సూర్యాపేట, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): ఓటుకు నోటు కేసు విషయంలో రేవంత్‌రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని, అందుకే ఈ కేసును మరో రాష్ర్టానికి బదిలీ చేయాలని తాను సుప్రీం కోర్టును ఆశ్రయించినట్టు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు.
గతంలో విచారణ కొనసాగకుండా అనేక రకాల పిటిషన్లు వేసి ఆపే ప్రయత్నం చేశాడని, ఈయన అధికారంలోకి రాగానే తొందరపడి దొంగతనం నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడనే అనుమానం కలుగుతున్నదని అన్నారు. నేరస్థుడు.. నిందితుడే అధికారంలో ఉన్నందున కేసు సజావుగా సాగదనే విషయం అందరికీ తెలుసని పేర్కొన్నారు. అందుకే పక్క రాష్ట్రానికి ఇవ్వాలని పిటిషన్ వేస్తే దాన్ని సుప్రీం కోర్టు పరిగణనలోకి తీసుకున్నట్టు చెప్పారు.
ఇది కొత్తేమీ కాదని, గతంలో తమిళనాడులో జయలలిత ప్రతిపక్షంలో ఉండి కేసుల పాలు కాగా, అధికారంలోకి వచ్చిన తరువాత సుప్రీంలో పిటిషన్లు వేస్తే కర్ణాటకకు మార్చడం, నేరం నిరూపణై శిక్ష కూడా పడటం తెలిసిందేనని ఆయన పేర్కొన్నారు. ఇక్కడా రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి హోంశాఖను తన ఆధీనంలోనే ఉంచుకోవడంతో ఏసీబీ, ప్రాసిక్యూషన్‌ను నియంత్రించే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.
సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. అందుకే ఈ కేసుపై రేవంత్‌రెడ్డి ప్రభావం ఉండకుండా మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే తన వాదన పరిగణనలోకి తీసుకుందని తెలిపారు. కేవలం విచారణ సజావుగా సాగాలనేదే తన ఉద్దేశమని ఆయన చెప్పారు.
మోసపూరిత బడ్జెట్..
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ఇంత మోసపూరిత బడ్జెట్‌ను చరిత్రలో చూడలేదని అన్నారు. అధికారంలోకి రాగానే లంకె బిందెలు ఉన్నాయనుకున్నామన్న ముఖ్యమంత్రి రేవంత్.. మహిళలకు ఉచిత ప్రయాణం అంటూ దారుణమైన మోసం చేశారని ఆరోపించారు.
కాంగ్రెస్ గెలుపును భుజాలపై వేసుకొని ఇంటింటికీ తిరిగిన నిరుద్యోగ యువత ప్రస్థావన బడ్జెట్లో లేదని, ఇంతకు మించిన ద్రోహం మరొకటి ఉండదని విమర్శించారు. మహిళలకు నెలకు రూ. 2,500 అన్నారు, ఆటో కార్మికులను జూనియర్ ఆర్టిస్టులని ఆటోలను తగులపెట్టుకుని డ్రామాలు చేస్తున్నారని హేళన చేసి మాట్లాడారని దుయ్యబట్టారు.
ఆటో డ్రైవర్ల జీవన భృతికి సంబంధించి బడ్జెట్లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ప్రతి విద్యార్థికి 5 లక్షల రూపాయలు చదువుకునేందుకు అన్నారు. 5 రూపాయలు కూడా పెట్టకుండా మోసం చేశారని విమర్శించారు. హామీల అమలుపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు గ్రామాల్లో నిలదీయాలని పిలుపునిచ్చారు.