హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో రైతులకు రుణమాఫీ పథకాన్ని అమలు చేయలేదని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే హరీశ్‌రావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. రైతులందరికీ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్న ప్రభుత్వ హామీ నీటి మూట అయ్యిందనే పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిల్లోని విషయాలతో ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించాలని పిటిషనర్ హరీశ్‌రావుకు ధర్మాసనం సూచించింది.
ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పిస్తే ఆ తరువాత విచారణ చేపడుతామని స్పష్టంచేసింది. తదుపరి విచారణను జూన్ 8వ తేదీకి వాయిదా వేసింది. తొలుత పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది జే రామచంద్రరావు, న్యాయవాది రామవరం చంద్రశేఖర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, రూ.2 లక్షల్లోపు రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ అమలు లోపభూయిష్టంగా ఉన్నదని వివరించారు. ఇరువర్గాల వాదనల అనంతరం హైకోర్టు తదుపరి విచారణను జూన్ 8కి వాయిదా వేసింది. ఈలోగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం సమర్పించాలని పిటిషనర్‌కు సూచించింది.