సూర్యాపేట : రెండేళ్లుగా రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకపాలన సాగుతోంది. కాంగ్రెస్ చెడు ఆలోచనలు భోగి మంటల్లో కాలి పోవాలి అని సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. బోగి పండుగ సందర్బంగా సూర్యాపేట పట్టణంలోని పలు వార్డుల్లో జరిగిన బోగి మంటల వేడుకలో పాల్గొని అందరికి పండుగ శుభాకాంక్షలు తెలిపి మీడియాతో మాట్లాడారు. సంక్రాంతి అంటే రైతుల పంటల పండుగ.
పతంగులతో చిన్నారులు, ముగ్గులతో మహిళలు మురిసే పండుగ అన్నారు. బోగిమంటల్లో అందరి చెడు ఆలోచనలు తొలగిపోవాలని ఆకాంక్షించారు. చిన్నారులు తగు జాగ్రత్తలు పాటిస్తూ పతంగులు ఎగుర వేయాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి పట్ల, సంక్షేమం పట్ల సోయిలేని కాంగ్రెస్, ఆపార్టీ పాలకుల తీరు ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఉందన్నారు. రెండేళ్ల పాలనలో అరాచకాలు, అక్రమాలు తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. ఈ ఏడాది నుంచైనా మంచి పరిపాలన కొనసాగాలని ఆకాంక్షిద్దామన్నారు. ఆయన వెంట మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, తదితరులు ఉన్నారు.