నల్లగొండ : నెల రోజులుగా యూరియా కొరత తీవ్రంగా వేదిస్తుంది. ఇది ఇంకా తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. రైతులు నిద్రాహారాలు మాని చెప్పులు పెట్టుకుని అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. నల్లగొండలోని బీఆరెస్ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎకరానికి రూ.20 వేల పెట్టుబడి పెడితే ఒక్క బస్తా యూరియా మీద దిగుబడి ఆధార పడి ఉంది. కానీ ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదని మండిపడ్డారు.
కెసిఆర్ వేసవిలోనే గోదాముల్లో ఎరువులు నిల్వ చేసి పెట్టేవారు. వ్యవసాయ రంగం పై రెగ్యులర్ రివ్యూ చేస్తూ రైతుల ఇబ్బందులు పడకుండ జాగ్రత్త పడేవాళ్లమని గుర్తు చేశారు. కనీసం సీజన్లో నాలుగు సార్లు రివ్యూ జరిగేది రైతులు విత్తనాల కోసం, ఎరువుల కోసం ఇబ్బందులు పడడం దారుణం. గతంలో ధాన్యం కొనుగోళ్లకు రైతులు ఇబ్బంది పడ్డారు. కరెంట్ కోసం ఇబ్బందులు మొదలయ్యాయి. యూరియా కొరత వెనక కొంతమంది మంత్రులు, అధికారులు ఉన్నారని ఆరోపించారు. కమీషన్ల కోసం రైతులను ఇబ్బంది పెడుతున్నారు.
రైతులను కాళ్లు పట్టుకునే దుస్థితికి తెచ్చారు
ఎరువులను బ్లాక్ మార్కెట్ చేసేందుకు కమీషన్లు తీసుకుంటున్నారని విమర్శించారు. గతంలో నల్లగొండ మంత్రి ధాన్యం కొనుగోళ్లలోను కమీషన్లు తీసుకుని రైతులను గాలికి వదిలేసారు. గతంలో మేము వస్తే అన్ని తెస్తామన్నారు. ఢిల్లీకి 56 సార్లు వెళ్లిన సీఎం కనీసం ఎరువులు తేలేవా? అని ప్రశ్నించారు. పోలీసులతో పహారా, లాఠీఛార్జ్ లతో రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. ఢిల్లీకి వెళ్లి కాళ్లు పట్టుకుని పదవులు తెచ్చుకునే కాంగ్రెస్ నేతలకు..రైతులను కాళ్లు పట్టుకునే దుస్థితికి తెచ్చారని ధ్వజమెత్తారు. నల్లగొండ నియోజకవర్గంలో మంత్రి పూర్తిగా విఫలం అయ్యారన్నారు.
మంత్రులు సిగ్గు పడాలి
ఇద్దరూ మంత్రులు ఉండి కూడా జిల్లాపై కనీసం రివ్యూ చేయలేదన్నారు. మంత్రుల తీరుతో నల్లగొండ జిల్లా ప్రతి రంగంలో తిరోగమానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ నియోజకవర్గంలో సాగు నీళ్ల కోసం రైతులు రోడ్డు ఎక్కుతుంటే మంత్రులు సిగ్గు పడాలన్నారు. మంత్రికి చేత కాక అధికారులతో తప్పడు పద్ధతుల్లో ప్రకటనలు చేయిస్తున్నారు.
కొరత లేదని తప్పుడు ప్రకటనలు చేసే అధికారులు తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు.మంత్రుల బాధ్యతను మీరు నెత్తిన వేసుకుని ఇబ్బందులు పడొద్దని సూచించారు. అధికారుల ప్రకటన నిజం అయితే రైతులు ఇవ్వాళ కూడా ఎందుకు క్యూ లైన్ల లో ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లా రైతులు ప్రభుత్వం మెడలు వంచేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే లు గదారి కిశోర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.