Jagadish Reddy | హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఆరు గ్యారెంటీల హామీలు ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు అంటూ తప్పించుకోవాలని చూస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. శనివారం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరును విమర్శించారు. కాంగ్రెస్ వచ్చింది.. కరెంట్ కథ మొదలైందని ప్రజలు అప్పుడే అనుకుంటున్నారని చెప్పారు. మంత్రులు అధికారులపై చిందులేసినంత మాత్రాన అబద్ధాలు నిజాలు అయిపోవని అన్నారు. ఒక్క చాన్స్ అని అడిగి, తీరా అధికారంలోకి వచ్చాక హామీల నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు.
సర్కార్ ఏర్పడి 20 రోజులు దాటినా చేయాల్సిన పనిని పక్కన పెట్టి గత ప్రభుత్వంపై సాకులు చెస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం తప్పులు చేసిందని భావిస్తే సిట్టింగ్ జడ్జితోకానీ, విచారణ కమిషనో, కమిటీయో వేసి వాస్తవాలు తేల్చాలని బీఆర్ఎస్ పార్టీయే డిమాండ్ చేసిందని గుర్తుచేశారు. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భట్టి ఏనాడూ అసెంబ్లీలో కరెంట్ కోతలపై మాట్లాడలేదని తెలిపారు.
దేశంలో అప్పుల్లేని రాష్ర్టాన్ని చూపిస్తారా? అని కాంగ్రెస్ నేతలకు జగదీశ్‌రెడ్డి సవాల్ విసిరారు. అలాగే దేశంలో ఏ రాష్ట్రంలోనైనా లాభాలతో నడిచే విద్యుత్తు సంస్థ ఉంటే చూపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నిన్నటి వరకు పాలించిన రాజస్థాన్ విద్యుత్తు సంస్థ రూ.89 వేల కోట్ల నష్టాలు, రూ.53 వేల కోట్ల అప్పులున్నాయని వివరించారు. అంత అప్పు ఉన్నా రైతాంగానికి ఆరేడు గంటలకు మించి కరెంటు ఇవ్వలేదని అన్నారు. తెలంగాణలో అప్పోసొప్పో చేసి అన్ని రంగాలకు కరెంట్ ఇచ్చామని, రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇచ్చామని చెప్పారు.
దేశంలో నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని చెప్పుకోవటానికి తాము గర్వపడుతున్నామని అన్నారు. ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో విద్యుత్తు సంస్థలకు ఉన్న అప్పులను ఏకరువు పెట్టారు. విద్యుత్తు సంస్థలకు మధ్యప్రదేశ్‌లో రూ.56 వేల కోట్లు, ఉత్తరప్రదేశ్‌లో రూ.70 వేల కోట్లు, ఏపీలో రూ.25 వేల కోట్లు, మహారాష్ట్రలో రూ.25 వేల కోట్లు నష్టాలు ఉన్నాయని వివరించారు. గతంలో ఇవ్వని కరెంట్‌కు కాంగ్రెస్ పార్టీ అప్పులు తెచ్చిందని ఉదహరించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రూ.28 వేల కోట్లు అప్పు తెచ్చి తీరా మూడు, నాలుగు గంటలకు మించి కరెంట్ ఇవ్వలేదని తెలిపారు. కాంగ్రెస్ అప్పుడు తెచ్చిన అప్పుతో కలిపి అంతా రూ.80 వేల కోట్లకు చేరిందని వివరించారు.
దేశంలో 16 రాష్ర్టాల్లో సుమారు 39 ప్రాజెక్టులు సబ్‌క్రిటికల్ టెక్నాలజీతో నడుస్తున్నాయని, అవన్నీ 2014 తర్వాత ప్రారంభించినవేనని జగదీశ్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోనూ అదే సబ్‌క్రిటికల్ టెక్నాలజీతో ప్రాజెక్టులు నడుస్తున్నాయని వెల్లడించారు. ఈ టెక్నాలజీని ప్రపంచమంతా వాడుతున్నదని, తాము చట్టప్రకారమే దాన్ని వాడామని వివరించారు. కొత్తగా పెట్టేవే సూపర్ క్రిటికల్ టెక్నాలజీవి పెట్టాలన్న విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తిస్తే మంచిదని గుర్తుచేశారు.
లబ్ధిదారుని బ్యాంకు ఖాతా నంబర్ లేకుండానే ప్రజాపాలన దరఖాస్తులు పెట్టడం విడ్డూరంగా ఉన్నదని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. బ్యాంకు ఖాతా నంబర్ లేకుండా ఆరు గ్యారెంటీలను ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి దరఖాస్తులు లేకుండానే పథకాలకు అర్హులను గుర్తించి నేరుగా నగదును అకౌంట్లలో జమ చేశామని గుర్తుచేశారు. కొత్తవారికి కూడా తెల్లరేషన్ కార్డులు ఇచ్చి గ్యారెంటీలు వర్తింపజేస్తమని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ.. అసలు రేషన్‌కార్డు ఎలా దరఖాస్తు చేయాలో చెప్పలేదని ఎద్దేవా చేశారు. ఉద్యమకారులుగా గుర్తించేందుకు ఎఫ్ఐఆర్లో పేరుండాలని, జైలుకు పోయినోళ్లకే ఇస్తమని హామీ ఇచ్చినప్పుడే ఎందుకు చెప్పలేదని నిలదీశారు.
అధికారులను దబాయించి, బెదిరించి, ఖబర్దార్ అని హెచ్చరించే ధోరణితో వ్యవహరిస్తే పనులు కావనే విషయాన్ని మంత్రులు గుర్తించాలని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. మంత్రులుగా ఉన్నవాళ్లు రౌడీలు, గూండాలుగా పనిచేయాలని చూస్తున్నారా? అని ప్రశ్నించారు. అధికారుల అనుభవాన్ని, వారి మేధోశక్తిని పరిగణనలోకి తీసుకొని వారి ద్వారా పనులు ఎలా చేయించుకోవాలో తెలుసుకోవాలని సూచించారు. ఇప్పటికైనా అబద్ధాలు చెప్పటం మాని, అసలు విషయంపై దృష్టిసారించాలని చురక అంటించారు.
సర్కారును నడపటం చేతగాక కాంగ్రెస్ పార్టీ కుంటిసాకులు చెప్తున్నదని జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో అడ్డగోలు హామీలిచ్చి ఇప్పుడేం చేయాలో అర్థం కాక డ్రామాలు ఆడుతున్నదని మండిపడ్డారు. ఎన్ని అబద్ధాలు ఆడినా ప్రజల నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. ప్రభుత్వానికి విద్యుత్తు సంస్థలను నడపటం చేతగాకపోతే అప్పిచ్చిన ఆ ప్రభుత్వ సంస్థలకే ఇస్తే అవి నడుపుకునేందుకు సిద్ధంగా ఉంటాయని సూచించారు. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, 24 గంటల కరెంట్ విషయంలో తప్పించుకోవటానికి వీల్లేదని అన్నారు.