కరీంనగర్ రూరల్, నవంబర్ 4 : ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం మొద్దునిద్ర పోతుండటంతో రైతులకు నష్టం వాటిల్లుతున్నదని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కరీంనగర్ మండలం దుర్శేడ్, మొగ్దుంపూర్, చామనపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకువచ్చి నెల రోజులవుతున్నా కొనడం లేదని మండిపడ్డారు. రైస్ మిల్లుల అలాట్ మెంట్ లేక ధాన్యం కొనుగోలు చేయడం లేదని అధికారులు రైతులకు చెబుతున్నారని, ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రారంభమైన కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేవని, ఇప్పటి వరకు గన్నీ బ్యాగుల అలాట్మెంట్ లేదని ఆరోపించారు. గతంలో ధాన్యం కొనుగోలుపై తాము రెండు నెలల ముందే ప్రణాళిక వేసుకుని, సెంటర్ ప్రారంభంతోనే ధాన్యం కొనేందుకు సిద్ధంగా ఉండేవారిమని గుర్తుచేశారు. ప్రస్తుత సర్కారు ముందస్తు ప్రణాళిక చేయలేక ధాన్యం కొనుగోలు చేయడం లేదని విమర్శించారు. రైతులు చేసేదేమీ లేక దళారులను ఆశ్రయించి నష్టపోతున్నారని తెలిపారు. ఇప్పటికైనా కేంద్రాల్లో సకల సౌకర్యాలతో ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని, రైతులకు మద్దతు ధర అందించాలని, దళారీ వ్యవస్థను నిర్మూలించాలని డిమాండ్ చేశారు.