299 టీఎంసీలకు బీఆర్ఎస్ ఒప్పుకున్నట్టు కాంగ్రెస్ నాయకులు ఎవరైనా మాట్లాడితే నాలుక చీరేస్తం. తెలంగాణకు 299 టీఎంసీలు అనేది కాంగ్రెస్ చేసిన పాపం. ఇదే విషయాన్ని రేవంత్‌రెడ్డి చెప్పకనే చెప్పారు. ఈ మరణ శాసనం రాసిందే కాంగ్రెస్.
-హరీశ్‌రావు
హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలు కావొస్తున్నదని, సీఎం రేవంత్‌రెడ్డి ఏం ఉద్ధరించారని హరీశ్‌రావు ప్రశ్నించారు. 2025 ఫిబ్రవరి 17న ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకున్నదని, ఏపీకి 511, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపునకు సంబంధించిన ఈ ఒప్పందంపై ప్రభుత్వ కార్యదర్శి సంతకం చేశారని గుర్తుచేశారు. ఈ ఒప్పందంపై సీఎం రేవంత్ సంతకం చేశారని తాను కూడా అనగలనని, కానీ ముఖ్యమంత్రిలా తాను చిల్లర మాటలు మాట్లాడనని స్పష్టంచేశారు. ఇటీవల సీఎం రేవంత్ మాట్లాడుతూ.. హరీశ్‌రావు 50-50% నీటి వాటా అడిగారని, 811లో సగం అంటే 405 అని, కానీ తాను 500 టీఎంసీలు అంటే 95 టీఎంసీలు ఎక్కువ అడుగుతున్నానని సీఎం చెప్పారని గుర్తుచేశారు. ఇది సీఎం రేవంత్‌రెడ్డి అవగాహనరాహిత్యమని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో 763 టీఎంసీలు కృష్ణా జలాల్లో శాశ్వత హక్కు ఇవ్వాలని పోరాడామని చెప్పారు.
తాము కూడా 28 సార్లు ట్రిబ్యునల్‌తో జరిగిన సమావేశాల్లో ఫైనల్ అవార్డు వచ్చే దాకా 811 టీఎంసీల్లో తాత్కాలికంగా 50-50% వాటా కేటాయించాలని లేఖలు రాశామని తెలిపారు. ఇదే విషయమై కేంద్రంతోపాటు సుప్రీంకోర్టులోనూ కొట్లాడినట్టు వెల్లడించారు. తాము కోరినట్టే 50-50% వాటా కావాలని కోరి.. ఏదో ఉద్ధరించినట్టు సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని మండిపడ్డారు. ముఖ్యమంత్రిని తాము గౌరవిస్తామని, కానీ సీఎం తన స్థాయిని దిగజార్చుకుని మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ ఒప్పుకున్నదంటే నాలుక చీరేస్తాం
299 టీఎంసీలకు బీఆర్ఎస్ ఒప్పుకున్నట్టు కాంగ్రెస్ నాయకులు ఎవరైనా మాట్లాడితే నాలుక చీరేస్తామని హరీశ్‌రావు హెచ్చరించారు. గోదావరిలో 968 టీఎంసీలు కాంగ్రెస్ ఇచ్చిందని రేవంత్‌రెడ్డి స్వయంగా చెప్పారని.. అదే కాగితంలో కృష్ణాలో 299 టీఎంసీలు కాంగ్రెస్ ఇచ్చిందని గుర్తుచేశారు. ఈ అంశంపై పోరాడి సెక్షన్-3 తెచ్చిందే బీఆర్ఎస్ అని వెల్లడించారు. 28 సమావేశాల్లో 50-50% వాటా కోసం తాము పోరాడినట్టు స్పష్టంచేశారు. ఇప్పటికే తెలంగాణ వాదనలు ముగిశాయని, ఆంధ్రా వాదనలు ముగిశాక ఆరు నెలల్లో ఫైనల్ అవార్డు వస్తుందని వెల్లడించారు.
కాంగ్రెస్ హయాంలో 27వేల ఎకరాలకే
కాంగ్రెస్ చాలా ప్రాజెక్టులు కట్టిందని, బీఆర్ఎస్ వచ్చాక నిర్లక్ష్యం చేసిందని అనడానికి సీఎం రేవంత్‌రెడ్డికి కొంచెమైనా సిగ్గుండాలని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. 1984లో కల్వకుర్తి ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగిందని, 30 ఏండ్లలో మీరిచ్చిన ఆయకట్టు 13,000 ఎకరాలు కాగా, బీఆర్ఎస్ హయాంలో మూడు లక్షల ఏడు వేల ఎకరాలకు ఆయకట్టు ఇచ్చామని స్పష్టంచేశారు. ప్రాజెక్టుల పంప్‌హౌజ్‌ల వద్ద తాను నేల మీద పడుకున్నానని, తనతోపాటు ఆనాటి మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి కూడా ఉన్నారని చెప్పారు. కరోనా, ఆర్థికమాంద్యం వచ్చినా బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేన్నరేండ్లలో 3.07 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిందని, కృష్ణా బేసిన్, పాలమూరు, దక్షిణ తెలంగాణ మీద తమకు ఉన్న ప్రేమకు ఇదే చిహ్నం అని హరీశ్‌రావు చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో కేవలం మహబూబ్‌నగర్ జిల్లాలోనే 10 లక్షల 8 వేల ఎకరాల కొత్త ఆయకట్టు, స్థిరీకరణ ద్వారా సాధించినట్టు తెలిపారు. కాంగ్రెస్ 27 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చిందని స్పష్టంచేశారు. నాలుగు ప్రాజెక్టులకు, చెరువులు, ఇతర పనులన్నింటికి రూ.ఐదారు వేల కోట్లకుపైగా ఖర్చుచేశామని వివరించారు.
చంద్రబాబు బడ్జెట్లో ఇచ్చింది ఐదు కోట్లే
మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలను సస్యశ్యామలం చేయాలని, పాలమూరు-రంగారెడ్డి ద్వారా 12 లక్షల ఎకరాలకు నీళ్లు రావాలని రూ.28 వేల కోట్లు ఖర్చు చేశామని హరీశ్‌రావు పేర్కొన్నారు. నాడు చంద్రబాబు ఢిల్లీకి అనేక లేఖలు రాసి అడ్డుపడ్డారని, ఇదే కాంగ్రెస్ నాయకులు కేసీఆర్‌కు ఎక్కడ పేరు వస్తుందోనని సుప్రీంకోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్‌లో అనేక కేసులు వేశారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు, ఏపీ నేతలు కేసులు వేసినా బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకెళ్లిందని తెలిపారు. ఒక దశలో ప్రాజెక్టును ఆపాలని స్టే వస్తే.. తాగునీటి అవసరాల కోసమని చెప్పి, అనుమతులు తెచ్చి రూ.28 వేల కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టు కట్టామని వివరించారు. కడిమెర, వట్టెం సహా నాలుగు రిజర్వాయర్లు పూర్తయ్యాయని, స్విచ్ వేస్తే నీళ్లు వచ్చేలా చేశామని తెలిపారు. కాంగ్రెస్ అధికారం చేపట్టి 20 నెలలు కావొస్తున్నా.. నాలుగు రిజర్వాయర్లు నింపే తెలివి లేదా? అని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టుల కోసం బడ్జెట్లో ఏడాదికి రూ.5 కోట్లు మాత్రమే కేటాయించేవారని విమర్శించారు. తాము మూడు లక్షల ఎకరాలకు నీరందిస్తే బీ ఆర్ఎస్ పని చేయలేదని అనడం ఏమిటని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా పాలమూరుపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టిపెట్టాలని, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.
గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్టు రేవంత్ తీరు
నీళ్ల మీద కేసీఆర్ నిజాయితీని ఎవరైనా శంకిస్తే.. గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్టే ఉంటుందని, తెలంగాణ ప్రయోజనాలు, నీళ్ల విషయంలో ప్రాణాలు లెక్కచేయని కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి మాట్లాడటం అదేవిధంగా ఉన్నదని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఒకసారి టీడీపీ ఎమ్మెల్యేగా రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. తన తండ్రి చనిపోతే తమ జిల్లాలో కనీసం నీళ్లు లేవని, కరెంటు కూడా లేదని, అందుకే నెత్తి మీద నీళ్లు చల్లుకొని వెళ్లినట్టు చెప్పారని గుర్తుచేశారు. మరి ఇప్పుడు అదే జిల్లాకు వెళ్తే పచ్చని పొలాలు ఎలా కనబడుతున్నాయని ప్రశ్నించారు. కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయలో చెరువులు బాగు చేయడంతో పాలమూరు జిల్లాలో 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడంతోనే ఇది సాధ్యమైందని హరీశ్‌రావు వివరించారు.
శ్రీశైలం ప్రాజెక్టు నిండి గేట్లు ఎత్తితే నేటికీ కల్వకుర్తి లిఫ్ట్‌ను ప్రారంభించలేదు. 15-20 రోజుల నుంచి నీళ్లు వచ్చినా… ఎందుకు మోటర్లు ప్రారంభించడం లేదు. మోటర్లు ఆన్ చేసి ఎందుకు చెరువులు, రిజర్వాయర్లు నింపడం లేదు.
-హరీశ్‌రావు
2005లో కాంగ్రెస్ సర్కారు చేపట్టిన ప్రాజెక్టుల కింద తొమ్మిదేండ్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలో సాగునీరు ఇలా..