Harish Rao | హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ):రాష్ట్రంలో ప్రభుత్వ విద్యావ్యవస్థ సర్వనాశనమవుతున్నదని, విద్యాశాఖ తనవద్దే ఉన్నా సీఎం రేవంత్‌రెడ్డి పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగలేఖ రాశారు. ఇందులో అనేక అంశాలను ప్రస్తావించారు. ప్రభుత్వ విద్యావ్యవస్థను పటిష్టం చేసేందుకు కేసీఆర్ అనేక చర్యలు తీసుకున్నారని, పాఠశాల విద్య మొదలు ఉన్నతవిద్య వరకు సర్వతోముఖాభివృద్ధికి ప్రాధాన్యమిచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు. టీచర్లు, పాఠ్యపుస్తకాలు, దుస్తులు, తాగునీరు కొరత, వేతనాల చెల్లింపు ఆలస్యం తదితర సమస్యలన్నీ విద్యావవస్థను పట్టిపీడిస్తున్నాయని వెల్లడించారు.
‘విద్యాశాఖను కూడా నిర్వర్తిస్తున్న మీరు రాజకీయ అంశాలకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు తప్ప, ప్రజా సమస్యల పరిష్కారంపై ఏమాత్రం దృష్టి సారించడం లేదు’ అని లేఖలో సీఎం రేవంత్‌రెడ్డికి చురకలంటించారు. అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా కొత్తగా చేసిందేమీ లేదని, గత ప్రభుత్వం చేసినవి కొనసాగించడంలోనూ విఫలమయ్యారని పేర్కొన్నారు. టీచర్లు, విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలలకు కాంగ్రెస్ పాలన శాపంగా మారిందని దుయ్యబట్టారు. ‘ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’ అనే మహోన్నత కార్యక్రమాన్ని ప్రారంభిస్తే, మీరు దాన్ని కొనసాగించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు సన్నబియ్యం కాకుండా ముకిన బియ్యంతో భోజనం పెడుతున్నారు.
కోడిగుడ్ల బిల్లులను సైతం చెల్లించని పరిస్థితి ఏర్పడింది. రెండు జతల సూల్ యూనిఫాం ఇవ్వకుండా ఒక జత మాత్రమే ఇచ్చి మీ ప్రభుత్వం చేతులు దులుపుకుంటున్నది. ఒక విద్యార్థి కూడా ఆకలితో అలమటించవద్దనే మనవతా దృక్పథంతో గత ప్రభుత్వం 27 వేల పాఠశాల్లలో ‘సీఎం బ్రేక్ ఫాస్ట్’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అటకెకించింది. మరోవైపు సకాలంలో వేతనాలందక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ సరిగ్గా లేక పాఠశాలల్లో దోమలు, ఈగలు ముసురుతున్నయి.
ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయక సిలబస్ ప్రకారం, పాఠ్యాంశాలు పూర్తి కావడం ప్రశ్నార్థకంగా మారింది. కరెంట్ బిల్లులు చెల్లించక అంధకారం అలుముకుంటున్నది’ అంటూ సమస్యలు ప్రస్తావించారు. పాఠశాల విద్యావ్యవస్థను ఇన్ని సమస్యలు చుట్టుముట్టినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. భావిభారత పౌరులను తయారుచేసే పాఠశాలల నిర్వహణను గాలికి వదిలేయడం విద్యాభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధి బట్టబయలు చేస్తున్నదని విమర్శించారు. ఇప్పటికైనా స్పందించి తక్షణమే పాఠశాల విద్యను గాడిన పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.