హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): పశువైద్యశాలల్లో మందుల కొరత, 1962 పశువైద్య సంచార వాహన సేవల్లో అంతరాయం.. అయినా మూగజీవాల మౌనరోదనను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. రాష్ట్రంలో పశుసంవర్ధక శాఖలో నెలకొన్న పరిస్థితులపై ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో ఆవులు, బర్రెలు, గొర్రెలు, మేకలకు వ్యాధులు సోకితే తగిన వైద్యం అందించేందుకు ప్రభుత్వ పశువైద్యశాలల్లో మందులు లేని దుస్థితి నెలకొన్నదని తెలిపారు. నట్టల నివారణ మందులు సరఫరా చేయకపోవటంతో కాలేయం, జీర్ణాశయం, పేగుల్లో పరాన్నజీవులు చేరి రక్తహీనతకు గురవుతున్నాయని వివరించారు.
మూగజీవాల వద్దకే వైద్యసిబ్బంది వచ్చి చికిత్స అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1962 పశువైద్య సంచార వాహనాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని హరీశ్‌రావు గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు పశుసంవర్ధకశాఖపై సమీక్షించలేదని దుయ్యబట్టారు. వానకాలంలో వ్యాధులు ఎకువగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సర్కార్ ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడాలని అన్నారు.
గొర్రెల పంపిణీని అటకెక్కించిన ప్రభుత్వం చేపల పంపిణీని ఆలస్యం చేస్తున్నదని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత చేపల పంపిణీ కోసం మత్స్యకారులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. జూన్ నాటికి టెండర్లను పూర్తయ్యి ఆగస్టు నాటికి సగం చేపపిల్లలు చెరువుల్లోకి చేరేవని, కానీ, ఇంకా ఆ ప్రక్రియ టెండర్ దశలోనే ఉండటం అనుమానాలకు తావిస్తున్నదని వెల్లడించారు.