సంగారెడ్డి, మార్చి 7 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ ప్రజలకు ఉపయోగపడే కిట్లు తీసుకువస్తే, రేవంత్‌రెడ్డి తిట్లలో పోటీపడుతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. రేవంత్‌రెడ్డి పదే పదే తన ఎత్తు గురించి మాట్లాడుతున్నారని, తాను కూడా ఆయన ఎత్తు గురించి మాట్లాడగలనని, కానీ రేవంత్‌లా తాను కుసంస్కారంగా మాట్లాడలేనని చెప్పారు.
ఎవరెంత ఎత్తు ఉన్నారో ముఖ్యం కాదని, ప్రజల కోసం ఎవరు ఎంత మంచి చేశారన్నదే ముఖ్యమని స్పష్టం చేశారు. గురువారం నారాయణఖేడ్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో, సంగారెడ్డిలో మీడియాతో హరీశ్ మాట్లాడారు. పాలమూరులో కేసీఆర్‌పై రేవంత్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న దురుద్దేశంతో ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిట్టాల్సి వస్తే తన గురువు చంద్రబాబును తిట్టాలని, తన పార్టీ కాంగ్రెస్ చేసిన మోసాలను నిందించాలని అన్నారు. చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్ లోపాలు, పాలమూరు జిల్లా పాలిట శాపాలు అయ్యాయని తెలిపారు. 2014కు ముందు పాలమూరు జిల్లా పరిస్థితి ఏమిటి? 2024లో పరిస్థితి ఎలా ఉన్నది? అన్న ప్రశ్నకు జవాబిస్తే ఎవరు ఏమిటో అర్థం అవుతుందని అన్నారు.
పాలమూరును దత్తత తీసుకున్న చంద్రబాబు అక్కడ ఒక్క ప్రాజెక్టు కట్టలేదని తెలిపారు. పాలమూరు కరువుతో కాంగ్రెస్, టీడీపీ రాజకీయాలు చేశాయని విమర్శించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జలయజ్ఞంలో ఏపీలోని ప్రాజెక్టులు పూర్తి చేసి, పాలమూరులో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని వెల్లడించారు. పైగా, రాయలసీమకు అక్రమంగా కృష్ణా జలాలు తరలించుకుపోయారని ఆరోపించారు. నాడు కృష్ణా జలాలు తరలించుకుపోతున్నా రేవంత్‌రెడ్డి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రేవంత్ తన పౌరుషాన్ని పాలనలో చూపించాలని హితవు చెప్పారు. పేగులు మెడలో వేసుకునేది మనుషులా? రాక్షసులా? అని అన్నారు.
పాలమూరును సస్యశ్యామలం చేసింది కేసీఆరే
కరువు ప్రాంతమైన పాలమూరును ప్రాజెక్టు జలాలతో సస్యశ్యామలం చేసింది కేసీఆర్ అని హరీశ్‌రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్, టీడీపీలు పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేయలేదని తెలిపారు. పాలమూరు ప్రాజెక్టులకు కేసీఆర్ జీవం చేసి పంటపొలాలకు సాగునీరు అందించారని ఈ సందర్భంగా వెల్లడించారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కాగితాలకు పరిమితం చేస్తే.. కేసీఆర్ దానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ప్రారంభించారని వివరించారు. నారాయణఖేడ్ రైతులకు సాగునీరు ఇచ్చేందుకు కేసీఆర్ 1,800 కోట్ల రూపాయ లతో బసవేశ్వర ఎత్తిపోత పథకం ప్రారంభిస్తే, కాం గ్రెస్ ప్రభుత్వం దాని పనులు నిలిపివేసిందని విమ ర్శించారు. కేసీఆర్‌కు రైతులు ఫస్టు ప్రాధాన్యం అని, రేవంత్‌రెడ్డికి మాత్రం రైతులు లాస్టు ప్రాధాన్యం అని విమర్శించారు.
ఉద్యోగులకు ఒకటవ తారీఖున వేతనాలు వేశామని చెప్తున్న రేవంత్‌రెడ్డి ఇప్పటి వరకు రైతులకు పూర్తిస్థాయిలో రైతుబంధు డబ్బులు జమచేయలేదని తెలిపారు. రైతులను కడుపులో పెట్టుకుని కాపాడుకున్న కేసీఆర్ మంచోడా? రైతుబంధు డబ్బులు ఇవ్వని రేవంత్‌రెడ్డి మంచోడా? అన్నది రైతులు ఆలోచించాలని కోరారు. పార్లమెంట్లో పార్లమెంట్లో తెలంగాణ హక్కుల కోసం పోరాడేది బీఆర్ఎస్సేనని తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ గెలవాలి..
తెలంగాణ నిలవాలి అని పిలుపునిచ్చారు. ఆయా సమావేశాల్లో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, చంటి క్రాంతికిరణ్, బీఆర్ఎస్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, మామిళ్ల రాజేందర్, జైపాల్‌రెడ్డి, ఆదర్శ్‌రెడ్డి, మఠం భిక్షపతి, గాలి అనిల్‌కుమార్, మాణిక్యం, నరహరిరెడ్డి, కొలనుబాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.