హైకోర్టు ఆదేశానుసారం ఈ నెల 15న విచారణ కోసం పంజాగుట్ట పోలీసుల ఎదుట హాజరయ్యాను. డీసీపీ విజయ్‌కుమార్, ఏసీపీ మోహన్‌కుమార్ చిత్రహింసలు పెట్టిండ్రు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాజీ మంత్రి హరీశ్‌రావు, మచ్చ వేణుగోపాల్‌కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వకపోతే ఈ రోజు రాత్రిలోపు నీకు లైఫ్ లేకుండా చేస్తాం.. అని బెదిరించారు.
– అఫిడవిట్లో వంశీకృష్ణ
Telangana | నాంపల్లి క్రిమినల్ కోర్టులు, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి టీ హరీశ్‌రావుపై పంజాగుట్ట పోలీసులు పెట్టిన ఫోన్‌ట్యాపింగ్ కేసులో డీసీపీ, ఏసీపీలపై మరో నిందితుడు టీ వంశీకృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. డీసీపీ విజయ్‌కుమార్, ఏసీపీ మోహన్‌కుమార్ తనను చిత్రహింసలు పెట్టారని, హరీశ్‌రావుతోపాటు ఈ కేసులో మరో నిందితునిగా ఉన్న మచ్చ వేణుగోపాల్‌కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలని బెదిరించారని పేర్కొంటూ 14వ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో అఫిడవిట్ దాఖలుచేశారు. ‘హైకోర్టు ఆదేశానుసారం ఈ నెల 15న విచారణ కోసం పంజాగుట్ట పోలీసుల ఎదుట హాజరయ్యాను. డీసీపీ విజయ్‌కుమార్, ఏసీపీ మోహన్‌కుమార్ చిత్రహింసలు పెట్టినరు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాజీ మంత్రి హరీశ్‌రావు, మచ్చ వేణుగోపాల్‌కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వకపోతే నీ లైఫ్ ఈ రోజు రాత్రిలోపు లేకుండా చేస్తాం అని బెదిరించారు…’ అని అఫిడవిట్లో పేర్కొన్నారు. చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న వంశీకృష్ణ స్వదస్తూరితో రాసిన అఫిడవిట్‌ను న్యాయవాది జక్కుల లక్ష్మణ్ గురువారం నాంపల్లి కోర్టుకు సమర్పించారు.
పంజాగుట్ట పోలీసులు తనను అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకి తరలించిన తర్వాతగానీ ఆ కేసు పూర్వాపరాలు తనకు తెలియలేదని వంశీకృష్ణ తన అఫిడవిట్లో వివరించారు. వాస్తవానికి తాను పోలీసుల ముందు ఏమీ చెప్పలేదని, ఈ కేసులో ఏముందో అసలు పోలీసులు తనకు చదివి వినిపించలేదని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాజీ మంత్రి హరీశ్‌రావు, మచ్చ వేణుగోపాల్‌కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలని తీవ్రంగా ఒత్తిడి చేశారని, అలా చేయకపోతే నీ జీవితం రాత్రిలోపు లేకుండా చేస్తానని, ఉద్యోగం లేకుండా చేస్తానని డీసీపీ, ఏసీపీలు తీవ్ర పదజాలంతో, అసలు రాయలేని భాషలో బూతులు తిట్టారని ఆరోపించారు. నరకం అంటే ఏందో చూపిస్తామంటూ బెదిరించడమే కాకుండా కేసు గురించి ఏమీ చెప్పకుండా, నేను లాయర్‌ను అడిగి సంతకం చేస్తానని చెప్పినా వినకుండా తన నుంచి సంతకాలు తీసుకున్నారని తెలిపారు. ముఖ్యంగా డీసీసీ విజయ్‌కుమార్ తనను పదేపదే బూతులు తిడుతూ… ‘హరీశ్‌రావు, వేణుగోపాల్‌కు వ్యతిరేకంగా చెప్తే నీ ఉద్యోగం నువ్వు చేసుకునే విధంగా చూసుకుంటా. చెప్పకపోతే థర్డ్ డిగ్రీ ఇప్పిస్తా, నీ కుటుంబ పరువు అంతా తీసేస్తా’ అంటూ హెచ్చరించారని వంశీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పినా వినిపించుకోకుండా విపరీతంగా తిట్టారని, పొద్దున నుంచి సాయంత్రం వరకు అన్నం కూడా పెట్టలేదని తెలిపారు. ఏసీపీ మోహన్‌కుమార్, ఎస్సై శివశంకర్ తనను కుటుంబంతో ఉన్నానని కూడా చూడకుండా అనుచితంగా వ్యవహరించారని ఆరోపించారు. రెండు, మూడేండ్లు ఉన్న తన పిల్లలతో సహా తన భార్యను అర్ధరాత్రి ఒకటిన్నర వరకు పోలీస్‌స్టేషన్‌లో ఉంచారని, కనీసం పిల్లలు బహిర్భూమికి వెళితే కడిగేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని వంశీకృష్ణ తన అఫిడవిట్లో వివరించారు. తనకు కాలేయ సంబంధిత అనారోగ్య సమస్య ఉందని, ఆరోగ్యం బాగాలేనందున ఈ నెల 19న గాంధీ దవాఖానకు వెళ్లానని, అయినప్పటికీ అవేవీ పరిగణనలోకి తీసుకోకుండా తనను అరెస్టు చేశారని తెలిపారు. ఇదంతా తన ఇష్టపూర్తిగా ఇస్తున్న అఫిడవిట్ అని పేర్కొన్న వంశీకృష్ణ తనకు న్యాయం చేయాల్సిందిగా న్యాయమూర్తిని కోరారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిమాండ్ ఖైదీలుగా చంచల్‌గూడ జైలులో ఉన్న తెల్జీరు వంశీకృష్ణ, తొడుపునూరి సంతోష్‌కుమార్, బండి పరుశరాములుకు 14వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్టేట్ సౌమ్య గురువారం బెయిల్ మంజూరు చేశారు. రూ.20వేల చొప్పున ఇద్దరి జమానత్‌లను కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. వారి పాస్‌పోర్ట్‌లను పాస్‌పోర్టులను కోర్టుకు అప్పగించాలని, విచారణాధికారికి సహకరించాలని కోర్టు షరతులు విధించింది. ఈ సందర్భంగా నిందితుల తరఫు న్యాయవాది సమర్పించిన హైకోర్టు ఉత్తర్వుపై పీపీ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మేజిస్ట్రేట్ కల్పించుకుంటూ..హైకోర్టు ఉత్తర్వును బేఖాతరు చేయలేమంటూ పీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చంచల్‌గూడ జైలులో రిమాండులో ఉన్న ముగ్గురు శుక్రవారం విడుదల కానున్నారు.
వంశీకృష్ణ దాఖలుచేసిన అఫిడవిట్‌పై తగు నిర్ణయం తీసుకుని ఏసీపీ, డీసీపీలపై కేసు నమోదు చేయనున్నట్టు న్యాయవాది కిరణ్‌కుమార్ మీడియాకు వెల్లడించారు. హైకోర్టు జారీచేసిన ఆదేశాల మేరకు పోలీసుస్టేషన్‌కు వెళ్లిన వంశీకృష్ణను చిత్రహింసలకు గురిచేయడం చట్టవ్యతిరేకమని అన్నారు. అసభ్యంగా దూషించి, మాజీ మంత్రి హరీశ్‌రావుకు వ్యతిరేకంగా అసత్య విషయాలను చెప్పాలని ఒత్తిడి చేయడం అధికారుల దుశ్చర్యలకు నిదర్శనమని విమర్శించారు. తమ ప్రత్యర్థులపై రాజకీయ కక్షసాధిస్తున్న ప్రభుత్వం తరఫున అధికారులు పోలీసుస్టేషన్లో చిత్రహింసలకు గురిచేశారని పేర్కొన్నారు. ‘సంతోష్, పరశురామ్‌లను శనివారం అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. వీరికి నాంపల్లి కోర్టు గురువారం బెయిల్ మంజూరుచేసింది.
వంశీకృష్ణ కోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. దాని ప్రకారం ఈ కేసులో హరీశ్‌రావు, ఆయన అనుచరుడు మచ్చ వేణుగోపాల్‌ను ఇరికించాలని పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నట్టు స్పష్టమవుతున్నదని న్యాయవాది వివరించారు. ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి కూడా తీసుకుపోయినట్టు చెప్పారు. ‘పోలీసు అధికారులపై తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలో న్యాయవాదులం కూర్చుని నిర్ణయించుకుంటాం. ముఖ్యంగా వంశీకృష్ణ విడుదలైన తర్వాత ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకొని తదుపరి ఏం చేయాలనే దానిపై నిర్ణయించుకుంటాం…’ అని కిరణ్‌కుమార్ చెప్పారు.