చౌటుప్పల్, మే 7: ధాన్యం కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నదని, కొనుగోలు కేంద్రాల వద్దనే రైతుల గుండెలు ఆగిపోతున్నా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కనికరం లేదని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ధాన్యం కుప్పల వద్దే నిరీక్షిస్తున్న రైతులతో మాట్లాడారు. నెలరోజులైనా వడ్లు కొంటలేరని, తరుగు పేరుతో దోచుకుంటున్నారని రైతులు హరీశ్‌రావుకు వివరించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాయిశ్చర్ తీసిన తర్వాత రోజే కాంటా వేసేవారని, ప్రస్తుతం వారం గడుస్తున్న వెయ్యడం లేదని ఆయన దృష్టికి తెచ్చారు. మరికొంత మంది రైతులు తమ ధాన్యానికి బీ గ్రేడ్ వేస్తున్నరని చెప్పారు. దీంతో ఎకరాకు 600-700 వరకు నష్టపోతున్నామని వివరించారు. గత ప్రభుత్వం ఏనాడూ బీ గ్రేడ్ వేయలేదని రైతులు గుర్తుచేశారు.
కొనుగోలు కేంద్రం నుంచి రోజుకు రెండు లారీలు కూడా పోవడం లేదని చెప్పారు. హరీశ్‌రావు పర్యటన నేపథ్యంలో ఈరోజు 7.30 గంటలకే కాంటా వేశారని, అంతకుముందు రోజు వరకు 11 గంటల తర్వాత కాంటా పెట్టేవారని వివరించారు. రైతుబంధు తడవకింత బిచ్చం వేసినట్టు వేస్తున్నారన్నారని, దీంతో వ్యవసాయ పనులకు సక్రమంగా వినియోగంచుకోలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎన్నడూ ఇంతటి దారుణ పరిస్థితులు లేవని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు యూరియా, రైతుబంధు, సాగునీరు, కరెంటు, చివరికి పండిన పంట అమ్ముకొనే దాకా అడుగడుగునా ఇబ్బందులే ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాత్రం చాలా బాగా వడ్లు కొంటున్నామని, ఎవరికీ ఇబ్బంది లేదని చెప్పుకోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.
‘అయ్యా ఉత్తమ్.. నేను ఏసీ రూంలో కూర్చొని మాట్లాడటం లేదు. నీ జిల్లాలోని చౌటుప్పల్ మార్కెట్లో రైతుల మధ్య నిలబడి మాట్లాడుతున్నా.. ఒక్కసారి ఇక్కడకు వచ్చి చూడండి’ అని హరీశ్‌రావు చురుకలు వేశారు. ఇక్కడ ధనమ్మ, నిర్మల అనే మహిళా రైతులు ధాన్యాన్ని మార్కెట్‌కు తెచ్చి 24 రోజులైంది. ఏప్రిల్ 30న మాయిశ్చర్ వచ్చినా గత 8 రోజులుగా కాంటా పెట్టే దిక్కేలేదని మండిపడ్డారు. 44 డిగ్రీల ఎండలో సైతం రైతులు నెల రోజులుగా వడిగాపులు కాస్తూ పిట్టల్లా రాలిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇది పూర్తిగా ప్రభుత్వ చేతగానితనమేనని విమర్శించారు. మేమ వస్తే తప్ప మీరు లారీలు పంపరా? అని ప్రశ్నించారు.
ప్రభుత్వం తక్షణమే మేల్కొని సరిపడా లారీలు, గన్నీ బ్యాగులు పంపాలని, మిల్లర్లకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేసి యుద్ధప్రాతిపదికన వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర కల్లు గీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు పాల్వాయి స్రవంతి, కర్నాటి విద్యాసాగర్, చింతల దామోదర్‌రెడ్డి, కర్నాటి వెంకటేశం, బొమ్మిరెడ్డి వెంకట్‌రెడ్డి, గిర్కటి నిరంజన్‌గౌడ్, కొయ్యాడ శేఖర్‌గౌడ్, సుర్వి మల్లేశ్‌గౌడ్, బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, సుర్కంటి శ్రీధర్‌రెడ్డి, తాడూరి పరమేశ్, ఢిల్లీ మాధవరెడ్డి, ఉడుగు మల్లేశంగౌడ్, దేవరపల్లి గోవర్దన్‌రెడ్డి, గుండెబోయిన ఇస్తారి యాదవ్, ముప్పిడి శ్రీనివాస్‌గౌడ్, ఊదరి యాదయ్య, గడ్డం రాజరత్నం పాల్గొన్నారు.