Harish Rao | మెదక్/నర్సాపూర్/శివ్వంపేట, సెప్టెంబర్ 23: పోలీసు తాము శాశ్వతమని అనుకోవద్దని, పొరుగు రాష్ట్రం ఏపీని చూసైనా నేర్చుకోవాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు హితవు పలికారు. చట్టాన్ని ఉల్లంఘించిన ఆంధ్రప్రదేశ్‌లోని అడిషనల్ ఐజీలు, డీజీలు సస్పెండయ్యారని గుర్తుచేశారు. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని సూచించారు. రాష్ట్రంలో గూండా రాజ్యాన్ని తలపించేలా కాంగ్రెస్ పాలన కొనసాగుతున్నదని, తెలంగాణకున్న మంచి పేరును మంటగలిపి తెలంగాణను బీహార్‌లా మారుస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.
నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి ఇంటిపై జరిగిన దాడి కాంగ్రెస్ నాయకత్వ ప్రోత్సాహంతోనే జరిగిందని ఆరోపించారు. ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఇంటిపై దాడి జరిగినట్టు తెలుసుకున్న హరీశ్‌రావు శివ్వంపేట మండలం గోమారం గ్రామానికి చేరుకొని సునీతను పరామర్శించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం ఆమెతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో గుండాల రాజ్యం నడుస్తున్నదని ఆరోపించారు. సిద్దిపేటలో తన క్యాంపు కార్యాలయంపై, హైదరాబాద్‌లో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై, ఇప్పుడు గోమారంలో ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఇంటిపైన కాంగ్రెస్ నాయకులు దాడులకు తెగబడ్డారని మండిపడ్డారు. తెలంగాణకు ఉన్న మంచి పేరును నాశనం చేసి బీహార్, రాయలసీమ తరహాలో మారుస్తున్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి మాటలు, ఆయన రెచ్చగొట్టే విధానంతోనే ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇంట్లో పటాకులు పేల్చి, పిల్లలపై దాడి చేయడం అమానుషమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎస్పీ, ఐజీతో మాట్లాడి కాంగ్రెస్ గుండాలను వెంటనే అరెస్టు చేయాలని కోరినట్టు తెలిపారు.
ఫొటోలు, వీడియోలు తీస్తున్న హెడ్‌కానిస్టేబుల్‌పై దాడిచేయడం ఏమిటని ప్రశ్నించారు. హెడ్‌కానిస్టేబుల్‌పై దాడి జరిగినప్పుడు సుమోటోగా తీసుకొని ఆయన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చుకదా.. ఎందుకు చేయడం లేదని పోలీస్ ఉన్నతాధికారులను ప్రశ్నించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఎమ్మెల్యేపై కూడా ఇలాంటి దాడి జరగలేదని గుర్తుచేశారు. తెలంగాణ ప్రజలతో తమది పేగుబంధమని, ఎక్కడా ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా తాము చాలా జాగ్రత్తగా వ్యవహరించినట్టు తెలిపారు.
ప్రభుత్వం, పోలీసులు కూడా అలానే వ్యవహరిస్తే మంచిదని హితవు పలికారు. ఇంట్లోకి చొరబడి దాడిచేసిన వారిని అరెస్టు చేసి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉందని నిరూపించుకోవాలని సూచించారు. ఘటనపై పిటిషన్ ఇచ్చినప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదని, తక్షణమే గోమారంలో కాంగ్రెస్ గుండాలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా అర్ధరాత్రి దాడులు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. దీనిని వదిలిపెట్టే సమస్యే లేదని, అవసరమైతే జాతీయ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని, కోర్టుకు వెళ్లేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.
గోమారం ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరిపించి, దాడికి పాల్పడిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి తక్షణమే అరెస్టు చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరం కలసి డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, సీనియర్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, మఠం భిక్షపతి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, మున్సిపల్ చైర్మన్ అశోక్‌గౌడ్, మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, మాజీ జడ్పీటీసీ పబ్బ మహేశ్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.