హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1లో మెయిన్‌కు 1:100 విధానంలో అర్హుల జాబితా ప్రకటించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని మాజీ మంత్రి హరీశ్‌రావుకు అభ్యర్థులు విజ్ఞప్తిచేశారు. సోమవారం తెలంగాణభవన్‌కు వచ్చిన గ్రూప్-1, గ్రూప్- 2, 3 పరీక్షల అభ్యర్థులు తమ సమస్యలపై ఆయనకు వినతిపత్రం సమర్పించారు.
అనంతరం అభ్యర్థులు మీడియాతో మాట్లాడుతూ.. వివిధ కారణాలతో గ్రూప్-1 రద్దు అయిందని, తెలంగాణ వచ్చిన నాటినుంచి తొలి గ్రూప్-1 అయినందున ఎన్నో ఏండ్లుగా విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారని, ఈ సమయంలో 1:50 విధానంలో కొద్ది మందికే మెయిన్ అవకాశం లభిస్తుందని, ఆ పరిధిని 1:100 కు పెంచాలని కోరారు. గ్రూప్-2లో 2 వేలు, గ్రూప్-3లో 3 వేల పోస్టులు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో కాంగ్రెస్ నాయకులు ఇదేవిషయాన్ని చెప్పి, అమలు చేయడంలేదని విమర్శించారు. గ్రూప్ -2ను డిసెంబర్లో, గ్రూప్-3ను డిసెంబర్ చివరివారంలో ఉండేలా పరీక్ష తేదీలు నిర్ణయించాలని కోరారు.