కరీంనగర్ రూరల్, జూన్ 3: ‘రాష్ట్ర మంత్రులు ఉత్తమ్, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే తెలియడం లేదు. రోడ్లు భవనాల శాఖ మంత్రి వ్యవసాయం గురించి మాట్లాడుతున్నాడు. ఇంకో మంత్రి మరో శాఖ గురించి వివరాలు చెప్తున్నడు. వారి శాఖలు ఏంటో కూడా వారికి తెలువకుండా పోయింది’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎద్దేవా చేశారు. సోమవారం కరీంనగర్‌లోని కేసీఆర్ భవన్లో రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో మంత్రుల వ్యవస్థ అదుపు తప్పిందని, వాళ్లను నియంత్రిస్తే ఎక్కడ తనపై అసమ్మతి తెస్తారో? అని సీఎం రేవంత్‌రెడ్డి భయపడిపోతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఆరు నెలల పాలనలో రాష్ట్రం ఆగమైపోయిందని, మళ్లీ 1956 నాటి పరిస్థితులను తీసుకువస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు, రైతులకు ప్రభుత్వంపై నమ్మకం పోయిందని, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉందని, వారి పిల్లల భవిష్యత్‌ను ప్రశ్నార్థకం కానివ్వమని స్పష్టం చేశారు.