సిద్దిపేట, నవంబర్ 16: కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) రైతులను దగా చేస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) విమర్శించారు. రైతులను రేవంత్‌రెడ్డి అన్ని రకాలుగా మోసం చేశారని దుయ్యబట్టారు. రెండు పంటలకు రైతుబంధు ఎగ్గొటారని, బోనస్ లేదు, పంటల బీమా లేదు.. సగం మందికే రుణమాఫీ చేశారని మండిపడ్డారు. ఆదివారం సిద్దిపేట జిల్లా మల్లారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని హరీశ్‌రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తుపాను వల్ల రాష్ట్రవ్యాప్తంగా పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో ధాన్యం కొనుగోలు ఆలస్యమై రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం 85 లక్షల టన్నుల వడ్లు కొంటామని చెప్పి ఇప్పటివరకు ఐదారు లక్షల టన్నులే కొనుగోలు చేసిందని దుయ్యబట్టారు.
ధాన్యం కొనుగోలు చేసిన వాటికి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయలేదని మండిపడ్డారు. ఇప్పటివరకు దాదాపు రూ.1,200 కోట్ల వరకు ఎంఎస్పీ పెండింగ్‌లో ఉన్నదని చెప్పారు. సన్నవడ్లకు 24 గంటల్లో బోనస్ ఇస్తామని చెప్పిన సర్కారు.. దాదాపు రూ.200 కోట్ల బోనస్ బకాయి పడిందని, ఇప్పటివరకు రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. పోయిన యాసంగి పంటకు సంబంధించిన సన్న వడ్ల బోనస్ డబ్బులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయకపోవడంతో రైతులు చలికి వణుకుతూ కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం పంటలకు బీమా చేసి ఉంటే తుపాను వల్ల నష్టపోయిన రైతులకు ఇంత ఇబ్బంది ఉండేది కాదని పేర్కొన్నారు. దెబ్బతిన్న పంటలకు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మక్క రైతు పరిస్థితి దయనీయం
కేంద్రంలోని బీజేపీ సర్కారు పత్తి రైతులను, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మక రైతులను ఇబ్బంది పెడుతున్నాయని హరీశ్‌రావు మండిపడ్డారు. మక రైతుల పరిస్థితి దయనీయంగా ఉన్నదని చెప్పారు. మకల కొనుగోలును రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6 లక్షల ఎకరాల్లో మకలు పండించారని, వెంటనే మక్కలను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీరుతో పత్తి రైతులు ఆగమైనట్టు తెలిపారు. కొన్ని జిల్లాల్లో ఎకరాకు 11, 12 క్వింటాళ్ల పత్తి పండిందని, ఎకరానికి 7 క్వింటాళ్లను మాత్రమే కొంటామంటే ఎలా అని ప్రశ్నించారు. జిన్నింగ్ మిల్లుల వాళ్లు, సీసీఐ పత్తి కొనుగోళ్లు సరిగ్గా చేపట్టడం లేదని మండిపడ్డారు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందని ఆందోళన వ్యక్తంచేశారు.