హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్ల వృద్ధి రేటు మార్చి నెలలో సున్నా శాతానికి చేరడంపై మాజీ ఆర్థిక మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆందోళన వ్యక్తంచేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా జీఎస్టీ వృద్ధి రేటు పడిపోవడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. మంగళవారం ఆయన ‘ఎక్స్’ వేదికగా జీఎస్టీ వృద్ధికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలను ఉటంకిస్తూ ట్వీట్ చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వృద్ధి రేటు 5.1 శాతానికి పరిమితం కాగా, 2025 మార్చి నాటికి సున్నా శాతంగా ఉన్నట్టు అధికారిక గణాంకాలే వెల్లడిస్తున్నాయని వివరించారు. దేశవ్యాప్తంగా నమోదైన సగటు జీఎస్టీ వృద్ధి రేటు 10%తో పోల్చితే, తెలంగాణ వృద్ధి రేటు చాలా వెనకబడి ఉన్నదని పేర్కొన్నారు.
కానీ, జీఎస్టీ వృద్ధి రేటు 12.3%గా ఉన్నట్టు శాసనసభలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార పేర్కొనడం శోచనీయమని విమర్శించారు. అధికారిక గణాంకాలను పరిశీలిస్తే, భట్టి వాదన పూర్తిగా అవాస్తవమని తేలిపోయిందని పేర్కొన్నారు. రాష్ట్ర జీఎస్టీ వృద్ధిరేటు తగ్గిపోతున్న విషయాన్ని ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లోనే ప్రస్తావించానని, రాష్ట్ర జీఎస్టీ వృద్ధి రేటు 5.5%కు పరిమితమవుతుందని హెచ్చరించానని గుర్తుచేశారు. ప్రతిపక్ష హోదాలో తాము ఇచ్చిన సలహాలు, హెచ్చరికలను కాంగ్రెస్ సర్కారు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి కరోనా సమయంలో మినహా మరెప్పుడూ ఇంత తకువ జీఎస్టీ వృద్ధి ఎన్నడూ నమోదు కాలేదని స్పష్టంచేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి, నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు.
రాష్ట్ర వృద్ధి రేటు క్రమంగా తగ్గడానికి గత 15 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే కారణమని హరీశ్‌రావు విమర్శించారు. క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాల అమలులో లోపాలు, రైతుభరోసా ద్వారా పంట పెట్టుబడి సహాయం అందించకపోవడం, రైతుభరోసా పథకం కింద రూ.12,000 కోట్ల నిధులు విడుదల చేయకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చు సామర్థ్యం తగ్గిపోయిందని వివరించారు.
హైడ్రా, మూసీ ప్రాజెక్టు వంటి తప్పుడు విధానాలతో భయాందోళనలు సృష్టించి పెట్టుబడులు రాకుండా చేయడం, ఫార్మాసిటీ, మెట్రోరైలు ప్రాజెక్టులను రద్దు చేయడం వల్ల వ్యాపార వాతావరణం దెబ్బతిన్నదని పేర్కొన్నారు. ప్రజల చేతిలో డబ్బు లేకపోతే వినియోగం ఎలా పెరుగుతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆర్థిక మంత్రి శాసనసభను మాత్రమే కాదు, తెలంగాణలోని ప్రతి పౌరుడిని మోసం చేశారని, ఇది సిగ్గుచేటని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, మోసపూరిత అంకెల గారడీతో మోసం చేయకుండా, వాస్తవాల ఆధారంగా పాలన అందించాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు.