Harish Rao | హైదరాబాద్ : 2004 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి జీవం పోసిందే టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఉట్టిగనే తమకు పదవులు ఇచ్చిందని రేవంత్ రెడ్డి మాట్లాడటం సరికాదని హరీశ్‌రావు మండిపడ్డారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే కాకుండానే హరీశ్‌రావును మంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని రేవంత్ చేసిన వ్యాఖ్యలకు హరీశ్‌రావు వివరణ ఇచ్చారు.
శాసనసభ్యుడు కాకుండా తనను మంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని సీఎం మాట్లాడారు. ఆ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీది. చంద్రబాబు హయాంలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని కాంగ్రెస్ పార్టీకి జీవం పోసింది కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు ప్రణబ్ ముఖర్జీతో హిమాచల్ భవన్లో చర్చలు జరిగినప్పుడు వెంకటస్వామి, మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి, కేసీఆర్, ఆలే నరేంద్ర నేను ఆ చర్చల్లో ఉన్నాను. పొత్తుల చర్చలు జరిగినప్పుడు తప్పకుండా ఈ రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తామని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నా ఇంట్లో కూర్చొని తెలంగాణ రాష్ట్రం తీసుకొని పో అని ప్రణబ్ అన్నారు. మేం పొత్తు పెట్టుకోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మీరు ఏదో గెలిస్తే మాకు పదవులు ఇవ్వలేదు. మేం కాంగ్రెస్ పార్టీకి భిక్ష పెట్టినం. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సహకరించాం అని హరీశ్‌రావు తెలిపారు.
కేసీఆర్‌ను ఎంపీ చేశామని మాట్లాడుతున్నారు. ఆ రోజు పొత్తు పెట్టుకున్నప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు సోనియా అధ్యక్షతన యూపీఏ సమావేశం జరిగింది. సోనియా గాంధీ కేసీఆర్‌ను కేంద్ర మంత్రి వర్గంలో చేరాలని కోరారు. కానీ కేసీఆర్ ఒక మాట చెప్పారు. కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ లో తెలంగాణ అంశాన్ని పెడితేనే నేను కేబినెట్లో చేరుతాను అని చెప్పారు. నేను పదవుల కోసం రాలేదు.. తెలంగాణ కోసం ఢిల్లీకి వచ్చాను అని కేసీఆర్ చెప్పారు. కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌లో పెట్టించి, నాటి ఉభయసభలను ఉద్దేశించి చేసిన రాష్ట్రపతి ప్రసంగంలో సంప్రదింపుల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయిస్తామని చెప్పించింది కేసీఆర్. షిప్పింగ్ పోర్ట్ ఫోలియో ఇస్తే.. డీఎంకే పార్టీ మాకు ఆ శాఖ ఇవ్వాలని, లేదంటే యూపీఏ నుంచి బయటకు పోతామని చెబితే.. ఈ పోర్ట్‌పోలియో అవసరం లేదు. నేను తెలంగాణ కోసం వచ్చానని కేంద్ర మంత్రి పదవిని కేసీఆర్ స్వచ్ఛందంగా వదులుకున్నా చరిత్ర కేసీఆర్‌ది టీఆర్ఎస్ పార్టీది అని హరీశ్‌రావు గుర్తు చేశారు.
పదవులను గడ్డి పోచల్లాగా త్యజించిన చరిత్ర ఈ దేశంలో ఎవరికైనా ఉందంటే అది కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీకి ఉంది. త్యాగాల పునాదుల మీద తెలంగాణ తెచ్చిన చరిత్ర ఉంది. మేం ఏదో పదవుల కోసం పాకులాడినం అన్నట్టు సీఎం మాట్లాడడం సరికాదు. ఆ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి ఏబీవీపీలో షురువైండు.. టీఆర్ఎస్లో పని చేసిండు, తెలుగుదేశంలో పోయిండు, కాంగ్రెస్‌లో పోయిండు.. మరి రేపు యేడ ఉంటడో. పార్టీలు మారిన చరిత్రలు మీకున్నాయి.. కానీ మాకు అట్లాంటిది ఏం లేదు అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.