Telangana | హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : మద్యం బేసిక్ ధరలు పెంచాలన్న డిస్టిలరీలు, బ్రూవరీల డిమాండ్‌కు అనుగుణంగా నిర్ణయం తీసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. చీప్, మీడియం, ప్రీమియం లిక్కర్లకు క్యాటగిరీల వారీగా ప్రతి పెట్టెకు కనిష్ఠంగా రూ.50 నుంచి గరిష్ఠంగా రూ.150 వరకు అదనపు ధర చెల్లించాలని డిస్టిలరీలు అడుగుతున్నాయి. ఆ మేరకు ధరలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఇందుకోసం ఉత్తర తెలంగాణ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే, మద్యం వ్యాపారి రింగ్ లీడర్‌గా మారి చక్రం తిప్పుతున్నట్టు సమాచారం. దీంతో ఈ కాంగ్రెస్ ఎమ్మె ల్యేకు చెందిన లిక్కర్ కంపెనీ షేర్ల విలువ గత రెండు, మూడు రోజులుగా రూ.45 వరకు పెరిగినట్టు షేర్ మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ఈ ప్రచారానికి ఊతమిస్తూ.. సచివాలయంలో శనివారం జరిగిన ఎక్సైజ్‌శాఖ సమీక్షా సమావేశానికి సదరు ఎమ్మెల్యేను కూడా ఆహ్వానించటం, సీఎం, సీఎస్ ఆయనతోనే కూర్చొని మద్యం కంపెనీల డిమాండ్లు, ధరల పెంపు, సరఫరా మీద ప్రభుత్వ విధి విధానాలు చర్చించటం వివాదాస్పదమవుతున్నది. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావటంతో సోమవారం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే కంపెనీల్లో షేర్ల విలువ మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే ఆయనను ఏ హోదాలో సీఎం సమీక్షా సమావేశానికి ఆహ్వానించారో సీఎంవో ఇప్పటివరకు వెల్లడించలేదు.
డిస్టిలరీలు, బ్రూవరీల డిమాండ్లకు తలొగ్గేది లేదని రాష్ట్ర ప్రభుత్వం పైకి డాంభికాలు పలుకుతున్నప్పటికీ అంతర్గతంగా మాత్రం మద్యం ధరల పెంపునకే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. మద్యం ధరలు పెంచకపోతే రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు నడపలేమనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తున్నది. ధరలు నిర్ణయించటంలో రింగ్‌లీడర్‌గా వ్యవహరిస్తున్న మద్యం వ్యాపారి సూచనలు, సలహాలకు అనుగుణంగానే నడుచుకోవాలని సంబందిత శాఖ అధికారులకు మౌఖిక ఆదేశాలు అందినట్టు ఎక్సైజ్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం 2023లో క్వార్టర్ బాటిల్ మద్యంపై రూ.10 చొప్పున తగ్గించడం వల్ల రూ.800 కోట్ల లోటు వచ్చినట్టు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అంచనా వేస్తున్నది.
ఈ ఈ నేపథ్యంలో కేసీఆర్ తగ్గించిన రూ.10తోపాటు మరో రూ.10 కలిపి మొత్తం రూ.20 వరకు ధరలు పెంచే వెసులుబాటు ఉందని, దీని ద్వారా రూ.1600 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని ఎక్సైజ్ అధికారులు ఇటీవల ప్రతిపాదన చేసినట్టు తెలిసింది. బీరు బాటిల్ మీద కూడా మరో రూ.10 వరకూ ధర పెంచడం ద్వారా మరో రూ.300 కోట్ల ఆదాయం సమకూరుతుదని, మొత్తంగా అన్నీ కలిపి రూ.2000 కోట్ల నుంచి రూ.2,500 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు సీఎంకు నివేదిక సమర్పించినట్టు తెలిసింది. పొరుగు రాష్ర్టాల్లో లిక్కర్ ధరలు పరిశీలించి, అందుకు అనుగుణంగా తెలంగాణలో నిర్ణయించాలని సీఎం సూచించినట్టు సమాచారం. పొరుగు రాష్ట్రంలో ఇటీవల మద్యం ధరలను స్వల్పంగా తగ్గించారు. అయినప్పటికీ తెలంగాణ కంటే కనీసం 20 నుంచి 25 శాతం వరకు ఎక్కువగా ఉన్నాయి. తాజాగా అవే ధరలను తెలంగాణలో అమల్లోకి తేవడానికి ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం