Harish Rao | హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగుల కోసం అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది జాబ్ క్యాలెండర్ కాదని, అదొక జోక్ క్యాలెండర్ అని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. శుక్రవారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో నిరుద్యోగులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. నిరుద్యోగులు తమకు జరిగి అన్యాయాన్ని వివరించడానికి అశోక్‌నగర్ నుంచి బీఆర్ఎస్ కార్యాలయానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో నిరుద్యోగులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్లో ఏమైనా ఉన్నదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హామీ ప్రకారం 2 లక్షల ఉద్యోగాల భర్తీకి ఇం కా 4 నెలల సమయమే ఉన్నదని, ఏదీ తమరు చెప్పిన జాబ్ క్యాలెండర్ అని నిలదీశారు. అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇస్తే, ఆ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారనేది ఉంటుందని, కానీ జాబ్ క్యాలెండర్ ప్రకటించిన వారి పేరు, సం తకం లేదని దుయ్యబట్టారు. అదొక చిత్తు కాగితం లాగా ప్రకటించారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
జ్యాబ్ క్యాలెండర్‌పై ఎలాంటి చర్చ లేకుండా డిప్యూటీ సీఎం చదివి పారిపోయారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. లక్షలాది యువత కంటే ముఖ్యమైన అంశం ఇంకోటి ఉంటదా? అని ప్రశ్నించారు. చర్చ చేయమంటే ఎందుకు పారిపోయారు? అని నిలదీశారు. జాబ్ క్యాలెండర్‌పై చర్చించమంటే ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు మైక్ ఇచ్చి మాట్లాడే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఉద్యోగాల విషయంలో ప్రభుత్వాన్ని వదిలి పెట్టబోమని, నిరుద్యోగుల తరుపున బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.
నిరుద్యోగులకు ఇస్తామన్న రెండు లక్షల ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే, ఉద్యోగాలు ఇచ్చిన మాట నిజమే అయితే, గన్‌మెన్ లేకుండా అశోక్‌నగర్, ఉస్మానియా యూనివర్సిటీకి రావాలని సవాలు చేశారు. సీఎం చెప్పిన తేదీ, సమాయానికి తాను కూడా వస్తానని స్పష్టంచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక ఒక నోటిఫికేషన్ ఇచ్చారా? దమ్ముంటే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు ఇవ్వకుండా ఎన్ని రోజులు దాకుంటారు? ఎన్ని రోజులు తప్పించుకుంటారు? అని ఎద్దేవా చేశారు. యువతకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ‘రాహుల్‌గాంధీ.. నీ క్రెడిబులిటీ ఏమిటి? తమరు వచ్చి సమాధానం చెప్పాలి, లేకుంటే నిరుద్యోగ యువతతో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయానికి వస్తాం, అకడే నిలదీస్తాం’ అని హరీశ్‌రావు హెచ్చరించారు. తెలంగాణ నిరుద్యోగ యువతను కాంగ్రెస్ సర్కారు దగా చేసిందని, శాసనసభ చరిత్రలో ఈ రోజు (శుక్రవారం) బ్లాక్ డే అని పేర్కొన్నారు.
అసెంబ్లీలో దానం నాగేందర్ మాట్లాడిన భాష రౌడీ షీటర్ భాషలా ఉన్నదని, ఆయన సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. దానం వ్యాఖ్యలు కన్నతల్లులను అవమానపరిచేవిధంగా ఉన్నాయని, మాతృత్వం విలువ తెలియని వారు మాత్రమే ఇలా మాట్లాడుతారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా దానం ఇలానే మాట్లాడరని గుర్తు చేశారు. దానం నాగేందర్ వెంటనే క్షమాపణ చెప్పాలని అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారని, అందుకు అక్బరుద్దీన్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ ఏమైనా దానం నాగేందర్ జాగీరా? అని ప్రశ్నించారు. రాష్ట్ర శాసనసభ దుశ్శాసన సభగా మారిందని మండిపడ్డారు. మహిళ ఎమ్మెల్యేలను అవమానపరిచారని, సభా నాయకుడే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తిట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే మహిళలకు దకే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ లోపభూయిష్టంగా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. పోస్టులు ప్రకటించకుండా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం బాధాకరం. జాబ్ క్యాలెండర్లో కనీసం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సంతకం కూడా లేదు. దీనికి ఎలాంటి చట్టబద్ధత కల్పించారు? ఎన్నికల ప్రచారంలో మమ్మిల్ని వాడుకుని వదిలేయడం ఎంతవరకు సమంజసం? మా ఆశలు అడియాసలు అయ్యాయి.
-మహేందర్, నిరుద్యోగి
నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జాబ్ క్యాలెండర్ ఇలా ఉండేది కాదు. క్యాలెండర్లో నోటిఫికేషన్ పేరు, నెల మాత్రమే ప్రకటించారు. పోస్టుల సంఖ్య చెప్పలేదు. జాబ్ క్యాలెండర్‌పై అసెంబ్లీలో చర్చకు ఎందుకు పెట్టలేదు. ఈ జాబ్ క్యాలెండర్‌ను నమ్మే పరిస్థితి లేదు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించాలి.
-సింధూరెడ్డి, నిరుద్యోగి