సీఎంపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీశ్ రావురేవంత్!.. నేను, కేటీఆర్ ఇద్దరం పోటీపడుతం. శనీశ్వరుడిలాగా ఈ రాష్ర్టానికి పట్టిన నీ పీడను తొలగించడానికి, నిన్ను దించడానికి పోటీ పడుతం. పదవుల కోసం పోటీ పడం. రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయడం కోసం, మేలు జరగడం కోసం, ప్రజలకు నువ్విచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయించేదాక పోటీపడుతం. నీ ముక్కుపిండి మహాలక్ష్మి కింద మహిళలకు 2500 ఇప్పించేదాక నీ వెంటపడుతం.రైతురుణమాఫీ పూర్తయ్యేదాక వెంటపడుతం. రైతులకు 15 వేలు రైతుబంధు డబ్బులు పడేదాక పోటీపడి నీ వెంటపడుతం.
కేంద్రాన్ని ఎవరైనా ఏం కోరుతరు? రాష్ర్టానికి ఓ జాతీయ ప్రాజెక్టో, స్పెషల్ ప్యాకేజీనో ఇవ్వాలని కోరుతరు. బడ్జెట్లో కేటాయింపులు పెంచాలని కోరుతరు. రైల్వే లైన్లు కోరుతరు. నిధులు కోరుతరు. కానీ, అందగత్తెల పోటీలకు సహకరించాలని కేంద్రాన్ని కోరిండు రేవంత్.
Harish Rao | హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ) : శాసనసభను అబద్ధాలకు వేదికగా మార్చి వాటికి బ్రాండ్ అంబాసిడర్‌గా రేవంత్ నిలిచారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణ జాతిపితగా పేరుతెచ్చుకుంటే సీఎం రేవంత్‌రెడ్డి బూతుపితగా పేరు తెచ్చుకున్నారని దెప్పిపొడిచారు. అసెంబ్లీ వేదికగా రేవంత్ వాడిన భాష బూతు సినిమాకు స్క్రిప్ట్‌గా ఉన్నదని దుయ్యబట్టారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌రెడ్డి, అంజయ్యయాదవ్, కుర్రా సత్యనారాయణ, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీ ప్రసాద్‌తో కలిసి హరీశ్ మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సొంత పార్టీ నాయకులతో సోషల్ మీడియాలో ట్రోల్ మొదలు పెట్టిన చరిత్ర రేవంత్‌రెడ్డిదని, వ్యక్తిత్వ హననం చేయడాన్నే ఆయన వృత్తిగా ఎంచుకున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా అసత్యాలను వండివార్చడంలో దిట్టని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డిని ఫాదర్ ఆఫ్ బాడీ షేమింగ్‌గా వర్ణించారు.
కేసీఆర్‌కు రేవంత్ క్షమాపణ చెప్పాలి
‘సమైక్యాంధ్ర పాలకుల వలలో చిక్కి ఆరున్నర దశాబ్దాలుగా అరిగోస పడుతున్న సమయంలో తెలంగాణను చావునోట్లో తలపెట్టి తెచ్చిన నాయకుడు కేసీఆర్.. పదేండ్లు అభివృద్ధి పథంలో నడిపించి దేశానికి దిక్సూచిగా నిలిపిన నేత కేసీఆర్’ అని హరీశ్ కొనియాడారు. అలాంటి మహానాయకుడిని మార్చురీకి పంపాలని మాట్లాడుతావా?అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాటమార్చడంలో రేవంత్‌ను మిం చిన వారు ఉండరని, 24 గంటల్లోనే తాను కేసీఆర్‌పై మాట్లాడలేదని, బీఆర్ఎస్ను ఉద్దేశించి మాట్లాడానని పేర్కొనటం రేవంత్ సిగ్గుమాలిన తనానికి నిదర్శనమని నిప్పులు చెరిగారు. కేసీఆర్‌పై రేవంత్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ముసుగులో బీజేపీ మనిషి రేవంత్
సీఎం రేవంత్ కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి అని హరీశ్ విమర్శించారు. మోదీ మెప్పు పొందేందుకు శాసనసభలో రేవంత్ కేంద్రాన్ని ఆకాశానికెత్తారని, అసెంబ్లీలో రేవంత్ ప్రసంగాన్ని కాంగ్రెసోళ్లకన్నా ఎక్కువగా బీజేపీ వాళ్లు కీర్తించటమే నిదర్శమని ఉదహరించారు. రాహుల్‌గాంధీ ప్రధాని మోదీని చౌకీదార్ కాదు చోర్ అంటే రేవంత్ బడేభాయ్ అని ఆకాశానికెత్తారని, మోదీ విషయంలో రాహుల్ చెప్పింది నిజమా? లేక రేవంత్ చెప్పింది నిజమా? అని ప్రశ్నించారు.
చంద్రబాబుకు పాదపూజ చేసిండన్నమా?
బీఆర్ఎస్ నేతలు పైశాచికానందం పొందుతున్నారని అసెంబ్లీ వేదికగా రేవంత్ వ్యాఖ్యానించడాన్ని హరీశ్ తీవ్రంగా ఖండించారు. ఎస్ఎల్బీసీ ప్రమాదంలో చిక్కుకున్నవారి జాడ ఇప్పటికీ తెలియలేదని అడిగితే పైశాచికానందమా?అని నిప్పులు చెరిగారు. ప్రమాద బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సిందిపోయి చాపర్‌లో తిరుగుతూ ఒక మంత్రి ఇంటర్వ్యూలు చేయటాన్ని, చేపల పులుసు చేయించుకొని తినటాన్ని ప్రశ్నిస్తే పైశాచికానందమా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ 15 నెలల పాలనలో ఖమ్మంలో పెద్ద వాగు కొట్టుకుపోయిందని, సుంకిశాల కూలిపోయిందని, ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలిందని, పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగమైన వట్టెం రిజర్వాయర్ పంప్‌హౌస్ మునిగి పోయిందని వివరించారు. ‘మోదీ పాకిస్తాన్‌కు వెళ్లి నవాజ్ షరీఫ్ దగ్గర భోజనం చేసి వచ్చినంత మాత్రాన దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని అనొచ్చా? రాహుల్ చైనా వెళ్లొచ్చినంత మాత్రాన వారు దేశానికి నష్టం చేస్తున్నారని అనొచ్చా? ప్రజాభవన్‌కు చంద్రబాబును రేవంత్‌రెడ్డి పిలిచి తన గురువుకు కాళ్లు ఒత్తారనో? పాదపూజ చేశారనో అనగలమా?’అని ప్రశ్నించారు.
ఎమ్మెల్సీ ఫలితాలే రేవంత్ పతనానికి నాంది
ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు, పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీని ఓడించారని.. ఈ ఫలితాలే రేవంత్ పతానికి నాంది పలికాయని హరీశ్ నిప్పులు చెరిగారు. రేవంత్‌రెడ్డి రెండోసారి అధికారంలోకి రావడం కలేనని తేల్చిచెప్పారు.
రేవంత్ తిట్లతో రాజకీయాలు కలుషితం
అసెంబ్లీ వేదికగా పరుష పదజాలం, భాష గురించి రేవంత్‌రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉన్నదని హరీశ్ దెప్పిపొడిచారు. ఆయా సందర్భాల్లో రేవంత్‌రెడ్డి వాడిన భాషను ఈ సందర్భంగా మీడియా ఎదుట ప్రదర్శించారు. రేవంత్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చాక చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ ‘రేవంత్‌రెడ్డీ మీ భార్యాబిడ్డలే భార్యాబిడ్డలా? ఎదుటివారికి భార్యాబిడ్డలు ఉండరా? ఎదుటివారికి కుటుంబ సభ్యులు ఉండరా? నీ వరకు వస్తే తప్ప నొప్పి తెలియదా?’ అని నిలదీశారు. రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కేసీఆర్‌ను కాల్చిపారేయాలని, ప్రగతిభవన్‌ను పేల్చిపారేయాలని పేర్కొన్న ఉదంతాలను వివరించారు. కేటీఆర్ కుమారుడిని ఉద్దేశించి రేవంత్ నోటికొచ్చినట్టు మాట్లాడారని, తన ఎత్తూ పొడుగు గురించీ అడ్డమైన కూతలు కూశారని నిప్పులు చెరిగారు. అన్నం తినేవాళ్లెవరూ రేవంత్‌లా మాట్లాడరని, రాజకీయాలను తిట్లతో కలుషితం చేసిందే రేవంత్ అన్నారు.
మేం పదవుల కోసం పోటీపడం
ప్రతిపక్షనాయకుడి పదవి కోసం కేటీఆర్, హరీశ్‌రావు పోటీపడుతున్నారని రేవంత్‌రెడ్డి అబద్ధపు ప్రచారం చేస్తున్నారని హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కేటీఆర్ అయినా, నేనైనా కేసీఆర్ తయారు చేసిన సైనికులం.. మేము ఉద్యమకారులం.. మాలో మాకు విభేదాలు సృష్టించాలని ఎవరైనా ప్రయత్నిస్తే అది దింపుడు కళ్లం ఆశగానే మిగులుతది. కేటీఆర్, నేను పదవుల కోసం పోటీపడం. ప్రజల ప్ర యోజనాల కోసం పోటీ పడుతం. మంత్రి పదవులనే త్యాగం చేసిన చరిత్ర మాది. ఆరు గ్యారెంటీలను అమలు చేసేదాకా వెంట పడుతం’అని తేల్చిచెప్పారు.
ఇప్పటికైనా జై తెలంగాణ అన్నవా?
తెలంగాణ ద్రోహిగా ముద్రపడిన రేవంత్‌రెడ్డి తెలంగాణ సంస్కృతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉన్నదని హరీశ్ ఎద్దేవాచేశారు. ఉద్యమంలో ఏనాడైనా పాల్గొన్నావా? అరెస్టయినవా? రాజీనామా చేసినవా? ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పుడైనా కడుపు నిండా ఒక్కసారన్న ‘జై తెలంగాణ’ అన్నావా? అని నిలదీశారు. తెలంగాణ చరిత్రకు, వారసత్వ సంస్కృతికి ప్రతీక కాకతీయ తోరణాన్ని రాజముద్రలోంచి తీస్తానన్నారని, తెలంగాణ బతుకు చిత్రానికి దర్పణమైన బతుకమ్మను తెలంగాణ తల్లి నుంచి వేరుచేసి పాపం చేశారని మండిపడ్డారు.
మహిళల సంక్షేమానికి ఏం చేసినవ్?
మహిళల ఓట్ల కోసం బోగస్ మాటలు చెప్పిన రేవంత్‌రెడ్డి.. వారి సంక్షేమానికి ఏం చేసిండో చెప్పాలని హరీశ్ డిమాండ్ చేశారు. ‘వేలాదిమంది ఆశ వరర్లు కోఠిలోని వైద్య విధాన పరిషత్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తుంటే లాఠీలతో కొట్టించిన చరిత్ర నీది. ఆశ, అంగన్వాడీ వరర్లకు ఇచ్చిన హామీ ఏమైంది?’ అని ప్రశ్నించారు. ‘మహిళలకు 2500 ఇస్తా అన్నవు. ప్రతి మహిళకు 37 వేలు బాకీ పడ్డావు. ఇది మోసం కాదా? లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలిస్తున్నట్టు ఏదైనా జీవో ఇచ్చినవా? చూపెట్టు అని సవాల్‌చేశారు.
మహిళా సంఘాల్లో ఉన్నదే 65 లక్షల మంది..
‘మహిళా సంఘాల్లో 65 లక్షల మంది ఉంటే కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తానని అబద్ధపు ప్రచారం చేస్తున్నావు’ అంటూ హరీశ్ దుయ్యబట్టారు. ఆడ బిడ్డలు అని కూడా చూడకుండా జర్నలిస్టులను జైల్లో పెట్టారని మండిపడ్డారు. నాడు మహిళల కోసం కేసీఆర్ 75 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్‌లు పెట్టారని, వాటిని రేవంత్ మూసేస్తున్నాడని, ఇదేనా మహిళలపై ఉన్న ప్రేమ? అని ప్రశ్నించారు. ‘మహిళలకు స్థానిక సంస్థల్లో, మారెట్ కమిటీల్లో 50 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ పెట్టి ఆడబిడ్డలకు అండగా నిలబడ్డది కేసీఆర్. ఆరోగ్య మహిళ పేరిట ప్రత్యేకంగా హాస్పిటల్‌ను తెరిపించింది కేసీఆర్. షీ టీమ్‌లతో రక్షణ కల్పించింది కేసీఆర్’ అని చెప్పారు.
ఉద్యోగాలపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా?
నిరుద్యోగుల గురించి మాట్లాడే హకు రేవంత్‌రెడ్డికి లేదని హరీశ్ ఫైర్ అయ్యారు. ‘1,62,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. డిపార్ట్మెంట్ వారీగా లెక చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రా’ అని సవాల్ చేశారు. ‘కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రాష్ట్రపతి గెజిట్ తీసుకొచ్చి తెలంగాణ బిడ్డలకు 95 శాతం ఉద్యోగాలు తెచ్చిన ఘనత కేసీఆర్‌ది. నువ్వు ఇచ్చినా అని చెప్పుకునే 56 వేల ఉద్యోగాల్లో కూడా నోటిఫికేషన్ ఇచ్చింది పరీక్ష పెట్టింది కూడా కేసీఆర్ ప్రభుత్వమే’ అని గుర్తుచేశారు. అశోక్‌నగర్ లైబ్రరీ మెట్ల మీద కూర్చొని మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. కనీసం 6 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వనందుకు నిన్నేమనాలి రేవంత్‌రెడ్డీ? అంటూ ఫైర్ అయ్యారు.
నిరుద్యోగుల వీపులు పగులగొట్టించినవ్..
‘నిరుద్యోగులు పరీక్షను వాయిదా వేయాలని అడిగితే వాళ్ల వీపులు పగలగొట్టించిన చరిత్ర రేవంత్‌రెడ్డిది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు నిరసన తెలిపే హకు లేదని హుకుం జారీ చేసినవు. నీ పాలన ఇందిరమ్మ నాటి ఎమర్జెన్సీని తలపిస్తున్నది’ అంటూ హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘భోజనంలో పురుగులు వచ్చాయని, బ్లేడ్లు వచ్చాయని ధర్నా చేసే.. నిరసన తెలిపే హకు కూడా లేదని బ్యాన్ చేస్తావా? ఇచ్చిన ప్రజాస్వామిక తెలంగాణ ఏడో గ్యారెంటీ ఇదేనా?’ అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులను కూడా డీఏ కావాలా? జీతం కావాలా? అని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని విమర్శించారు.
గురుకులాల్లో మరణమృదంగం..
కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ తగ్గిందని హరీశ్ చెప్పారు. ‘298 నుంచి వెయ్యికి గురుకులాలను కేసీఆర్ పెంచారు. ప్రతి విద్యార్థి మీద లక్షా 20 వేల రూపాయలు ఖర్చుపెట్టి నాణ్యమైన విద్య, మంచి భోజనం అందించారు. ఆరు లక్షల మంది విద్యార్థులు గురుకుల పాఠశాల్లో చదివారు’ అని గుర్తుచేశారు. 2018లో డైట్ చార్జీలు పెంచింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. గురుకులాల్లో 83 మంది ఎందుకు చనిపోయారని నిలదీశారు.
పోలీసులకు ఆరోగ్యభద్రత కరువు
కాంగ్రెస్ పాలనలో పోలీసుల సంక్షేమం, ఆరోగ్యభద్రత అటెక్కిందని హరీశ్ విమర్శించారు. ‘కాంగ్రెస్ పాలనలో నాలుగు సరెండర్ లీవులు పెండింగ్‌లో ఉన్నాయని స్వయంగా పోలీసులే వాపోయే పరిస్థితి వచ్చింది. మూడు నెలలకు సరెండర్ లీవ్‌ను పకాగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చేది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇస్తలేదు?’ అని ప్రశ్నించారు. ‘మా హయాంలో పోలీస్ కుటుంబాలకు ఏ ఆపద వచ్చినా ఆరోగ్య భద్రత కార్డుతో ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం అందేది. రేవంత్ పాలనలో ఆరోగ్య భద్రత మాయమైంది. ఎన్నికల్లో ఇచ్చిన పోలీస్ హామీని అమలు చేయాలని అడిగినందుకు 30 మంది పోలీసులను సస్పెం డ్ చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులకు 73 శాతం పీఆర్సీతో హోంగార్డు జీతం రెండింతలు చేసింది కేసీఆరేనని గుర్తుచేశారు.
మేం లేఖలు రాస్తేనే కేంద్రం జవాబు
వైద్యంపై రేవంత్ మాటలు నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్టున్నదని హరీశ్ ఎద్దేవా చేశారు. ‘రేవంత్ పాలనలో ప్రభుత్వ దవాఖానల్లో దూది లేదు, సూది లేదు, ఆపరేషన్లు లేవు, మంచాలు అసలే లేవు.. వైద్యం తిరోగమనమైంది’ అని వాపోయారు. బీఆర్ఎస్ హయాంలో 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను హైదరాబాద్ నాలుగు దికులా నిర్మిస్తే.. కాంగ్రెస్ నిధులివ్వక ఆగిపోయాయని తెలిపారు. నిమ్స్‌లో మరో 2 వేల పడకల నిర్మాణానికి అంతా సిద్ధం చేసి పెట్టామని, రాష్ట్రం వచ్చినప్పుడు కేవలం ప్రభుత్వ రంగంలో 5 మెడికల్ కాలేజీలుంటే 2023 నాటికి వాటి సంఖ్య 36 అయింది నిజంకాదా? అని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీలు ఇవ్వాలని కేంద్రానికి కేసీఆర్ ప్రభుత్వం లేఖ రాయలేదని రేవంత్ పేర్కొనటం పచ్చి అబద్ధమని మండిపడ్డారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రులుగా పనిచేసిన లక్ష్మారెడ్డి, ఈటల రాజేందర్ కేంద్రానికి లేఖలు రాయందే.. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, హర్షవర్ధన్ లేఖలు రాశారా? అని ప్రశ్నించారు.
తిట్లు, దాడుల సంస్కృతి తెచ్చిందే రేవంత్
భౌతికదాడులు, యూట్యూబ్ తిట్ల సంప్రదాయాన్ని ఐదేండ్ల కింద తెచ్చిందే రేవంత్‌రెడ్డి అని, ఇప్పుడు తన దాకా వస్తే గాని ఆ తిట్ల బాధ తెలిసొచ్చిందని హరీశ్ చెప్పారు. ‘ఖమ్మంలో వరదల పరామర్శకు సహచర ఎమ్మెల్యేలతో వెళ్తే మాపై దాడి చేయించారు. పోలీస్‌స్టేషన్‌లో కేసు పెడితే ఈరోజు వరకూ నమోదు చేయలేదు. దాడుల సంసృతిని కూడా రాష్ట్రంలోకి తెచ్చింది రేవంత్‌రెడ్డే’ అని మండిపడ్డారు. ‘అసెంబ్లీ సాక్షిగా దాడులు చేయిస్తా అని చెప్పినవు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈ విధంగా మాట్లాడవచ్చునా? అసెంబ్లీలో బట్టలు ఊడ తీసి కొడతానన్న నీ మాటలకు అసెంబ్లీలో ఏం చర్యలు తీసుకోవాలి రేవంత్‌రెడ్డీ? 100ఎలుకలు తిన్న పిల్లి శాకాహారి అన్నట్టున్నది నీ యవ్వారం’అని దెప్పిపొడిచారు.
రుణమాఫీ అయినట్టు నిరూపిస్తవా?
రెండు లక్షల రుణమాఫీపై రేవంత్ నాలుక మరోసారి మడత పడిందని హరీశ్ దెప్పిపొడిచారు. ‘కొడంగల్, సిద్దిపేట, మధిర లేదా మరే నియోజకవర్గంలోనైనా సరే రుణమాఫీ సంపూర్ణమైందని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా.. నా సవాల్‌ను సీఎం, డిప్యూటీ సీఎం ఎవరు స్వీకరిస్తారో చెప్పాలి’ అని సవాల్ చేశారు. కేసీఆర్ హయాంలో రెండు విడతల్లో రూ. 28 వేల కోట్లు మాఫీ చేశామని, కానీ అందులో ఒకే లెక్కను ప్రభుత్వం చెప్పటం దుర్మార్గమని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం ఇప్పటి వరకు చేసింది కేవలం రూ.15 వేల నుంచి రూ.16 వేల కోట్లేనని, చేస్తానని చెప్పింది రూ. 31 వేల కోట్లు అని ఉదహరించారు.
ఎల్ఆర్ఎస్పై క్షమాపణ చెప్తవా?
‘ఎన్నికల ముందు ఎల్ఆర్ఎస్పై రేవంత్‌రెడ్డి ఏం మాట్లాడారో గుర్తుతెచ్చుకోవాలె. కేసీఆర్ ఎల్ఆర్ఎస్ పేరుతో పేదల రక్తమాంసాలు పీల్చుతున్నారు. ఉచితంగా చేయాలి. మేము అధికారంలోకి వస్తే ఉచితంగా చేస్తాం’ అని రేవంత్ చెప్పారని హరీశ్ గుర్తుచేశారు. పేదల మెడపై కత్తి పెట్టి ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ నీతి, నిజాయితీ ఉంటే ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చెయ్యి’ అని డిమాండ్ చేశారు.
ఫార్మాసిటీ భూముల వాపస్ ఏమైంది?
ఫార్మా భూముల కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీతక, భట్టి విక్రమార, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి పాదయాత్రలు చేస్తూ తాము అధికారంలోకొస్తే ఫార్మాసిటీ కోసం బీఆర్ఎస్ తీసుకున్న భూములను వాపస్ ఇస్తామని పేర్కొన్నారని హరీశ్ గుర్తుచేశారు. కేసీఆర్ ప్రభుత్వం 15 వేల ఎకరాలు ఫార్మాసిటీ కోసం సేకరిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం దానికి అదనంగా మరో 15 వేల ఎకరాలను సేకరిస్తామని నోటిఫికేషన్లు ఇచ్చిందని వివరించారు. నాడు రైతుల భూములను రైతులకు ఇస్తామని చెప్పి ఎందుకివ్వటం లేదని ప్రశ్నించారు. రేవంత్ రియల్ ఎస్టేట్ కోసం ఫోర్త్‌సిటీ పాటపాడుతున్నారని విమర్శించారు.
నార్త్ కారిడార్‌కు భూసేకరణ చేసిందెవరు?
రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటుపైనా రేవంత్ అబద్ధాలు చెప్తున్నారని హరీశ్ మండిపడ్డారు. ‘నార్త్ కారిడార్ తానే తెచ్చినట్టు రేవంత్ చెప్తున్నడు. 2022లోనే భూసేకరణ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పీఎంపీడీ నోటిఫికేషన్ జారీ చేసింది. నార్త్ కారిడార్ అనుమతి నువ్వు సాధిస్తే మరి భూసేకరణ మేమెలా చేస్తాం? అధికారంలోకొచ్చి 15 నెలలవుతున్నా సౌత్ కారిడార్ అనుమతులు ఎందుకు రాలేదు? మీ భూముల కోసం 12 కిలోమీటర్ల దాకా ఆరు లేన్ల రోడ్డు వేసుకోవడం వల్ల సౌత్ కారిడార్ ఆలస్యం నిజం కాదా?’ అని నిలదీశారు.
జూలైలో పునాది.. డిసెంబర్లో తెచ్చాడట?
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని తానే తెచ్చానని రేవంత్ ప్రకటించడం విడ్డూరంగా ఉన్నదని హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్ సీఎం కాకముందే 2023 జూలైలోనే ప్రధాని మోదీ కోచ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారని చురకలంటించారు. ‘నీకు మోదీ బడేభాయ్ అయితే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు గాడిదగుడ్డు ఎందుకు వచ్చింది? ఆంధ్రప్రదేశ్‌కు వరాల మూటలు ఎలా వెళ్లాయి? వైజాగ్ ఉకు ఫ్యాక్టరీకి స్పెషల్ ప్యాకేజీ ఇస్తే ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని తుకు కింద అమ్మడానికి ఎందుకు పెట్టిండ్రు? ఇదేనా నువ్వు సాధించిన విజయం’ అని నిలదీశారు. ‘ప్రజల ఆరోగ్యం దెబ్బతింటదని దామగుండంలో నేవీ రాడార్ కు కేసీఆర్ భూములివ్వలేదని, రేవంత్ దామగుండం భూములు ఇచ్చి కంటోన్మెంట్ భూములను తెచ్చుకున్నరు. నువ్వు తెలంగాణ ద్రోహివి. 2021లోనే కేసీఆర్ విద్యుత్ వాహనాలకు జీరో ట్యాక్స్ అమలు చేస్తే, ఇప్పుడు రేవంత్ చేసినట్టు బిల్డప్ ఇస్తున్నారు’అని ఎద్దేవాచేశారు.
ఏడాదిలో బీఆర్ఎస్ అప్పు 41 వేల కోట్లు
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడాదిలో చేసిన అప్పు రూ.41 వేల కోట్లేనని హరీశ్ స్పష్టంచేశారు. కాంగ్రెస్ శ్వేత పత్రంలో (కరోనా రెండేండ్లలో అదనంగా తీసుకున్న అప్పులతో సహా) బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పు 4 లక్షల 17 వేల కోట్లేనని, ఈ లెక్కన తాము ఏడాదికి చేసిన అప్పు 41 వేల కోట్లేనని వివరించారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఒకఏడాదిలోనే రూ. లక్షా 58 వేల కోట్ల అప్పుచేసినట్టు స్వయంగా ముఖ్యమంత్రే అసెంబ్లీలో చెప్పారని గుర్తుచేశారు. శ్వేతపత్రం పేరుతో అసెంబ్లీలో చెప్పింది కరెక్టా? శనివారం రేవంత్‌రెడ్డి వెల్లడించింది సరైందా? చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు.
ఆర్టీసీ ప్రైవేటు పరానికి కుట్ర
ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు రేవంత్ సర్కార్ కుట్ర చేస్తున్నదని హరీశ్ విమర్శించారు. ఆర్టీసీలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు తెప్పించారని దీని ద్వారా డ్రైవర్, మెకానిక్ సహా 9 వేల మంది ఉద్యోగుల పొట్టకొట్టడమేనని ధ్వజమెత్తారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదని, అందులో భాగమే ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశమని విమర్శించారు.
రాష్ట్ర రోడ్లపైనా టోల్ వసూలు
దేశంలో ఇప్పటిదాకా లేని కొత్త విధానాన్ని రేవంత్ ప్రవేశపెడుతున్నారని హరీశ్ ధ్వజమెత్తారు. అన్ని మండలాల్లో హామ్ (హైబ్రీడ్ అన్యూటీ మోడల్) రోడ్లు నిర్మించబోతున్నామని పేర్కొనటం వెనుక ఆంతర్యం జాతీయ రహదారులపై ఉన్నట్టుగానే టోల్గేట్లు పెడతామని చెప్పటమేనన్నారు. హామ్ విధానంలో రోడ్లు అంటే కాంట్రాక్టర్లకు డబ్బుకట్టే పాలసీని తేవడమేనని తేల్చిచెప్పారు.
వద్దన్నది 20 శాతం కమీషన్ల వసూలు
తాము ఏం చేసినా ప్రతిపక్షం వద్దంటున్నదని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారని బిల్లుల చెల్లింపుల్లో 20 శాతం కమీషన్లను మాత్రమే తాము వద్దంటున్నామని హరీశ్ వివరించారు. మున్సిపల్ శాఖలో అనుమతులకు ఎస్ఎఫ్టీకి రూ.50 చొప్పున వసూలు చేయటాన్ని తప్పుపడుతున్నామని చెప్పారు. భూ సమస్యల పరిష్కారంలో 20% భూమిని తీసుకోవటం, బీర్లపై ధరలు పెంచటం, లికర్పై పర్సెంటేజీలు వద్దని అంటున్నామని పేర్కొన్నారు. మహిళలకు రూ. 2500 ఇస్తామంటే వద్దనలేదని, వృద్ధులకు రూ. 4 వేల పింఛన్ ఇస్తామంటే, రుణమాఫీ చేస్తామంటే వద్దనలేదని తేల్చిచెప్పారు.
రేవంత్ అంటే ప్రజలకు కోపం ఇందుకే!
తనకైనా..కేటీఆర్‌కు అయినా రేవంత్ అంటే కోపమేనని, అది వ్యక్తిగతం కాదని హరీశ్ పేర్కొన్నారు. ప్రజలకు నామీద కోపమెందుకు ఉంటుందని రేవంత్ అన్నారని.. కోపమెందుకో వివరించారు.
ఎస్ఎల్బీసీ ప్రమాదంలో చిక్కుకున్నవారి జాడ గురించి అడిగితే పైశాచికానందమా? బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సింది పోయి చాపర్‌లో తిరుగుతూ ఓ మంత్రి ఇంటర్వ్యూలు ఇవ్వటం, చేపల పులుసు వండించుకొని తినటాన్ని ప్రశ్నిస్తే పైశాచికానందమా? నల్లమల నుంచి వచ్చిన బిడ్డనని చెప్పుకొనే ముఖ్యమంత్రి, ప్రమాదం జరిగి 10 రోజులైనా అక్కడికి ఎందుకు పోలేదు? అసలు పైశాచికానందం మీది.
– హరీశ్
మీడియాలో ట్రోల్ చరిత్ర రేవంత్ రెడ్డిదే! వ్యక్తిత్వ హననం చేయడమే వృత్తిగా ఎంచుకున్న వ్యక్తి రేవంత్! సోషల్ మీడియా వేదికగా అసత్యాలను వండి వార్చడంలో దిట్ట! ఫాదర్ ఆఫ్ బాడీ షేమింగ్ రేవంత్‌రెడ్డి! అబద్ధాలకు, అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్‌రెడ్డి! అబద్ధాలకు జీఎస్టీ వేయాల్సి వస్తే రాష్ట్ర ఖజానా మొత్తం రేవంత్ అబద్ధాలకు సరిపోదు. ప్రపంచసుందరి పోటీలు కాదు.. హైదరాబాద్‌లో తిట్లపోటీ పెడితే రేవంత్‌రెడ్డికే మొదటి బహుమతి వస్తది.
-హరీశ్
రేవంత్‌రెడ్డీ.. మీ భార్యాబిడ్డలే.. భార్యాబిడ్డలా ఎదుటివారికి భార్యాబిడ్డలు ఉండరా? ఎదుటివారికి కుటుంబ సభ్యులు ఉండరా? నీ వరకు వస్తే తప్ప నొప్పి తెలియలేదా? రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కేసీఆర్‌ను కాల్చిపారేయాలన్నడు. ప్రగతిభవన్‌ను పేల్చిపారెయ్యాలన్నడు. సూల్కు వెళ్లే కేటీఆర్ కుమారుడిని ఉద్దేశించి నోటికొచ్చినట్టు మాట్లాడిండు. నా ఎత్తూ పొడుగు గురించి అడ్డమైన కూతలు కూసిండు. అన్నం తినేవాళ్లెవరూ రేవంత్‌లా మాట్లాడరు. రాజకీయాలను తిట్లతో కలుషితం చేసిందే రేవంత్‌రెడ్డి.
-హరీశ్
వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు పోయిందన్న చందంగా రేవంత్‌రెడ్డి తీరు ఉన్నది. ఆయన సర్కారు, కాంగ్రెస్ చేసిన పాపాలను కేసీఆర్‌పై నెట్టేందుకు దుర్మార్గంగా ప్రయత్నిస్తున్నరు. రేవంత్..
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినవ్. ఇప్పుడు అవే అబద్ధాలతో పాలన సాగిస్తున్నవ్.
– హరీశ్ రావు
హరీశ్.. పి(పం)ంచ్ హిట్టింగ్