హైదరాబాద్ జూన్ 23 (నమస్తేతెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తే బీజేపీ ఇజ్జత్ పోయేదన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఘాటుగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇచ్చిన పోలవరం డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోతే ఇజ్జత్ పోలేదా? అని ప్రశ్నించారు. బండికి కనీస అవగాహన లేదు.. ఇంగితజ్ఞానం అంతకన్నా లేదు అంటూ తూర్పారబట్టారు. సోమవారం తెలంగాణ భవన్లో మాజీ ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్‌తో కలిసి గంగుల విలేకరులతో మాట్లాడారు. కుంగిన మేడిగడ్డ పిల్లర్లను రిపేర్ చేస్తే సరిపోతుందని ఎన్డీఎస్ఏ చెప్పిన విషయాన్ని విస్మరించి తప్పుడు మాటలు మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. క్యాబినెట్ ఆమోదంతోపాటు అన్ని అనుమతులు ఉన్న కాళేశ్వరంపై సంజయ్ అనుమతులు లేవని, ఆ ప్రాజెక్టు నీళ్లతో పంటలు పండలేవని అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర మంత్రి హోదాలో వివరాలు తెప్పించుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌పై అవాకులు చవాకులు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు.
కాంగ్రెస్ సర్కారుకు బండి వత్తాసు..
తెలంగాణకు కల్పతరువులాంటి కాళేశ్వరంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే కమలాకర్ మండిపడ్డారు. లక్ష కోట్లు ఖర్చు కాని ప్రాజెక్టుకు లక్ష కోట్ల అవినీతి అంటూ అబద్ధాలు మాట్లాడుతున్నారంటూ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారుకు బండి వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. ఇంకా కేసీఆరే సీఎంగా ఉన్నారనే భ్రమలో ఆయనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బండి సంజయ్ వ్యాఖ్యలు వింటుంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీనా లేక బీజేపీనా అన్న అనుమానం కలుగుతున్నదని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగా తెలంగాణలో కూడా మోదీతో యోగాసనాలు వేయిస్తే సరిపోయేది కదా అని ఎద్దేవా చేశారు.
గోదావరి పరీవాహక ప్రాంతం కరీంనగర్‌లోనే ఎక్కువ ఉన్నదనే సోయి లేకుండా కాళేశ్వరంపై సొల్లు కబుర్లు చెప్పడం, చిల్లర మాటలు మాట్లాడటం బండికే చెల్లిందని చురకలంటించారు. తమ్మిడిహట్టి దగ్గర 165 టీఎంసీల నీటి లభ్యత ఉన్నదన్న సీడబ్ల్యూసీ నివేదికలో కొద్దిభాగం మాత్రమే చదివి వినిపించారని విమర్శించారు. ఆయన చూపిన పేపర్లోనే ఇతర రాష్ట్రాలకు 63 టీఎంసీలు కేటాయించామని, తెలంగాణ వాటా 44 టీఎంసీలు మాత్రమేనని ఉన్న విషయాన్ని విస్మరించారని ఆరోపించారు. ప్రాజెక్టుపై కనీస అవగాహనలేని బండి సంజయ్ అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని, రూ.38 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టు పనుల అంచనాలను రూ.1.24 లక్షల కోట్లకు పెంచారని చెప్పడం ఆక్షేపణీయమని అన్నారు.
అన్నీ ఆలోచించే మేడిగడ్డకు..
తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం సాధ్యంకాదని, అన్నీ ఆలోచించి, నిపుణులతో చర్చించిన తరువాతనే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్టింగ్ పాయింట్‌ను మేడిగడ్డకు మార్చారని గంగుల గుర్తుచేశారు. కేవలం రూ.96 వేల కోట్లు వెచ్చించి మూడేండ్లలో బృహత్తర ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చి తెలంగాణను సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని ప్రశంసించారు. గతంలోఎంపీగా ఉన్న రేవంత్‌రెడ్డి పార్లమెంట్లో.. కాళేశ్వరంలో అవినీతి జరిగిందా? జరిగితే ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని బీజేపీ సర్కారును ప్రశ్నించగా.. కేంద్ర మంత్రే అవినీతి జరగలేదనే సమాధానం చెప్పిన విషయాన్ని గంగుల గుర్తుచేశారు. కానీ ఇందుకు విరుద్ధంగా సంజయ్ మాట్లాడటంలోని అంతర్యమేమిటని, సీఎం రేవంత్ సూచనల మేరకే నడుచుకుంటున్నారా? సమాధానం చెప్పాలని ప్రశ్నల వర్షం కురిపించారు.
ఈటలతో ఉన్న పేచీతోనే అనుచిత వ్యాఖ్యలు: దాసోజు శ్రవణ్
సొంత పార్టీకి చెందిన ఎంపీ ఈటల రాజేందర్‌తో ఉన్న పేచీ కారణంగానే బండి సంజయ్ కాళేశ్వరంపై ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ ఆరోపించారు. బీజేపీ నేతలందరూ సంకల్పసభ పెట్టుకొంటే హాజరుకాకుండా ముఖంచాటేసిన ఆయన కాళేశ్వరాన్ని తెరపైకి తెచ్చారని దుయ్యబట్టారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇస్తే పరువు పోయేదని సంజయ్ మాట్లాడటం విడ్డూరమన్నారు. ఈటలతో విబేధాలుంటే ఇద్దరు గల్లాలు పట్టుకొని కొట్టుకోవాలని, కానీ కేసీఆర్‌పై ఏడుపెందుకని ప్రశ్నించారు.
రేవంత్ స్క్రిప్ట్‌ను చదువుతున్నారు: ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
కేంద్రమంత్రి బండి సంజయ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు అండగా ఉంటూ కేసీఆర్‌ను బద్నాం చేస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ విమర్శించారు. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ రిపోర్టును వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఆయన సీఎం రేవంత్ రాసిచ్చిన స్క్రిఫ్ట్‌ను చదువుతూ బీఆర్ఎస్పై నిందేలేస్తున్నారని ఆక్షేపించారు. బండికి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలను ప్రశ్నించాలని, ఆరు గ్యారెంటీల హామీలను అమలు చేయాలని అడగాలని డిమాండ్ చేశారు. అంతేగానీ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్పై విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.
ఎస్ఎల్బీసీ, సుంకిశాల ఘటనలపై విచారణేది?
కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో సుంకిశాల దెబ్బతిన్నది.. ఎస్ఎల్బీసీ కుప్పకూలింది.. వట్టెం మునిగిపోయింది.. పెద్దవాగు కొట్టుకుపోయింది.. ఇన్ని దుర్ఘటనలు జరిగినా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదని గంగుల ప్రశ్నించారు. నాడు మేడిగడ్డ ఘటనపై ఆగమేఘాల మీద ఎన్డీఎస్ఏను పంపించిన మోదీ.. ఇప్పుడు ఎందుకు మిన్నకుంటున్నారు.. రేవంత్‌తో ఉన్న పవిత్రబంధమే ఇందుకు అడ్డొచ్చిందా అంటూ ఎద్దేవా చేశారు. ఇద్దరి మధ్య ఒప్పందంలో భాగంగానే విచారణ జరిపించడం లేదని ఆరోపించారు.
ద్వేషంతోనే కేసీఆర్‌పై విమర్శలు: వినోద్
బండి సంజయ్ కేంద్ర మంత్రిలా కాకుండా సాధారణ కార్యకర్త మాదిరిగా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ దుయ్యబట్టారు. కేసీఆర్‌ను తిట్టేందుకే పుట్టినట్టు.. ద్వేషంతో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్టు మొదలుపెట్టకముందే ప్రాణహిత అంచనావ్యయాన్ని రూ.40 వేల కోట్లకు పెంచిన కాంగ్రెస్‌ను వదిలిపెట్టి కేసీఆర్‌ను బద్నాం చేయడం బాధాకరమన్నారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, సంజయ్‌కి చిత్తశుద్ధి ఉంటే తమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం, మహారాష్ట్రను ఒప్పించాలి.. ప్రాజెక్టుకు జా తీయ హోదా ఇప్పించాలి అని డిమాండ్ చేశారు. కేసీఆర్ మూడేండ్లలో కాళేశ్వరాన్ని కట్టి చూపారని, దమ్ముంటే కేంద్ర మంత్రులు తమ్మిడిహట్టికి అనుమతులు సాధించాలని సవాల్ విసిరారు. గతంలో మిడ్‌మానేరు కొట్టుకుపోతే కేసీఆర్ ఎవరినీ నిందించకుండా రిపేర్ చేయించారని గుర్తుచేశారు.