హైదరాబాద్ : హుజూరాబాద్‌లో దళితుల చేత బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కాళ్లు కడిగించుకోవడంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నగరంలోని బంజారాహిల్స్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దళితులకు అండగా నిలబడేందుకు సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెడితే ఈటల రాజేందర్‌తో పాటు ఆయన పార్టీ నేతలు అడ్డుకునే కుట్రలు చేస్తున్నారన్నారు. ఏం సాధించారని కాళ్ళు కడిగించుకుంటున్నవని ప్రశ్నించారు. ఒకవైపు ఈటల బామ్మర్ది దళితులను కించపరుస్తూ మాట్లాడతాడు.. మరోవైపు దళిత బంధుని అడ్డుకునేందుకు ఈటల కుట్రలు చేస్తారు. ఇదేనా మీ దళిత ప్రేమ. దళితులతో కళ్ళు కడిగించుకోవడం సిగ్గు చేటు అన్నారు.
వెంటనె తెలంగాణ ప్రజలకు, దళితులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. దళిత బంధు కేవలం హుజురాబాద్ నియోజక వర్గానికే కాదు. రాష్ట్రం మెత్తంలోని దళితుల అభివృద్ధి కోసం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా దాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు దిగజారుడు కుట్రలు చేయడం అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. కుట్రలను ఛేదించి అభివృద్ధి సాధించడం సీఎం కేసీఆర్‌కు అలవాటేనని దానం పేర్కొన్నారు.