Harish Rao | హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): రేవంత్‌రెడ్డి పాలన రైతుల పాలిట యమపాశంగా మారిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. తొమ్మిది నెలల్లో 470 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణభవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కంజూస్ సర్కార్‌గా మారిందని, రైతు రుణమాఫీని ఎగ్గొట్టడానికి 31 సాకులు చూపుతున్నదని దుయ్యబట్టారు. రుణమాఫీకి రేషన్‌కార్డుతో లింకుపెట్టబోమని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని, అయితే రైతు సురేందర్‌రెడ్డి ఆత్మహత్యతో రేషన్‌కార్డు లింకు ఉన్నట్టు నిరూపితమైందని పేర్కొన్నారు. అవివాహితులకు రుణమాఫీ కావడం లేదని, అనేక ఆంక్షలు పెట్టి కుటుంబ సంబంధాల్లో సర్కారు చిచ్చుపెట్టిందని దుయ్యబట్టారు.
అన్నదాతలను ప్రభుత్వం వంచించిందని విమర్శించారు. మేడ్చల్‌లో వ్యవసాయశాఖ కార్యాలయం ఎదుట పాస్బుక్పైనే సూసైడ్ నోట్ రాసి రైతు సురేందర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. సురేందర్‌రెడ్డికి ఏపీజీవీబీలో రూ.1.92 లక్షలు, తన తల్లి పేరిట రూ.1.15 లక్షలు అప్పు ఉన్నదని, కుటుంబసభ్యుల్లో ఒకరికే రుణమాఫీ అవుతుందని బ్యాంకు మేనేజర్ చెప్పడంతో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. సురేందర్‌రెడ్డి సూసైడ్ నోట్లోని ప్రతి అక్షరం రేవంత్‌రెడ్డి నగ్న స్వరూపాన్ని బయటపెట్టిందని, పూటకో మాట మాట్లాడుతూ రైతులను వంచిస్తున్నారని విమర్శించారు. రేవంత్ పాలనకు సురేందర్‌రెడ్డి లేఖ ఒక పంచనామా లాంటిదని అభివర్ణించారు. సురేందర్‌రెడ్డిది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వం చేసిన హత్య అని అభివర్ణించారు.
గత కేసీఆర్ ప్రభుత్వం కుటుంబ బంధాలను బలోపేతం చేస్తే, రేవంత్ ప్రభుత్వం వాటిని విచ్ఛిన్నం చేస్తున్నదని హరీశ్‌రావు విమర్శించారు. ‘నా నియోజకవర్గంలో జకాపూర్లో గురజాల బాల్‌రెడ్డి కుటుంబంలో ముగ్గురికి వ్యవసాయ రుణం ఉన్నది. బాల్రెడ్డితోపాటు ఇద్దరు కొడుకులకు రుణాలు ఉన్నాయి. వారు కుటుంబాలు వేరయ్యాయి. వారికి రూ.ఆరు లక్షల అప్పు ఉంటే కేవలం రూ.రెండు లక్షలే మాఫీ అవుతున్నది. నారాయణ్‌పేట గ్రామంలో నల్ల మణెమ్మ అనే రైతుకు రూ.1.30 లక్షల అప్పు ఉన్నది. ఆమె భర్త 2010లో మరణించారు. ఇప్పుడు ఆయన ఆధార్‌కార్డు తెస్తేనే రుణమాఫీ చేస్తామని బ్యాంకు అధికారులు చెప్తున్నారు.
2010లో ఆధార్‌కార్డులే ఇవ్వనప్పుడు ఇప్పుడు ఆధార్‌కార్డు ఎలా తెస్తారు? కుంభాల సిద్ధారెడ్డికి 52 ఏండ్లు, అవివాహితుడు. చాతపల్లి హరీశ్‌కు 32 ఏండ్లు. ఇతనికీ పెండ్లి కాలేదు. తమకు ఎందుకు రుణమాఫీ కాలేదని వీరిద్దరూ వెళ్లి బ్యాంకు అధికారులను అడిగితే.. భార్య ఆధార్‌కార్డు తెమ్మంటున్నారు. అసలు పెండ్లే కాని వారు భార్య ఆధార్‌కార్డు ఎకడి నుంచి తెస్తారు? ఇలాంటి వాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఇది రైతుల పాలిట రేవంత్ చేసిన మోసం, దగా కాదా?’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 20 లక్షల మందికే రుణమాఫీ అయ్యిందని, ఇంకా 21 లక్షల మంది రైతులకు కావాల్సి ఉన్నదని హరీశ్‌రావు చెప్పారు. రైతులందరికీ రుణమాఫీ అయ్యిందని, తనను బావిలో దూకాలని అంటున్న రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు ఎవరు బావిలో దూకాలో చెప్పాలని నిలదీశారు. చేతి గుర్తుకు ఓటేస్తే కోతలే మిగిలాయని ఎద్దేవా చేశారు. వ్యవసాయ రంగంలో అనేక కొత్త కొత్త పదవులు ఏర్పాటుచేస్తున్నారని, తాజాగా రైతు సంక్షేమ కమిషన్ పెట్టారని, రైతు రుణమాఫీ చేయని వారికి ఇన్ని పదవులు ఎందుకు? అని ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యలు పెంచడానికా ఈ పదవులు? అని ఎద్దేవాచేశారు. రేవంత్‌రెడ్డి పాలనలో వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టారని విమర్శించారు.
పెట్టుబడి సాయం అంటే రేవంత్‌రెడ్డికి అర్థం తెలుసా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. మరో రెండు నెలల్లో యాసంగి పంట వేసే టైం వస్తదని, కానీ, నేటికీ వానకాలం రైతుభరోసా ఇవ్వలేదని హరీశ్‌రావు దుయ్యబట్టారు. 11 విడతల్లో పంటసాగుకు ముందే కేసీఆర్ రైతుబంధు అందజేశారని చెప్పారు. రుణమాఫీ కాకపాయె, రైతుబంధు పడగకపాయె అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తానని చెప్పి, చేయనందుకు రేవంత్‌రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తిచేశారు. రైతుల కోసం బీఆర్ఎస్ ప్రాణాలకు తెగించి పోరాడుతుందని పేర్కొన్నారు. తాము ఏర్పాటుచేసిన టోల్‌ఫ్రీ నంబర్ ఇప్పటిదాకా 1.32 లక్షల ఫిర్యాదులు వచ్చాయని, వాటిని గవర్నర్‌కు అందజేస్తామని చెప్పారు.
కేసీఆర్ పాలనలో ప్రతి పోలీస్‌స్టేషన్‌కు స్టేషనరీ ఖర్చుల కోసం ప్రతినెల రూ.75,000 మంజూరుచేశామని, తొమ్మిది నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిధులు ఇవ్వడం లేదని హరీశ్‌రావు పేర్కొన్నారు. దీని గురించి పొలీసు అధికారుల సంఘం ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రేవంత్ పాలనలో శాంతిభద్రతలు క్షీణించింది, మత కలహాలు పెరిగింది వాస్తవం కాదా? అని నిలదీశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పోలీసులకు సరెండర్ లీవ్ ఎన్‌క్యాష్ ఎందుకు కావడంలేదని ప్రశ్నించారు. తొమ్మిది నెలల్లో 1,900 లైంగికదాడుల కేసులు, 247 ఇల్లీగల్ వెపన్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. మత కలహాల్లో ఆస్తినష్టం జరిగిన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొన్నారు.
1. ప్రాసెసింగ్‌లో ఉన్నది.
2. తప్పుడు ఆధార్ నంబర్
3. డాటా లభించలేదు
4. పంపబడింది
5. ఆధార్ నంబర్‌తో పోలిస్తే లోన్ ఖాతాలోని పేరు తేడా ఉన్నది
6. కుటుంబ సమూహాన్ని నిర్ణయించాల్సి ఉన్నది.
7. కుటుంబ సమూహాన్ని నిర్ణయించాల్సి ఉన్నది. ఆధార్‌నంబర్‌తో పోలిస్తే లోన్ ఖాతాలోని పేరు తేడా
8. కుటుంబ సమూహాన్ని నిర్ణయించాల్సి ఉన్నది. ఒకరు ప్రభుత్వ ఉద్యోగి
9. కుటుంబ సభ్యుల్లో ఒకరు సర్వీస్ పింఛన్‌దారులు.
10. కుటుంబ సమూహాన్ని నిర్ణయించాల్సి ఉన్నది. పట్టా పుస్తకం లేదు.
11. కుటుంబసభ్యుల్లో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి
12. పట్టా పుస్తకం లేదు
13. పట్టా పుస్తకం లేనివారు, పేరులో తేడా
14. కుటుంబ సభ్యుల్లో ఒకరు సర్వీస్ పింఛన్దారుడైతే..
15. రేషన్‌కార్డు లేనివారు
16, రుణమంజూరు మార్గదర్శకాల్లో పేరు రాలేదు
17. రుణం రెండో దశలో చేర్చడం
18, డీబీటీ సమస్య: బ్యాంక్ ఖాతా మూసివేత
19. వేర్వేరు వ్యక్తులకు ఒకే కస్టమర్ ఐడీ, వేర్వేరు వ్యక్తులకు ఒకే ఖాతా
20. రైతు మరణం, భూమి వారసులకు చేరడం
21. వడ్డీ మొత్తం లోన్ మొత్తాన్ని మించి ఉండటం
22. వేర్వేరు రైతులు ఒకే కుటుంబంగా లెకించబడటం
23. పాక్షిక రుణమాఫీపై రైతు ఫిర్యాదులు
24. తప్పుడు ఖాతా నంబర్
25. ఆధార్ నంబర్, లోన్ ఖాతా పేరులో తేడా, వడ్డీ మొత్తం అసలు మొత్తాన్ని మించి ఉండటం
26. కుటుంబ గ్రూపింగ్ నిర్ణయించాల్సి ఉంది, ఒకరు ప్రభుత్వ ఉద్యోగి, పేరులో తేడా
27. 9.12.2023 నాటికి వడ్డీ మొత్తం ప్రిన్సిపల్ మొత్తాన్ని మించి ఉండటం
28. ఒకే ఖాతా నంబర్‌కు ఒకటి కంటే ఎకువ మంది రైతులు
29. వడ్డీ మొత్తం ప్రిన్సిపల్ మొత్తాన్ని మించి ఉండటం
30. రైతు మరణం
31. తప్పు వ్యక్తికి ఆధార్‌నంబర్ అనుసంధానం
చేతిగుర్తుకు ఓటేసినందుకు కోతలే మిగిలాయి. వ్యవసాయ రంగంలో కొత్తకొత్త పదవులు ఏర్పాటు చేస్తున్నారు. రైతు కమిషన్ పెట్టారు. రుణమాఫీ చేయనప్పుడు పదవులెందుకు? రైతుల అత్మహత్యలు పెంచడానికా ఈ పదవులు? రేవంత్‌రెడ్డి పాలనలో వ్యవసాయ రంగం సంక్షోభంలోకి వెళ్లింది. రైతులు ఆత్మహత్య చేసుకోవద్దు. వారి కోసం బీఆర్ఎస్ ప్రాణాలకు తెగించి పోరాడుతుంది.
-హరీశ్‌రావు