జగిత్యాల, జూన్ 25, (నమస్తే తెలంగాణ): ‘సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రివర్గంలోని ఎవరికీ బనకచర్ల ప్రాజెక్టుపై కనీస అవగాహన లేదు.. కనీసం ఆప్రాంతం ఎక్కడ ఉన్నదో కూడా వారికి తెలియదు’ అని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల విమర్శించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీమంత్రి హరీశ్‌రావు చెప్పేవరకు బనకచర్లతో ప్రమాదమేందో కాంగ్రెస్ నాయకులకు తెలియనే లేదని, సీఎం సలహాదారైన ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్‌దాస్‌కు సైతం అవగాహనే లేదని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి చెప్పే ఏ విషయంలో సబ్జెక్టు, ఆబ్జెక్టు ఉండటం లేదని ధ్వజమెత్తారు. నీళ్ల దేవుడుగా పేరుగాంచిన కేసీఆర్‌ను గోదావరి, కృష్ణా నదులపై సీఎం రేవంత్‌రెడ్డి చర్చకు రమ్మనడం హాస్యాస్పదంగా ఉన్నదని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి తన గురువైన ఏపీ సీఎం చంద్రబాబుకు గోదావరి నీళ్లను గురుదక్షిణగా సమర్పిస్తున్నందుకే రాష్ట్రంలో సంబురాలు చేస్తున్నట్టుగా కనిపిస్తున్నదని ధ్వజమెత్తారు. కేసీఆర్ తెలంగాణ రైతాంగానికి మేలు చేయాలన్న ఉద్దేశంతో రైతుబంధు పథకాన్ని నాట్లకు నాట్లకు మధ్య 11 సార్లు వేశారని, సీఎం రేవంత్‌రెడ్డి స్థానిక సంస్థల్లో లబ్ధిపొందాలన్న ఉద్దేశంతో ఓట్లకు, ఓట్లకు మధ్య అన్నట్టుగా రైతు భరోసాను వేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసం త, బీఆర్ఎస్ నాయకులు మారు గంగారెడ్డి, దారిశెట్టి రాజేశ్ పాల్గొన్నారు.
రేవంత్‌లాగే బీజేపీ ఎంపీల వైఖరి
సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహారశైలి లాగే బీజేపీ ఎంపీల వ్యవహారశైలి ఉందన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తమ్మిడిహట్టి గురించి మాట్లాడుతున్నారని, మహారాష్ట్రలోను, కేంద్రంలోను బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉందని, వారిని ఒప్పించి, తమ్మిడిహట్టి వద్ద 152 అడుగుల వద్ద ప్రాజెక్టును నిర్మింపజేసేందుకు అనుమతులు తీసుకొస్తే స్వాగతిస్తామని చెప్పారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ బూతుల రాజాగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ సెగ్మెంట్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని ఎందుకు తీసుకు రాలేదని ప్రశ్నించారు.