నల్లగొండ : మున్సిపాలిటీ శాఖలో నిర్లక్ష్యం అలుముకుంది. ప్రజలకు తాగునీటినందించే వాటర్ ట్యాంకు లను (Water tank )నిత్యం తనిఖీ చేసే సమయం కూడా అధికారులకు లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (MLA Jagadish Reddy) మండిపడ్డారు. సోమవారం నాగార్జునసాగర్‌లో (Nagarjunasagar) కోతులు పడి చనిపోయిన వాటర్ ట్యాంక్‌ను ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, నోముల భగత్‌తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాటర్ ట్యాంకులో పడి కోతులు చనిపోయిన నీళ్లు తాగి ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే వారికి వైద్య పరీక్షలు చేయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు పాలన గాలికి వదిలేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. తెలగాణలో దోచుకుని ఢిల్లీకి ముడుపులు పంపేందుకే రేవంత్ రెడ్డి సర్కార్ బిజీగా ఉందని ఆరోపించారు.
ఇప్పటికి గ్రామాల్లో తాగునీరు లేక ప్రజలు అల్లాడుతున్నారు. సాగునీటికి నీళ్లు అందించమంటే కూడా ప్రభుత్వానికి చేతకాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ బయటకి రాగానే ప్రాజెక్టుల నుంచి నీళ్లను వదిలారని గుర్తు చేశారు. ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో తాగు నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.