Harish Rao | సిద్దిపేట, డిసెంబర్ 12( నమస్తే తెలంగాణ ప్రతినిధి): అధికారంలోకి వచ్చిన వెంటనే చాయ్ తాగినంత సేపట్లోనే సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను తీరుస్తానని చెప్పిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు ముఖం చాటేశారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేట కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న రిలే నిరహార దీక్షకు గురువారం హరీశ్‌రావు సంఘీభావం తెలిపి మాట్లాడారు. కేసీఆర్‌ను అధికారంలో నుంచి దించడానికి ఒక గంట ఎక్కువ పని చేయాలని ఆ రోజు సమగ్ర శిక్ష ఉద్యోగులను రేవంత్‌రెడ్డి కోరారని, అధికారంలోకి వచ్చాక నెల రోజుల్లోనే సెక్రటేరియట్లో కూర్చుని చాయ్ తాగుతూ సమస్య పరిష్కరించుకుందామని హామీ ఇచ్చి ఇప్పుడు మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొదటి సంతకంతో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి అటు రైతులను మోసం చేశాడని, దేవుళ్ల మీద ఒట్టుపెట్టి నాలుగు కోట్ల మంది ప్రజలను మోసం చేశాడని మండిపడ్డారు. బాండ్ పేపర్ల మీద రాసి మరీ హామీలు అమలు చేస్తామని ప్రజలను మోసం చేసిన వ్యక్తి రేవంత్‌రెడ్డి కాదా? అని ప్రశ్నించారు. రూ. 15,000 రైతు భరోసా, రూ.4 వేల ఆసరా పింఛన్, మహిళలకు రూ. 2,500 చొప్పున ఇస్తా అని మోసం చేసిందని నిజం కాదా? అని నిలదీశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తవుతున్నా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. వరంగల్ ఏకశిల పార్కు వద్ద ధర్నా చేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు సెప్టెంబర్ 13 ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానన్నారని, దానిని గుర్తుచేసేందుకు ఇందిరాపార్కు వద్ద ధర్నా చేస్తున్న ఉద్యోగులను అరెస్టు చేయడం తగదని హితవు పలికారు.
అసెంబ్లీని ముట్టడిస్తే మహిళలు అని కూడా చూడకుండా అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌లో పెట్టావంటూ సీఎం రేవంత్‌రెడ్డిపై హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధ్దరిస్తానని గొప్పగా చెప్పిన ప్రజాస్వామ్యం ఇదేనా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలు అయ్యేలోగా ఉద్యోగస్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎగవేతల రేవంత్‌రెడ్డి అన్నందుకు కేసు పెట్టావని, ఇచ్చిన హామీలను ఎగబెట్టినవు కాబట్టే నీ పేరు ఎగవేతల రేవంత్‌రెడ్డి అని పిలుస్తున్నట్టు చెప్పారు. హామీలు అమలు చేసే వరకు నిన్ను ఎగవేతల రేవంత్‌రెడ్డి అనే పిలుస్తామని, లక్ష కేసులు పెట్టినా బయపడేది లేదని స్పష్టం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం పెట్టే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాలల్లో విషాహారం తిని ఇప్పటి వరకు 49 మంది విద్యార్థులు చనిపోయారని, నిర్వాహకులకు మెస్ బిల్లులు ప్రభుత్వం విడుదల చేయడం లేదని విమర్శించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విద్యకు 15 శాతం బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి ఏడు శాతం కూడా కేటాయించలేదని హరీశ్‌రావు మండిపడ్డారు. విద్యా వలంటీర్లను పూర్తిగా తొలగించారని, సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను ముంచి విజయోత్సవాలు చేసుకోవడం సిగ్గుచేటని దుమ్మెత్తి పోశారు. నాలుగు గంటలు అదనంగా పనిచేసి రేవంత్‌రెడ్డి మెడలు వంచుదామని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడిద్దామని పిలుపునిచ్చారు. ఈనెల 16 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో సమగ్ర శిక్షా ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం బీఆర్ఎస్ తరఫున పోరాటం చేస్తామని హరీశ్‌రావు హామీ ఇచ్చారు.