సంగారెడ్డి, జనవరి 23(నమస్తే తెలంగాణ) : తన క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం కేసీఆర్ ఫొటో బరాబర్ ఉంటుందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. పదేండ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో సహకరించారని గుర్తుచేశారు. క్యాంపు కార్యాలయం తన నివాసమని, ఇక్కడ కేసీఆర్ ఫోటో పెట్టుకోవడంలో తప్పేమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యాలయంలో ప్రధాని, సీఎం, అంబేద్కర్ ఫోటోలు ఉన్నాయని స్పష్టంచేశారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. క్యాంపు కార్యాలయంలోకి అక్రమంగా ప్రవేశించి, ఫర్నీచర్, సామగ్రిని ధ్వంసం చేసిన కాటా వర్గంపై కాంగ్రెస్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
కార్యాలయంపై దాడిచేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కాటా శ్రీనివాస్‌గౌడ్‌ను ప్రజలు రెండుసార్లు ఛీకొట్టినా బుద్ధి రావటంలేదని విమర్శించారు. 23 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని.. సీఎం అంజయ్య మొదలు ఆరుగురు కాంగ్రెస్ సీఎంలను చూశానని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో అన్ని పార్టీల నాయకులు పాల్గొంటారని, అందులో తప్పు ఏముందని ప్రశ్నించారు. కాటాతోపాటు తనను వ్యతిరేకిస్తున్న చిల్లర నాయకులకు పరిజ్ఞానంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంపై దాడి సమయంలో తన మద్దతుదారులు ప్రతిఘటిస్తే పరిస్థితులు ఎలా ఉండేవని ప్రశ్నించారు. దాడుల సంస్కృతి మంచికాదని కాంగ్రెస్ నాయకులకు సూచించారు.
ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి బీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్‌కు నష్టం చేస్తున్నారంటూ పటాన్చెరులో జాతీయ రహదారిపై పార్టీ ఇన్చార్జి కాటా శ్రీనివాస్‌గౌడ్ వర్గానికి చెందిన నాయకులు బైఠాయించారు. మహిపాల్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి యత్నించి, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడిచేసి, సీఎం రేవంత్‌రెడ్డి ఫొటో పెట్టేందుకు ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్.. విప్ ఆది శ్రీనివాస్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు వినోద్‌రెడ్డి ఆధ్వర్యంలో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.