రాష్ట్రంలో సంపూర్ణంగా రుణమాఫీ కాలేదని కోదండరెడ్డి, కోదండరాంరెడ్డి, ఆది శ్రీనివాస్ ముగ్గురూ చెప్పారు. వారు చెప్పిందే నేను చెప్పాను. మాఫీ జరిగితే రాష్ట్రవ్యాప్తంగా రైతులు రోడ్డెందుకు ఎక్కుతారు. సీఎం దిష్టిబొమ్మను ఎందుకు దహనం చేస్తారు? ప్రతి అంశాన్నీ రాజకీయం చేయడం తగదు. ఇప్పుడు చెప్పు ఏట్లో ఎవరు దూకాలి?
-హరీశ్‌రావు
Harish Rao | హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులే రుణమాఫీ కాలేదు అంటున్నరని, దీన్ని బట్టి ఎవరు రాజీనామా చేయాలి? ఎవరు ఏటిలో దూకి చావాలో.. ఎవరికి చీము నెత్తురు లేదో.. ఎవరు అమరవీరుల స్థూపం దగ్గర ముకు భూమికి రాయాలో..ఎవరు రాజీనామా చెయ్యాలో సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఎక్స్‌వేదికగా ప్రశ్నించారు.
రాష్ట్రంలో పాక్షికంగా మాత్రమే రుణమాఫీ జరిగింది.. కోదండరెడ్డి, కోదండరాంరెడ్డి, ఆది శ్రీనివాస్ ముగ్గురూ రుణమాఫీ సంపూర్ణంగా కాలేదని చెప్తున్నదే తానూ చెప్పానని ఆయన స్పష్టం చేశారు. రూ. 31 వేల కోట్లు అని చెప్పి రూ.17 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారు అని తాను అంటే రంకెలెందుకు వేస్తున్నారని మండిపడ్డారు.
రుణమాఫీ అయి ఉంటే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఎందుకు రోడ్డెకి నిరసనలు తెలియచేస్తున్నారని, సీఎం దిష్టిబొమ్మలు ఎందుకు దహనం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రతీ అంశాన్ని రాజకీయకోణంలో చూడటం, తొండి చేసైనా గెలిచామనే వైఖరి ప్రదర్శించడం అవివేకమే అవుతుందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి కండ్లు తెరిచి, రుణమాఫీ ప్రక్రియను సమగ్రంగా పూర్తి చేసి రైతులందరికీ న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.