సూర్యాపేట, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): రైతుల రుణమాఫీ డబ్బు ఎగ్గొట్టాలనే దురాలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం కందగట్ల గ్రామంలో ఓ కార్యకర్త ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే వద్దకు గ్రామానికి చెందిన 25 మంది రైతులు చేరుకొని తమకు రుణమాఫీ కాలేదని గోడు వెళ్లబోసుకున్నారు. బ్యాంకుల్లో తమకు రూ.2 లక్షల లోపు మాత్రమే అప్పు ఉన్నదని, అయినా మూడు విడుతల్లోనూ మాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ రుణమాఫీపై సీఎం బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటుచేసి వివరాలు సేకరించారని, 50 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.49 వేల కోట్ల రుణాలు ఉన్నట్టు బ్యాంకర్లు చెప్పారని తెలిపారు.
అన్ని చేయలేమనే భయంతో రూ.39 వేల కోట్లే అంటూ తొలి నుంచి ప్రచారం చేశారని గుర్తు చేశారు. అనంతరం రూ.31 వేల కోట్లు అని క్యాబినెట్లో తీర్మానం చేసి తీరా బడ్జెట్లో రూ.26 వేల కోట్లు అన్నారని చెప్పారు. బడ్జెట్ సందర్భంగా ఆ రోజు బీఆర్ఎస్ తరఫున తాము మాట్లాడే సందర్భంలో రూ.26 వేల కోట్లతో నూరుశాతం మాఫీ ఎలా చేస్తారని ప్రశ్నించినా వారి నుంచి స్పందన కరువైందని చెప్పారు. తీరా చూస్తే మూడు విడుతలు కలిపి 20 లక్షల మంది రైతులకు రూ.17,900 కోట్లే మాఫీ చేసినట్టు ప్రకటించారని తెలిపారు. రుణమాఫీ కాని రైతులు అధికారులకు దరఖాస్తు పెట్టుకోమంటున్నారని, అధికారుల వద్దకు వెళ్లి బల్లకింద చెయ్యిపెట్టే పరిస్థితి వస్తదని విమర్శించారు.