Challa Dharmareddy | హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): కొండా దంపతులు నోరు అదుపులో పెట్టుకోవాలని.. లేదంటే ప్రజలే వారిని ఉరికించి కొడతారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హెచ్చరించారు. మాజీ మంత్రిగా, మాజీ ఎమ్మెల్సీగా వ్యవహరించిన కొండా సురేఖ, కొండా మురళి దంపతులు వాడుతున్న భాష దుర్మార్గంగా ఉన్నదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కాలిగోటికి కూడా కొండా మురళి సరిపోరని స్పష్టం చేశారు. సోమవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కొండా దంపతుల తీరుపై ఫైర్ అయ్యారు. రాజకీయాల్లో విధానపరమైన విమర్శలు ఎవరైనా చేయవచ్చని, వ్యక్తిగత విమర్శలు చేయకూడదనే కనీస ఇంగితాన్ని కొండా దంపతులు కోల్పోయారని దుయ్యబట్టారు.
కొండా దంపతులకు రాజకీయ పునర్జన్మను ఇచ్చిన సీఎం కేసీఆర్‌పై నోరుపారేసుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మంత్రిగా కొండా సురేఖ తెలంగాణ ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. గూండాగిరి చేసి రాజకీయ పబ్బం గడపటం మినహా వరంగల్ జిల్లాకు కొండా మురళి, సురేఖ ఏం చేశారని నిలదీశారు. మగతనం ఉండాలంటే మీసాలు ఉండాలా అని ఆయన ప్రశ్నించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై కొండా మురళి చేసిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ ప్రజలు ఉరికించి కొడతారని హెచ్చరించారు. కొండా దంపతులకు దమ్ముంటే పరకాలకు వచ్చి తనపై పోటీచేసి గెలవాలని సవాల్ విసిరారు. కొండా మురళి కంటే తమకు పదునైనా పల్లె భాష వచ్చని అయితే తమకు సంస్కారం అడ్డువచ్చి వాడటం లేదని చెప్పారు.
ప్రజల టీం బీఆర్ఎస్
బీఆర్ఎస్ ప్రజల టీం అని ఎమ్మెల్యే ధర్మారెడ్డి స్పష్టం చేశారు. దేశ ప్రజల జీవితాలు బాగుపడాలని సీఎం కేసీఆర్ తపిస్తున్నారని తెలిపారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ విస్తరిస్తున్న కారణంగానే అక్కడి రాజకీయ పార్టీల నేతల్లో కలవరం మొదలైందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఎన్సీపీ నేత శరద్ పవార్ బీర్ఎస్పై ఆరోపణలు చేశారని వెల్లడించారు. బీఆర్ఎస్ ఏ పార్టీకి బీ-టీంగా ఉండదని, ప్రజల టీంగా ఉంటుందని తెలిపారు.