెచ్ఈఎల్తో ఒప్పందం చేసుకుంది. మళ్లీ యాక్ట్ మారడంతో వాళ్లు తాము కట్టిన పైసలు ఇవ్వాలని అడిగితే, మీరే మా ఖర్చుకు ఎక్కువ ఇవ్వాలని బీహెచ్ఈఎల్ ఎదురు తిరిగింది. అప్పుడు బీహెచ్ఈఎల్ జగదీశ్‌రెడ్డిని పట్టిస్తే, ఇండియా బుల్ నుంచి వెయ్యి కోట్లు మెక్కి సబ్ కాంట్రాక్టులు వాళ్ల వారికి ఇచ్చుకున్నారు
– సీఎం రేవంత్‌రెడ్డి
ఆ ఇండియా బుల్స్ ఎక్కడో తెల్వదు. మీరే వారిని పట్టుకొచ్చారు. వారి దగ్గరకు వీరెందుపోయారో? దేనికి దొరికిండ్రో అది సీఎంకే ఎరుక. ఆ బుల్స్ సంగతీ సీఎంకే ఎరుక. ప్రతీసారి వీళ్లు కేసీఆర్ గురించి మాట్లాడతారు. వీళ్లు కేసీఆర్ కాలి గోటికి సరిపోతరా?
– జగదీశ్‌రెడ్డి