హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రావాలి.. మా సమస్యలు తీర్చాలి.. అంటూ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల కస్తూరిబా గురుకుల విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. నడి రోడ్డెకి నినదించిన వారి ఆవేదనను మానవత్వంతో అర్థం చేసుకోండి.. విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి వద్దే ఉన్నది.. గురుకులాల్లో నెలకొన్న సమస్యలను పరిషరించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలి.. అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డిని డిమాండ్ చేశారు.
పరిపాలన మీద దృష్టి సారించి, ప్రజల సమస్యలను పట్టించుకోవాలని హితవు పలికారు. తరగతి గదిలో చదువుకోవాల్సిన విద్యార్థులు, నడిరోడ్డుపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారని శుక్రవారం ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తంచేశారు.
గురుకులాల్లో నెలకొన్న సమస్యలను పరిషరించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. గురుకులాల అధ్వాన పరిస్థితుల గురించి ప్రతిపక్షంగా తాము ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి చీమకుట్టినట్టయినా ఉండటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సారొస్తారా.. అని ఎదురుచూస్తున్న విద్యార్థులకు తీవ్ర నిరాశే మిగులుతుందని శుక్రవారం మీడియాలో వచ్చిన కథనాన్ని పేర్కొన్నారు.
ఉపాధ్యాయులు లేక, విద్యా వలంటీర్లను నియమించక ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయని, తరగతి గదుల్లో కూర్చొని పాఠాలు నేర్చుకోవాల్సిన పిల్లలు, బడికి దూరమవుతున్నారని తెలిపారు. విద్యాశాఖను కూడా నిర్వహిస్తున్న సీఎంకు ఇవేవీ పట్టడం లేదని విమర్శించారు.