హైదరాబాద్: రాష్ట్రంలోని పేద విద్యార్థుల విద్యాదాత ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అని ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ (MLA Gadari Kishore) అన్నారు. గురుకులాల (Gurukula schools) ఏర్పాటుతో పేదలకు నాణ్యమైన విద్యను చేరువ చేసిన ఘనత సీఎం కేసీఆర్ సొంతమని చెప్పారు. స్వరాష్ట్రంలో విద్యారంగం విశేష అభివృద్ధి సాధించిందని తెలిపారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా విద్యారంగంపై జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఎమ్మెల్యే కిషోర్ మాట్లాడారు. గురుకులాల ఏర్పాటు ఒక విప్లవాత్మకమైన చర్యగా అభివర్ణించారు. గురుకులాల ఏర్పాటుకు ముందు జరిగిన ఘటనను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.
తాము 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ను కలిసి కోరినట్లు తెలిపారు. అయితే దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్..‘ఇప్పటికే దేశంలో అంబేద్కర్ విగ్రహాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం పెడితే అందులో ఒకటిగా ఉంటుంది. అంబేద్కర్ స్థాయికి ఇది సరిపోదు. 125 అడుగుల విగ్రహం ఏర్పాటుతో పాటు ఆయన ఆశయాన్ని నిరవేర్చేలా ఏదైనా మంచి కార్యక్రమం చేద్దాం’ అని తమకు చెప్పినట్లు తెలిపారు. ఆ తర్వాతి రోజే 125 గురుకులాలను ఏర్పాటు చేస్తూ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని, తద్వారా అంబేద్కర్ ఆశయాన్ని నెరవేర్చుతూ పేద పిల్లలకు నాణ్యమైన విద్యను చేరువ చేసే గొప్ప కార్యక్రమానికి నాంది పాలికారని అన్నారు. అప్పుడు ప్రారంభమైన గురుకులాల ఏర్పాటు ప్రస్తుతం 1002 కొత్త గురుకులాలతో ముందుకు సాగుతుందన్నారు. ఇక ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేసేందుకు రూ.7892 కోట్లతో మన ఊరు-మన బడి కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయమని చెప్పారు. ఈ పథకంతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుతున్నాయని తెలిపారు.
పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా వారి ఆరోగ్యంపైనా సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగానే ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతున్నప్పటికీ విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం, రాగి జావ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ‘మనకు పైసలు ముఖ్యం కాదు.. పిల్లల ఆరోగ్యం, భవిష్యత్ ముఖ్యం’ అంటూ సీఎం కేసీఆర్ చెప్పిన మాటల్ని ఆయన గుర్తు చేశారు. ఇక పాలిటెక్నిక్, ఇంటర్, డిగ్రీలోని కాంట్రాక్ట్ లెక్చరర్స్‌ను రెగ్యులరైజ్ చేసి విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు వారి జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియా 27.3 నుంచి 36.2కు పెరిగిందని, ఇదే తెలంగాణ రాష్ట్ర విద్యారంగ అభివృద్ధికి సూచిక అని స్పష్టం చేశారు.