హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకులాల్లో పరిస్థితులు అధ్వానంగా మారాయని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. గురుకులాలపట్ల ప్రభుత్వ ఉదాసీనత వల్ల రెండు లక్షల మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యే దుస్థితి ఏర్పడిందని తెలిపారు. అసెంబ్లీలో మధ్యాహ్న భోజన విరామం తర్వాత మంత్రి సీతక్క గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై స్వల్పకాలిక చర్చను ప్రారంభించారు.
చర్చలో పాల్గొన్న గంగుల కమలాకర్ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్, కరెంట్ షాకులు, ఎలుక కాట్ల ఘటనలు, విద్యార్థుల మరణాలపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించి, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో భవానీ అనే విద్యార్థిని 15సార్లు ఎలుక కాటుకు గురికావడం, ఆసిఫాబాద్ జిల్లాలో అస్వస్థత కారణంగా శైలజ అనే విద్యార్థిని మృతి, నిమ్స్‌లో నీలావతి అనే విద్యార్థిని చికిత్స పొందుతుండటం, నిర్మల్ జిల్లాలో డయేరియాతో 60మంది విద్యార్థులకు అస్వస్థత వంటి ఘటనలను మంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించకపోవడం దారుణమని మండిపడ్డారు.
తాండూరు గురుకులంలో ఫుడ్‌పాయిజనింగ్‌తో అస్వస్థతకు గురైన విద్యార్ధులకు చికిత్స నడుస్తున్నదని, ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరారు. కుమ్రంభీం జిల్లా వాంకిడిలో విద్యార్థుల అస్వస్థత, ఓ విద్యార్థిని మృతికి చిప్స్ తినడమే కారణమని ప్రభుత్వం హైకోర్టులో చెప్పడం దారుణమని మండిపడ్డారు.
తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోనే గురుకులాల అభివృద్ధి జరిగిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో 2014 వర కు 19 బీసీ కురుకులాలు ఉండగా వాటి ని బీఆర్ఎస్ హయాంలో 294కు పెం చామని, అలాగే 261గా ఉన్న ఎస్సీ, ఎ స్టీ, మైనారిటి గురుకులాలను సంఖ్యను 1029కి పెంచామని వెల్లడించారు. గతంలో గురుకులాల్లో ఏటా 7,500 మంది విద్యార్థులు మాత్రమే చదువుకు నే వీలుండగా, బీఆర్ఎస్ హయాంలో గురుకులాలను పెంచడం వల్ల 2,11,000 మంది విద్యార్థులు చదువుకునే వీలు కలిగిందని చెప్పారు.
కాంగ్రె స్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త గా ఒక్క గురుకులాన్ని కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. గురుకులా ల పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన కమాం డ్ కంట్రోల్ సెంటర్‌ను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కాంస్య పతక విజేత నందినికి కోటి రూపాయల నగదు బహుమతి, 500గజాల ఇంటి స్థలం ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు.