Harish Rao | హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): ప్రజలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీల విషయంలో ఓడ దిగే వరకు ఓడ మల్లప్ప, ఓడ దిగినంక బోడ మల్లప్ప అన్నట్టుగా కాంగ్రెస్ వ్యవహారశైలి ఉన్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు నిరుద్యోగులను రెచ్చగొట్టిన కాంగ్రెస్.. ఇప్పుడు వారి సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. సోమవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. గ్రూప్-1లో మెయిన్‌కు 1:100 చొప్పున అవకాశం కల్పించాలని, గ్రూప్-2, గ్రూప్-3లో అదనపు ఉద్యోగాలను కలపాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్యలు గతంలో కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేసినవేనని, వాటిని అమలు చేయాలని మాత్రమే తాము కోరుతున్నామని తెలిపారు. నిరుద్యోగులు కాంగ్రెస్ నేతల కాళ్లపై పడినా కనికరించడం లేదని మండిపడ్డారు.
ఇచ్చిన మాట నిలుపుకోవాలని, లేకపోతే హస్తం పార్టీకి నిరుద్యోగులే తగిన గుణపాఠం చెప్తారని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గ్రూప్-1, గ్రూప్-2 అభ్యర్థులు, నిరుద్యోగులు బీఆర్ఎస్ కార్యాలయం వద్దకు వచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారని తెలిపారు. ‘పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ దగ్గరికి వెళ్తే.. అంతా ప్రభుత్వం చేతుల్లో ఉన్నదని అంటున్నారు. ప్రజాదర్బార్‌కు వెళ్లి చిన్నారెడ్డి కాళ్లపై పడినా కనికరించడం లేదు. నిరుద్యోగులకు మాట ఇచ్చిన కోదండరాం దగ్గరికి వెళ్లినా స్పందన లేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న భట్టి విక్రమార్క 1:100 మందికి అవకాశం ఇవ్వాలని అడిగారని, మరీ ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు. పరీక్షకు.. పరీక్షకు.. రెండు నెలల వ్యవధి ఉండాలని గతంలో కాంగ్రెస్ నాయకులు చెప్పారని, కానీ ఇప్పుడు అమలు చేయటం లేదని నిలదీశారు.
డీఎస్సీ పరీక్ష జూలై 17 నుంచి 31 వరకు, గ్రూప్-2 పరీక్ష ఆగస్టు 7, 8న ఉన్నాయని.. ఈ రెండు పరీక్షలకు 7 రోజుల వ్యవధే ఉన్నదని తెలిపారు. ఇంత తక్కువ సమయంలో పరీక్షలకు ప్రిపేర్ కాలేక సంగీత అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నదని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ భారీగా ప్రకటనలు ఇచ్చిందని, ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటిదాకా జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఒక్క కొత్త నోటిఫికేషన్ విడుదల చేయలేదని, రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ప్రణాళిక ఏదని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఆసరా పింఛనుదారులకు రూ.4 వేల పింఛన్ ఇస్తామని చెప్పి 6 నెలలు దాటినా అమలు చేయటం లేదని హరీశ్ ఆరోపించారు. ఇచ్చే పాత పింఛనును కూడా ఏప్రిల్, మే నెలలవి ఇంకా ఇవ్వలేదని తెలిపారు. ఇంట్లో ఉండే అవ్వాతాతలకు ఇద్దరికీ రెండు పింఛన్లు ఇస్తామని చెప్పారని, ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారని, ఇంతవరకూ అమలు చేయటం లేదని ప్రశ్నించారు. పేదల పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని నిలదీశారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన ఏపీ సీఎం పింఛన్‌ను రూ.4వేలకు పెంచారని, ఏపీని చూసైనా బుద్ధి తెచ్చుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. అక్కడ పెంచిన పింఛనును ఏప్రిల్ నుంచే అమలు చేస్తున్నారని, తెలంగాణలోనూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆసరా పింఛనుదారుడికి రూ.12 వేలు చొప్పున కాంగ్రెస్ ప్రభుత్వం బకాయి పడిందని, ఈ నెలకు కలిపి మొత్తం రూ.16 వేలు ఇవ్వాలని అన్నారు. దివ్యాంగులకు మాట ప్రకారం రూ.6 వేలు ఇవ్వాలని వెల్లడించారు.
ప్రతి నెల 1వ తేదీనే జీతాలు ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నా, ఆచరణలో అమలు కావటం లేదని హరీశ్‌రావు ఆరోపించారు. ఆశ వరర్లు తమకు రెండు నెలలుగా వేతనాలు రావటం లేదని ధర్నా చేశారని, ప్రభుత్వం చెప్పేది నిజమా? ఆశ వర్కర్లు చెప్పేది నిజామా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అంగన్వాడీ టీచర్లకు రెండు నెలలుగా జీతాలు రావటం లేదని, రాష్ట్రవ్యాప్తంగా 65 వేల మంది అంగన్వాడీ టీచర్లు, ఆయాలు జీతం కోసం ఎదురుచూస్తున్నారని వెల్లడించారు. గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు 5 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని, పంచాయతీలకు నిధులు విడుదల చేయకపోవటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. సొంత ఖర్చులతో ట్రాక్టర్లలో డీజిల్ పోయించుకుంటున్నామని పంచాయతీ కార్యదర్శి, స్పెషల్ ఆఫీసర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నదని, 65 వేల సీఎంఆర్ఎఫ్ చెకులు పంపిణీకి రెడీగా ఉన్నా.. వాటిపై కేసీఆర్ బొమ్మ ఉన్నదన్న కారణంతో నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1.50 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయకుండా నిలిచిపోయాయని తెలిపారు.
దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించిన నీట్‌పై నీలినీడలు కమ్ముకున్నాయని హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ హయాంలో వైద్య విద్య అంగట్లో సరుకులా మారిందని ధ్వజమెత్తారు. దేశవ్యాప్తం గా 24 లక్షల మంది విద్యార్థులు నీట్‌కు హాజరయ్యారని, ఆ విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని వెల్లడించారు. నీట్ లో గ్రేస్ మార్కుల విధానమే లేదని, కానీ ఇప్పుడు ఆ విధానాన్ని అమలు చేశారని, గతంలో ఎన్నడూ లేనట్టు 67 మందికి ఫస్ట్ ర్యాంకు ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఒకే సెంటర్లో పరీక్ష రాసిన ఆరుగురికి 720 మారులెలా వచ్చాయని నిలదీశారు.
గ్రేస్ మారులు కలిపిన 1,563 మంది పేర్లు, ప్రాతిపదిక ఏమిటో బయటపెట్టాలని డిమాం డ్ చేశారు.ఫలితాలను పది రోజులు ముందు కు జరిపి, పార్లమెంటు ఎన్నికల ఫలితాల రోజే ఎందుకు విడుదల చేశారని, దీనిపై అనుమానాలున్నాయని తెలిపారు. పేపర్ లీక్ కాకపోతే బీహార్, గుజరాత్లో ఎందుకు అరెస్టులు జరుగుతున్నాయని ప్రశ్నించారు. 24 లక్షల మంది విద్యార్థుల అంశంపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు విద్యార్థులకు అన్యాయం జరగకుండా బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి స్పందించాలని అన్నారు. మన్ కీ బాత్‌లో మాట్లాడే ప్రధాని నీట్‌పై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. నీట్ అక్రమాలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా విచారణ సంస్థతో సమగ్ర విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
సోషల్ మీడియా వ్యూస్ కోసం ఒక నాయకుడి నిబద్ధత, నిజాయితీని దెబ్బతీయొద్దని హరీశ్ సూచించారు. తాను బీజేపీ, కాంగ్రెస్‌లోకి వెళ్తున్నట్టు అనవసరంగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంచలనాల కోసం తనపై మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్ చానళ్లలో ఏవేవో ప్రచారం చేస్తున్నారని అన్నారు. దయచేసి ఇలాంటి థంబ్‌నెయిల్స్ పెట్టవద్దని, లైక్స్, వ్యూస్ కోసం ఒక నాయకుడి నిబద్ధత, నిజాయితీని దెబ్బతీయవద్దని తెలిపారు. ఇకకైనా ఇలాంటివి మానుకోకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోడానికి వెనకాడబోనని హెచ్చరించారు. సమావేశంలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, శశిధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, శివకుమార్ పాల్గొన్నారు.
1. గ్రూప్-1 మెయిన్‌కు 1:50 కాకుండా 1:100 చొప్పున అవకాశం ఇవ్వాలి.
2. గ్రూప్-2కు 2 వేల ఉద్యోగాలు, గ్రూప్-3లో 3 వేల ఉద్యోగాలు అదనంగా కలుపుతామన్న మాటను నిలబెట్టుకోవాలి.
3. పరీక్షకు పరీక్షకు మధ్య 2 నెలల గ్యాప్ ఉండాలి.
4. ఏడాదిలోగా 2 లక్షలు ఉద్యోగాలిస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చి ఆరునెలలైనా జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. ఆ రెండు లక్షల ఉద్యోగాలను ఎలా భర్తీ చేస్తారో చెప్పాలి.
5. 25 వేల పోస్టులతో కాకుండా 11 వేల పోస్టులతో డీఎస్సీ ఎందుకు ప్రకటించారు. మొత్తం 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించాలి.
నిరుద్యోగులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ దగ్గరికి వెళ్తే.. అంతా ప్రభుత్వం చేతుల్లో ఉన్నదని అంటున్నారు. ప్రజాదర్బార్‌కు వెళ్లి చిన్నారెడ్డి కాళ్లపై పడినా కనికరించడం లేదు. మాట ఇచ్చిన కోదండరాం దగ్గరికి వెళ్లినా స్పందన లేదు. దాంతో గ్రూప్-1, గ్రూప్-2 అభ్యర్థులు, నిరుద్యోగులు బీఆర్ఎస్ కార్యాలయం వద్దకు వచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.
– హరీశ్‌రావు