హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): రేవంత్‌రెడ్డీ.. రాష్ర్టానికి ముఖ్యమంత్రివా? లేక వీధి రౌడీవా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి నిలదీశారు. పదేండ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి తెలంగాణను అగ్రస్థానంలో నిలబెట్టిన కేసీఆర్‌పై ఏమిటా బజారు భాష? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ప్రజలకు రోల్‌మాడల్‌గా ఉం డాలని, సంసారవంతమైన భాష మాట్లాడాలని హితవు పలికారు. మూసీ అభివృద్ధి పేరుతో నిర్వాసితులకు నష్టం జరుగొద్దని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నదని గుర్తుచేశారు. తెలంగాణభవన్‌లో శనివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, నేతలు గోపగాని రఘురాం, కడారి స్వామితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మూసీ ప్రక్షాళన ప్రారంభించిందే బీఆర్ఎస్ అని, దానిని తాము అడ్డుకుంటున్నట్టు రేవంత్‌రెడ్డి ఆరోపించడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
మూసీ అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా తనను నియమించి కేసీఆర్ మూసీ అభివృద్ధికి శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. ‘మూసీ ప్రక్షాళన చేయాలనే చిత్తశుద్ధి అసలు మీకు ఉన్నదా? కేవలం ప్రతిపక్షాలను బెదిరించాలనుకుంటున్నారా? పండబెట్టి తొక్కుతా.. వంగబెట్టి గుద్దుతా.. పేగులు మెడలో వేసుకుంటా.. ఏందీ భాష అని నిలదీశారు. సీఎం స్థాయిలో ఉండి జుగుప్సాకర భాష మాట్లాడటంపై ప్రజలు చింతిస్తున్నట్టు తెలిపారు. మూసీ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసినందుకు ‘బుల్డోజర్లతో తొక్కిస్తా.. ముక్కలుగా నరికేస్తా.. కుక్కచావు చస్తవు..’ అంటూ నీచమైన భాష మాట్లాడడంపై మండిపడ్డారు. మూసీ ప్రక్షాళనకు బీఆర్ఎస్ రూ.4వేల కోట్లతో ఎస్టీపీల నిర్మాణం చేపట్టిందని, దాదాపు ఎనిమిదింటి నిర్మాణం పూర్తయిందని గుర్తుచేశారు.
నల్లగొండ, హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల ప్రజల మధ్య రేవంత్‌రెడ్డి చిచ్చుపెడుతున్నారని సుధీర్‌రెడ్డి మండిపడ్డారు. నల్లగొండ జిల్లా రైతులను సీఎం రెచ్చగొడుతున్నారని విమర్శించారు. అర్ధరాత్రి పోలీసులను పంపి ఇండ్లను ఖాళీ చేయాలని ప్రభుత్వం మూసీ బాధిత పేదలపై ఒత్తిడి తెస్తున్నదని ఆరోపించారు. మూసీ ఒడ్డున ఉన్నవాళ్లు బిక్కుబిక్కుమంటూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మూసీ నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్యాకేజీ అమలుచేయాలని డిమాండ్ చేశారు. డీపీఆర్, టెండర్లు లేకుండా లక్షన్నర కోట్ల ఖర్చు అవుతుందని సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు చెప్పారని విమర్శించారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల్లో ఎన్ని అమలు చేసిందో ప్రజలకు తెలుసు.. రుణమాఫీ ఎంతమందికి అయిందో తెలుసు.. రేవంత్‌రెడ్డికి దమ్ముంటే నల్లగొండలో కాదు హైదరాబాద్‌లో పాదయాత్ర చేయాలని సవాల్ విసిరారు.