హైదరాబాద్ సిటీబ్యూరో/హిమాయత్‌నగర్, ఆగస్టు 13: హైదరాబాద్ విపత్తు ఉపశమనం, ఆస్తుల పరిరక్షణ సంస్థ (హైడ్రా) కమిషనర్ రంగనాథ్‌కు హైదరాబాద్‌పై ముఖ్యమంత్రి పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) రాసివ్వలేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. హైదరాబాద్‌లో తన ఇష్టం వచ్చిన రీతిలో కమిషనర్ రంగనాథ్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అధికారులు హద్దుమీరి ప్రవరిస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 10న నందగిరి హిల్స్, గురుబ్రహ్మనగర్లోని పార్కు ప్రహరి గోడను కూల్చివేసిన ఘటనలో దానం నాగేందర్ ప్రమేయంపై జీహెచ్ఎంసీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఈ నెల 12న కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో మంగళవారం హైదర్‌గూడ, అవంతినగర్‌లో దానం నాగేందర్ మీడియాతో మాట్లాడారు. కమిషనర్ రంగనాథ్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో సభాహక్కుల నోటీసు ఇస్తానని చెప్పారు. రంగనాథ్‌కు తన ఉద్యోగం నచ్చకనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారేమోనని వ్యాఖ్యానించారు. పార్కు వద్ద కొందరు ప్రైవేట్ వ్యక్తులు గోడ నిర్మించారని స్థానికులు ఆవేశంతో తన ప్రమేయం లేకుండా ఆ గోడను కూల్చివేసిన మాట వాస్తమేనని, దీనికి అధికారులు హద్దు మీరి పనిచేయడం సబబు కాదని అన్నారు. ఆ ప్రదేశంలో గుడిసెలుండొద్దు, ఎస్సీలు, ఎస్టీలు ఉండొద్దు అనే హక్కు రంగనాథ్‌కు లేదని చెప్పారు. ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా ఆయన వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
ఇలా మొదలైంది!
గ్రేటర్ హైదరాబాద్‌లో ఆక్రమణలపై చర్యలకు దిగిన హైడ్రా.. ఐదు రోజుల క్రితం జూబ్లీహిల్స్ రోడ్ నం. 52లోని నందగిరిహిల్స్ హుడా లే అవుట్‌లోని ఖాళీ స్థలంలో వెలిసిన అక్రమ నిర్మాణాలు, డబ్బాలను కూల్చివేసింది. కమిషనర్ రంగనాథ్ దగ్గరుండి అక్రమ నిర్మాణాలను కూల్చివేయించారు. భవిష్యత్తులో ఈ స్థలం ఎలాంటి అక్రమణలకు గురి కాకుండా వెంటనే స్థానిక కాలనీ వాసుల సహకారంతో ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టారు. విధి నిర్వహణలో ఎవరు అడ్డొచ్చినా డోంట్ కేర్ అంటూ శాశ్వత చర్య దిశగా రంగనాథ్ రాత్రికి రాత్రే ప్రహరీ గోడ నిర్మాణాన్ని పూర్తి చేశారు. దీంతో రంగనాథ్ తీరుపై దానం నాగేందర్ భగ్గుమన్నారు. ఈ నెల 10న అక్కడి బస్తీవాసులు ఆ ప్రహరీగోడను కూల్చివేశారు. దానం ప్రోత్సాహంతోనే గోడను కూల్చివేశారని ఆరోపిస్తూ హైడ్రా ఎన్ఫోర్స్మెంట్ ఇన్‌ఛార్జి వీ పాపయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై జూబ్లీహిల్స్ పోలీసులు పీడీపీపీ యాక్ట్ కింద దానం, మరికొందరిపై కేసు నమోదుచేశారు.