సూర్యాపేట, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): గోదావరి జలాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ రైతాంగాన్ని నట్టే ట ముంచబోతున్నారని, స్వాతంత్య్ర దిన వేడుకల్లో ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని మా జీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు. నిజంగా బనకచర్లను అడ్డుకునే ఆలోచన ఉంటే ఇప్పటికే కొద్ది సంవత్సరాలుగా కాళేశ్వరం నుంచి 240 టీఎంసీల నీళ్లను వాడుకున్న విషయాన్ని రేవంత్ ఉటంకించి ఉండేవారని తెలిపారు. ఇది చెప్పకపోతే బనకచర్లకు అనుమతి ఇచ్చినట్టేనని స్పష్టంచేశారు. రేవంత్ నేరుగా చంద్రబాబుకు దాసోహమై తెలంగాణను నట్టేట ముంచుతూ రైతులకు ద్రోహం చేసినట్టేనని పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు స్వాతంత్య్ర దినోత్సవాల్లో చంద్రబాబు, రేవంత్‌రెడ్డి ఇద్దరి ఉపన్యాసాలను పరిశీలిస్తే, వారిద్దరు స్పష్టమైన అవగాహనతో ఉన్న విషయం అర్థమవుతుందని చెప్పారు.
సముద్రంలోకి పోయే నీళ్లకు అడ్డుకట్టవేసి బనకచర్ల నిర్మించి తీరుతామని చంద్రబాబు చేసిన ప్రసంగానికి కొనసాగింపుగా ఇక్కడ కాళేశ్వరమే లేదంటూ కేసీఆర్‌పై చేసిన ఆరోపణలు ఉన్నాయని అన్నారు. ఇది కేవలం గురుదక్షిణో మరేదో కానీ బనకచర్ల కోసమే చంద్రబాబు ఉపన్యాసానికి మద్దతుగానే రేవంత్ ఉపన్యాసం చేశారని విమర్శించారు. వాస్తవానికి ఇక్కడ కాళేశ్వరం ఉన్నదని, దాని ద్వారా 240 టీఎంసీల నీళ్లు వాడుకుంటున్నామని, అందుకే గోదావరిలో చుక్కనీళ్లు లేవని, ఎట్టిపరిస్థితుల్లో బనకచర్ల కట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వ వాదన ఉండాలి తప్ప అసలు కాళేశ్వరమే లేదని చెప్పడం పట్ల చంద్రబాబుకు వత్తాసు పలకడమేనని మండిపడ్డారు.
కాళేశ్వరంపై ఉన్న నందిమేడారం, కన్నెపల్లి, గాయత్రి పంప్‌హౌస్‌లను ప్రారంభించారంటే కాళేశ్వరం ప్రాజెక్టు అంతా బాగున్నట్టేనని, ఇక ప్రారంభించాల్సిందల్లా కన్నెపల్లి, సుందిల్ల వద్ద గోలివాడ పంప్‌హౌస్‌లను మాత్రమేనని ఈ రెండింటిని ఆన్ చేస్తే ప్రాజెక్టు మొత్తం పూర్తి స్థాయిలో పని చేస్తుందని తెలిపారు. తెలంగాణ మొత్తం ఏకమై చంద్రబాబు, రేవంత్ కుట్రలను ఛేదిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ బనకచర్లను కట్టకుండా వ్యతిరేకించి తీరుతామని స్పష్టంచేశారు. కాళేశ్వరానికి ఉన్న 240 టీఎంసీలు కాకుండా గోదావరిలో ఒక్క చుక్క నీళ్లు లేవు, మిగులు జలాల సమస్య లేదంటూ ఇంకొ ట్రిబ్యునల్ వచ్చిన తరువాతే ఎన్ని నీళ్లు ఉన్నాయనేది తెలుస్తుందని, అప్పటివరకు బనకచర్లను అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు.