సూర్యాపేట, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగుల ఆందోళనలతో రగిలిపోతున్న హైదరాబాద్ అశోక్‌నగర్ మాదిరిగానే తెలంగాణ అంతటా అట్టుడుకుతున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చిన అశోక్‌నగర్‌లో నలుగురు జమైతే సీఎం రేవంత్‌కు వణుకు పుడుతుందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిరుద్యోగులపై నిర్బంధం కొనసాగుతుందని, అరెస్టుల పర్వం కొనసాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేటలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి హోదాను మరిచి దిగజారుడు మాటలు మాట్లాడతున్న రేవంత్‌రెడ్డి తీరుతో రాష్ట్ర ప్రజల పరువు పోయేలా ఉన్నదని విమర్శించారు. రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడాన్ని రేవంత్ మానేస్తే అందరి పరువు కాపాడిన వారవుతారని హితవు పలికారు.
మూసీ కూల్చివేతల అనంతరం భయంతో సెక్యూరిటీని పెంచుకున్న రేవంత్‌రెడ్డి.. నేడు సెక్యూరిటీ లేకుండా వస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడని, ఆ ప్రగలాల్భాలు మాని మాటపై నిలబడి ఒంటరిగా వెళ్లాలని సవాల్ విసిరారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ పెంచిన ఆదాయాన్ని కాపాడినా చాలని సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సూచించారు. 2014కు ముందు 70 వేల కోట్లు కూడా లేని బడ్జెట్‌ను కేసీఆర్ రెండున్నర లక్షల కోట్లకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ 420 హామీలు, ఆరు గ్యారంటీలు ఇవ్వకపోయినా కేసీఆర్ తెచ్చిన పథకాలు చెడగొట్టకపోతే చాలని తెలిపారు. రేవంత్ చర్యలు పేదలకు కష్టం కలిగేలా, ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగించేలా, అభివృద్ధిని అడ్డుకునేలా ఉన్నాయని చెప్పారు.