Harish Rao | హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత కారణంగా నాగార్జునసాగర్ నిండుగా నీళ్లున్నా కడమ కాలువ పరిధిలోని ఖమ్మం జిల్లాలో లక్షల ఎకరాలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు దుయ్యబట్టారు. భారీ వర్షాల కారణంగా నాగార్జునసాగర్ ఎడమ కాలువకు పడిన గండిని 22 రోజులైనా పూడ్చడం చేతగాని అసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వానిదని మండిపడ్డారు. వానలు, వరదల కారణంగా దెబ్బతిన్న పంటలతోపాటు సాగునీరు అందక ఎండిపోయిన పంటలకు కూడా ఎకరానికి రూ.25 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులున్నా ఏం లాభం? జానెడు గండిని పూడ్చలేక 22 రోజులుగా నిద్రపోతున్నారా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
జిల్లా నుంచి తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. రెండున్నర లక్షల ఎకరాల పంటలు ఎండబెడతారా? అని మండిపడ్డారు. ఖమ్మం రైతులు కన్నీళ్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల మధ్య సమన్వయ లోపం, నీటిపారుదల శాఖ మంత్రి నిర్లక్ష్యం, ముఖ్యమంత్రి పట్టింపు లేకపోవడం వల్ల ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. పాలేరు, ఖమ్మం, వైరా, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో పంటలు ఎండిపోతున్నా, రైతులు ధర్నాలు చేస్తున్నా.. ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నదని విమర్శించారు. జిల్లాలో గత సంవత్సరం ప్రకృతి తెచ్చిన కరువు రాగా, ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని తనం వల్ల కరువు వచ్చిందని మండపడ్డారు. ఖమ్మం జిల్లాలో ఒకవైపు వరదల వల్ల, మరోవైపు సాగర్ ఆయకట్టుకు నీరు అందక రైతులు నష్టపోతున్నారని వివరించారు. ‘ముందు దగా, వెనక దగా, కుడి ఎడమల దగా, కాంగ్రెస్ పాలనలో రైతు గుండె మంట భగ భగ’ అన్నట్టుగా పరిస్థితి ఉన్నదని చెప్పారు. గండి పూడ్చడానికి సీనియర్ ఇంజినీర్లను పెట్టి ఫ్లడ్ లైట్ల వెలుతురులో రాత్రింబవుళ్లు పనిచేయించవచ్చని సూచించారు. కాలువ గండిని పూడ్చలేని ప్రబుద్ధులు, గతంలో కాళేశ్వరం గురించి పెద్దపెద్ద మాటలు మాట్లారని ఎద్దేవా చేశారు.
కూల్చివేతలు తప్ప పూడ్చివేతలు రావు
కాంగ్రెస్ సరారుకు కూల్చివేతలు తప్ప పూడ్చివేతలు రావు అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టడం మీ ప్రాధాన్యమా? రైతులకు నీరు ఇవ్వడం రాదా? కాంగ్రెస్‌కు రైతుల పట్ల జాలి, దయ లేవా? అని మండిపడ్డారు. కేసీఆర్‌ను తిట్టడంలో పోటీపడుతున్న మంత్రులు నీళ్లు ఇవ్వడంలో పోటీ పడలేరా? అని ప్రశ్నించారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల మధ్య సమన్వయ లోపం, నీటిపారుదల శాఖ మంత్రి నిర్లక్ష్యం, ముఖ్యమంత్రి పట్టింపు లేకపోవడం వల్ల ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని విమర్శించారు. ఒక మంత్రి అమెరికాలో ఉన్నారని, ఇంకో మంత్రి బీఆర్ఎస్ను తిట్టే పనిలో బిజీగా ఉన్నారని, ఇంకో మంత్రి వరదల్లో కొట్టుకుపోయిన పంటలకు నయాపైసా సాయం చేయలేకపోయారని పేర్కొన్నారు.
ఎకరాకు 25 వేలు ఇవ్వాలి
పంట నష్ట పరిహారం కింద ఎకరాకు రూ.25 వేల చొప్పున అందజేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నదని హరీశ్‌రావు తెలిపారు. గతంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా రూ.25 వేల నష్టపరిహారాన్ని డిమాండ్ చేశారని గుర్తుచేశారు. ఇప్పటివరకు పంట నష్టపోయిన ఒక్క రైతుకు కూడా సాయం చేయలేదని, తక్షణమే సాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ సరార్ నీరు ఇచ్చినా పంటలు చేతికొచ్చే పరిస్థితులు లేవని ఆందోళన వ్యక్తంచేశారు. సాగర్ ఆయకట్టు కింద నీళ్లు అందక ఎండిపోయిన పంటలను సర్వే చేసి వారికి కూడా ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరారు. వరదల వల్ల 60 వేల ఎకరాలు, కాంగ్రెస్ నిర్వాకం వల్ల లక్ష ఎకరాలకుపైగా నష్టపోయిందని ప్రాథమికంగా అంచనా వేశామని చెప్పారు.
సీతారామ ఏమాయె…?
ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు 70 రోజుల్లో ప్రాజెక్టును పూర్తిచేశామంటూ గొప్పలు చెప్పుకున్నారని, మరి ఈ ప్రాజెక్టు ద్వారా దిగువన ఉన్న వైరా రిజర్వాయర్‌ను నింపి, దాని పరిధిలో 1.70 లక్షల ఎకరాలకు నీరు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి సీతారామస్వామి మీద ఒట్టు పెట్టి.. మాట తప్పారని, దేవున్ని కూడా మోసం చేశారని మండిపడ్డారు.
ఫిరాయింపులపై ఇంకా బుకాయింపులా?
అబద్ధం అతికేటట్టు ఉండాలన్న విషయాన్ని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలుసుకోవాలని, ఫిరాయింపులపై ఆయన అతి తెలివితేటలు ప్రదర్శిస్తున్నారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలవాలనుకుంటే అధికారిక కార్యక్రమాల్లో కలుస్తారని, పార్టీ మీటింగ్‌లో కాదనే విషయాన్ని శ్రీధర్‌బాబు గ్రహించాలని చెప్పారు. సొంత నియోజకవర్గానికి సీఎం వచ్చారనే ఉద్దేశంతో అరికెపూడి గాంధీ కలిసిందే నిజమైతే, మరి ప్రకాశ్‌గౌడ్, కడియం శ్రీహరి ఎందుకొచ్చారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య విలువలను ఖూని చేస్తూ నగ్నంగా బయటపడ్డారని, ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్‌కు శిక్ష తప్పదని హెచ్చరించారు. సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్యే చింత ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, బీఆర్ఎస్ నాయకులు శివకుమార్, బొమ్మెర రామ్మూర్తి పాల్గొన్నారు.
మరోసారి ఖమ్మం పర్యటన
ఖమ్మ జిల్లా రైతులు ఏం పాపం చేశారు? తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిచడం వాళ్ల పాపమా? జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండటమే శాపమా? ఖమ్మం జిల్లా రైతులు చేసిన తప్పేమిటి? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. రాజకీయ జీవితం ఇచ్చిన ఖమ్మం జిల్లా ప్రజలకు మీరు ఇచ్చే బహుమానం ఇదేనా? వరదల్లో కొట్టుకుపోయిన ఇండ్లకు నష్టపరిహారం ఇవ్వరా? అని నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున త్వరలో మరోసారి ఖమ్మం జిల్లాకు వెళ్తామని, రైతులకు మనోధైర్యం ఇస్తామని చెప్పారు. నీళ్లు లేక రైతులు ట్యాంకర్లు, జనరేటర్లు పెట్టుకొని పంటలు తడుపుకొంటున్నారని చెప్పారు. గతంలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్తే తమపై దాడులు చేశారని, ఇప్పటివరకు దాడి చేసిన వారిపై కేసు పెట్టలేదని చెప్పారు. తాము దాడులకు భయపడేది లేదని హెచ్చరించారు.
దేవుడా, రామచంద్రస్వామీ..! ఈ ముఖ్యమంత్రిని క్షమించు.. రైతులను రక్షించు.. కాలువ నీళ్లు ఎప్పడైతదో తెలుస్తలేదు.. ఖమ్మం జిల్లా మీద మంచి వర్షాలు పడి పంటలను కాపాడే విధంగా రైతులను దీవించి, రైతులను రక్షించు..!
-హరీశ్‌రావు
రైతుభరోసా ఇవ్వరు.. పూర్తి రుణమాఫీ చేయరు.. నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వరు.. జానెడు గండిని పూడ్చలేరు.. మిగిలిన పంటలకు కనీసం సాగునీళ్లు ఇవ్వరు.. ఇంకెందుకు మీరు అధికారంలో ఉండి? 22 రోజులుగా నిద్ర పోతున్నారా? ఇదేనా రైతు ప్రభుత్వం అంటే..?
-హరీశ్‌రావు