హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): రైతుబీమాను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు ఏ కారణంతోనైనా రైతు మరణిస్తే, వారి కుటుంబాలు రోడ్డున పడకుండా కాపాడుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన రైతుబీమాను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతున్నదని శనివారం ఎక్స్ వేదికగా విమర్శించారు. రైతుబీమా కోసం ఫిబ్రవరిలోనే చెల్లించాల్సిన రూ.775 కోట్ల ప్రీమియాన్ని మే నెల వచ్చినా చెల్లించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు.
ప్రభుత్వ వైఖరి చూస్తుంటే రాష్ట్రంలో రైతుబీమా అమలు చేస్తున్నదా.. లేక అటకెక్కించిందా అంటూ అనుమానం వ్యక్తంచేశారు. వానకాలం రైతుబంధును ఎగ్గొట్టిన ప్రభుత్వం యాసంగి పంటకు మార్చి 31లోగా చెల్లిస్తామని చెప్పి తాత్సారం చేస్తూ ఈ పథకం అమలును ప్రశ్నార్థకం చేసిందని తెలిపారు. దేవుళ్లపై ఒట్టేసి మాట తప్పిందని అన్నారు. తాము వెంటపడితే సగం మందికి మాత్రమే చేసి మిగిలిన రైతుల ఉసురుపోసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పాలనను గాలికొదిలి గాలిమోటర్లలో చక్కర్లు కొట్టే ముఖ్యమంత్రి, మంత్రులకు రైతు కుటుంబాల కన్నీళ్లు కనిపించడంలేదా అని నిలదీశారు. మూడు నెలల్లో మరణించిన 100 మంది రైతుల కుటుంబాలకు బీమా అందకుండాపోతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం బాధిత కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున చెల్లించాలని, వెంటనే ప్రీమియం కట్టాలని డిమాండ్ చేశారు.