Harish Rao | హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జనవరి 26 నుంచి కొత్తగా పలు సంక్షేమ పథకాలు ప్రారంభిస్తామని చెప్తున్న ప్రభుత్వ తీరు చూస్తుంటే.. పేదలకు సంక్షేమ పథకాలు ఎలా అందించాలన్న సోయికంటే కోతలు ఎలా పెట్టాలన్న దురాలోచనే ఎక్కువ ఉన్నట్టు తెలుస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. అర్హులకు రేషన్ కార్డులు అందకుండా కోతలు పెట్టేందుకు కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. అందరికీ పరమాన్నం పెడతామని ఆశజూపి అధికారంలోకి రాగానే రేవంత్‌రెడ్డి ప్రజలకు పంగనామాలు పెడుతున్నారని నిప్పులు చెరిగారు. ప్రజాపాలనలో ప్రజలు ఇచ్చిన దరఖాస్తులు, ఆన్లైన్లో పెట్ట్టిన అప్లికేషన్లు బుట్టదాఖలు చేసిన సర్కారు.. ఇటీవల కులగణన సర్వే ఆధారంగా లబ్ధిదారుల లిస్టును రూపొందించి గ్రామాలకు పంపిందని, ఆ జాబితా ఆధారంగా మరింత మందిని తగ్గించాలని ఆదేశాలిచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
తెలంగాణభవన్‌లో శనివారం ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, రసమయి బాలకిషన్, బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్‌తో కలిసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ఇదే అంశంపై సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ సైతం రాశారు. తమ ప్రభుత్వం లబ్ధిదారుల సంఖ్యను ఎలా పెంచాలని చూస్తే, కాంగ్రెస్ సర్కారు ఎలా తగ్గించాలని చూస్తున్నదని విమర్శించారు. ఆరు గ్యారెంటీల్లో మొదటి హామీ మహాలక్ష్మి కింద మహిళలకు రూ.2,500 అమలు కాలేదని, చివరి హామీ చేయూతకు దికు లేదని ఫైరయ్యారు. మధ్యలో ఉన్న అన్ని హామీలదీ దాదాపు అదే దుస్థితి అని, అన్నింట్లో కోతల విధిస్తున్నారని ధ్వజమెత్తారు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టి మోసం చేసింది చాలదన్నట్టు.. రాజ్యాంగం అమలులోకి వచ్చిన జనవరి 26 రోజున పథకాల ప్రారంభం పేరుతో రాజ్యాంగాన్ని వంచిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారని, రేవంత్‌రెడ్డి పాపం చేస్తే అధికారులకు శాపం తగులుతున్నదని వాపోయారు.
ఆ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవాలి
ప్రజాపాలనలో 11 లక్షల మంది, ఆన్లైన్లో కొన్ని లక్షల మంది రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారని వాటిని ఎందుకు పరిశీలించడం లేదని హరీశ్ నిలదీశారు. సిద్దిపేట నియోజకవర్గం నంగునూరు మండలం గట్లమల్యాలలో 110 మంది ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టారని, లిస్టులో 40 మంది పేర్లే వచ్చాయని, అధికారులను అడిగితే హైదరాబాద్ నుంచి పేర్లు వచ్చాయని, తమకేమీ తెల్వదని చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నదని, ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
బీఆర్ఎస్పై బురదజల్లే యత్నం
రేషన్‌కార్డుల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ సర్కారు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నదని హరీశ్ మండిపడ్డారు. పదేండ్ల్ల బీఆర్ఎస్ పాలనలో 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చామని, దీనిద్వారా 20,69,033 మంది లబ్ధిదారులు అదనంగా రేషన్ అందిందని గుర్తుచేశారు. నాటి సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో నిరుపేదలకు రేషన్‌కార్డులు రావాలనే ఆలోచనతో ఆదాయ పరిమితిని కూడా పెంచారని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయ పరిమితి గ్రామీణంలో 60 వేలు, పట్టణంలో 75 వేలు ఉంటే, దాన్ని గ్రామీణంలో రూ.1.50 లక్షలు, పట్టణంలో రూ.2.50 లక్షలకు పెంచారని గుర్తుచేశారు. అంగన్వాడీ టీచర్లు, ఆశాలు, జర్నలిస్టులు, ప్రైవేటు, ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు, పేదవర్గాలకు లాభం జరగాలని ఈ నిర్ణయం తీసుకున్నారని స్పష్టంచేశారు. రేషన్‌కార్డు ద్వారా కుటుంబంలోని ఒకో వ్యక్తికి ఇచ్చే బియ్యం 4 కేజీల నుంచి 6 కేజీలకు పెంచామని, కుటుంబానికి 20 కేజీలే ఉన్న పరిమితిని ఎత్తివేసి, ఎంతమంది ఉంటే అంత మందికి ఒకొకరికి 6 కిలోల రేషన్ ఇచ్చామని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడిన ఆరు నెలల్లోనే మధ్యాహ్న భోజనం, గురుకులాలు, హాస్టళ్లకు సన్నబియ్యం సరఫరా చేశామని చెప్పారు. కాంగ్రెస్ అభయహస్తం మ్యానిఫెస్టోలో రేషన్ కార్డులపై సన్నబియ్యం సరఫరా చేస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చి 400 రోజులు గడుస్తున్నా అతీగతీ లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రజల ఆదాయ పరిమితిని పెంచాలి
పదేండ్లలో ద్రవ్యోల్బణం ఏటా సగటున 5.42 శాతం ఉన్నదని, పదేండ్లకు గాను సుమారు 69.60 శాతం ద్రవ్యోల్బణం నమోదైనట్టు ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) సంస్థతోపాటు ప్రపంచబ్యాంకు స్పష్టంచేసిందని హరీశ్‌రావు గుర్తుచేశారు. దీని ప్రకారం 1.7 రెట్లు ధరల పెరుగుదల నమోదైందని, తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల ఆదాయ పరిమితిని రూ.2.55 లక్షలకు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల ఆదాయ పరిమితిని రూ. 3.40 లక్షలకు పెంచి పేదలందరికీ లబ్ధిచేకూర్చాలని డిమాండ్‌చేశారు. ద్రవ్యోల్బణం లెకల ఆధారంగా పరిగణించి రేషన్‌కార్డులు ఇస్తే ఎంతో మంది నిరుపేదలు రేషన్ కార్డులు పొందుతారని తెలిపారు. 2014లో అంగన్వాడీల వేతనం రూ.4,200 ఉండేదని, కేసీఆర్ ప్రభుత్వం మూడు దఫాలుగా పెంచి వారి వేతనాన్ని రూ.13,650కి పెంచిందని, 2014లో వీరి వార్షికాదాయం రూ.50,400 ఉండగా, పెరిగిన వేతనం ప్రకారం ఇప్పుడు వార్షికాదాయం రూ.1,63,800 అని, రేషన్ కార్డుల జారీలో 2014 నిబంధనలను అనుసరిస్తే రాష్ట్రంలో ఏ ఒక్క అంగన్వాడీ టీచర్‌కు రేషన్‌కార్డు రాదని, ఆశాలు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, చిరుద్యోగులకు ప్రభుత్వ అశాస్త్రీయ నిబంధనల వల్ల రేషన్ కార్డులు రాని దుస్థితి నెలకొన్నదని మండిపడ్డారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఆదాయ పరిమితిని పెంచి పేదలకు లాభం చేయాలని డిమాండ్ చేశారు. 28వ తేదీ నుంచి గ్రామ సభల్లో రేషన్ కార్డుల గురించి ప్రశ్నించి ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అర్హులకు వచ్చే దాకా బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని భరోరా ఇచ్చారు. షరతులు లేకుండా మీ సేవ, ప్రజాపాలన, కుటుంబ సర్వేలో కూడా ఇచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొని అర్హులందరికీ రేషన్‌కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ కూలీలకు భరోసాలో కోతలు
ఎన్నికల మ్యానిఫెస్టోలో వ్యవసాయ కూలీలందరికి ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఉపాధి హామీ జాబ్‌కార్డుకు లింకు పెడుతున్నారని, నాడు ఎందుకు ఇదంతా చెప్పలేదని హరీశ్ నిలదీశారు. కూలీలు గ్రామాల్లో ఉంటే, గ్రామంలో దరఖాస్తులే తీసుకోలేదని, సెక్రటేరియట్లో కంప్యూటర్లో ఉన్న డాటా ఆధారంగా రైతులను ఎంపిక చేయడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉపాధి హామీ జాబ్ కార్డులు 52 లక్షలు (కుటుంబాలు) ఉంటే, 1.4కోట్ల మంది కూలీలు ఉన్నారని, 20 రోజుల పనిదినాల నిబంధనలు పెట్టి, అర్హులను 25 లక్షలకు కుదించారని, గుంట భూమి ఉన్నా ఇచ్చేది లేదనే ఆంక్ష పెట్టి అర్హుల సంఖ్యను 6 లక్షలకు కుదించారని మండిపడ్డారు. కోటి మందికిపైగా రైతు కూలీలు ఉంటే, ఆరు లక్షల మందికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామనడం ఏం న్యాయమని నిలదీశారు. వ్యవసాయ కూలీలను నిర్ణయించాల్సింది గ్రామాల్లోనని, ఎవరు కూలికి పోతున్నరో అడగాలిగాని, కంప్యూటర్ డేటా ఆధారంగా కోతలు విధించడం దుర్మార్గమని మండిపడ్డారు. 94 శాతం మందికి ఎగ్గొట్టి, 6 శాతం మందికి చేస్తున్నం అంటే ఎగ్గొడుతున్నట్టే కదా? అని ప్రశించారు. ‘ఎస్సీ, ఎస్సీ, బీసీల్లోనే ఎకువ మంది రైతు కూలీలు ఉంటరు. వాళ్ల నోట్లో మట్టి కొట్టడానికి నీకు చేతులెట్ల వచ్చినయి రేవంత్‌రెడ్డీ?’ అని నిలదీశారు. సెంటు భూమి ఉన్నా కూలీలకు భరోసా ఇవ్వమని చెప్పడం తగదని, మీరిచ్చే భరోసా ద్వారా 750 వస్తదని, ఏటా ఇచ్చే రూ.12 వేలు ఎగ్గొడుతామంటే ఎట్లా? అని ప్రశ్నించారు. ఎకరంలోపు ఉన్న వారికి కూడా ఆత్మీయ భరోసా ఇవ్వాలని, హమాలీలతోపాటు పట్టణ కూలీలకు కూడా ఆత్మీయ భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షలివ్వాలి
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షలు ముందే ఇవ్వాలని హరీశ్ డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీల్లో పేదలే ఎక్కువగా ఉంటారు కాబట్టి పునాది వేయడానికి ముందే కిస్తీ డబ్బులు చెల్లించాలని, అప్పుడు వారు బేస్మెంట్ వేసుకొనే ఆవకాశం ఉంటుందని చెప్పారు. తెలంగాణలో అన్ని హామీలు అమలు చేసినమని రేవంత్‌రెడ్డి ఢిల్లీకి పోయి గొప్పలు చెప్తున్నారని, మొదటి గ్యారెంటీ మహాలక్ష్మి నుంచి చివరిదైన చేయూత దాకా ఎగ్గొట్టాడని విమర్శించారు. ఢిల్లీ ప్రజలు అమాయకులు కాదని, కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. అమలును వాయిదా వేసుకొనైనా అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, లేదంటే నిరసనలు తప్పవని, ప్రభుత్వాన్ని ఎకడికడ నిలదీయాలని బీఆర్ఎస్ శ్రేణులకు హరీశ్ పిలుపునిచ్చారు.
రైతు కుటుంబానికి 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సైదాపూర్‌లో గిరిజన రైతు జాదవ్ దేవరావును బ్యాంకు వాళ్లు అప్పుకట్టాలని వేధిస్తే ఆయన బ్యాంకులోనే పురుగుల మందు తాగి చనిపోయారని హరీశ్ ఆవేదన వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి సర్కారు చెప్పినట్టుగా డిసెంబర్ 9వ తేదీనే రుణమాఫీ చేసి ఉంటే ఈ రైతు ఆత్మహత్య చేసుకొనే పరిస్థితి వచ్చేది కాదని, ఈ రైతును చంపింది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వమేనని మండిపడ్డారు. రుణమాఫీ విషయంలో రేవంత్ మోసం వల్లే రైతు చనిపోయాడని ఆవేదన వ్యక్తంచేశారు. రుణమాఫీ, రైతుభరోసా, బోనస్ ఇలా అన్ని విషయాల్లో రైతులను రేవంత్‌రెడ్డి మోసం చేశారని విమర్శించారు. ఇప్పుడు రేషన్‌కార్డులు ఇవ్వకుండా పేదల ఉసురు పోసుకుంటున్నారని మండిపడ్డారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ తరఫున రైతు కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థికంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
పదేండ్ల్ల బీఆర్ఎస్ పాలనలో 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చినం. దీనివల్ల 20,69,033 మంది లబ్ధిదారులు అదనంగా రేషన్ పొందిండ్రు. కేసీఆర్ మానవతా దృక్పథంతో నిరుపేదలకు రేషన్‌కార్డులు రావాలన్న ఆలోచనతో ఆదాయ పరిమితిని కూడా పెంచిండ్రు. ఎకువ మందికి రేషన్‌కార్డులు ఇవ్వాలనే ఆలోచన మేముచేస్తే.. ఎకువ మందికి కోత పెట్టే ఆలోచన రేవంత్‌రెడ్డి చేస్తున్నడు.
– హరీశ్‌రావు
పోజులు మాని టైంకు వేతనాలివ్వు
ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసామని ఢిల్లీకి వెళ్లి అబద్ధాలు చెప్తున్న రేవంత్‌రెడ్డి పాలనలో ఉద్యోగులు వేతనాలు అందక రోడ్డెక్కే దుస్థితి నెలకొన్నదని ఎక్స్ వేదిగా హరీశ్ విమర్శించారు. ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తామని అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డికి చిరుద్యోగుల కష్టాలు కనిపించకపోవడం దురదృష్టకరమని ధ్వజమెత్తారు. నాలుగు నెలలుగా పంచాయతీ కార్మికులు, మూడు నెలలుగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ సిబ్బంది, నెల గడిచినా మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు వేతనాలందక నరకయాతన పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్, ఏపీఓలు వేలాది మంది చిరుద్యోగులు జీతాలివ్వాలని ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టుకున్న దయనీయ పరిస్థితి నెలకొన్నదని వాపోయారు. దాదాపు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. నెలలు గడిచినా వేతనాలు రాక కుటుంబ పోషణ భారమై, అప్పుల పాలవుతున్నారని, వేతనాల కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారని తెలిపారు. కుర్చీ కాపాడుకోవడం కోసం ఢిల్లీకి చకర్లు కొట్టడం, విదేశాలకు వెళ్లి వేలకోట్ల పెట్టుబడులు తెస్తున్నామనే డబ్బా కొట్టుకోవడం మానేసి పాలనపై దృష్టి సారించాలని హితవుపలికారు. ఇప్పటికైనా చిరుద్యోగులందరికీ సకాలంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.