హైదరాబాద్, డిసెంబర్19 ( నమస్తే తెలంగాణ) : తన కష్టార్జితంతో 2000 సంవత్సరానికి ముందుగానే కుత్బుల్లాపూర్ మండలంలో భూములు కొనుగోలు చేశామని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తెలిపారు. ఈ మేరకు ‘సీలింగ్ భూమి.. సమర్పయామి’ శీర్షికతో గురువారం ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనంపై ఆయన స్పందించారు. తన కుటుంబసభ్యుల పేరు మీద 4 ఎకరాలు, ఇతరుల పేర్ల మీద 7 ఎకరాల చొప్పున మొత్తం 11 ఎకరాలు క్లియర్టైటిల్ ఉన్న భూమిని కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇటువంటి అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అయితే, 2014వ సంవత్సరంలో తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో అరికెపూడి గాంధీ శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి నామినేషన్ పత్రాలు సమర్పించారు.
ఈ పత్రాల్లో స్పౌజ్‌తోపాటు ముగ్గురు డిపెండెంట్లు ఉన్నట్టు వెల్లడించారు. ప్రతి డిపెండెంట్ పేరు మీద గాజులరామారంలోని సర్వే నంబర్ 307లో 2 ఎకరాల చొప్పున 19/7/2006లో భూమి కొనుగోలు చేసినట్టు పొందుపరిచారు. ఈ లెక్కన ఆయన కుటుంబసభ్యుల పేర్ల మీద 6 ఎకరాల భూమి నమోదై ఉండాలి. తన భార్య పేరు మీద ఈ సర్వే నంబర్లో ఎలాంటి భూమి ఉన్నట్టు చూపించలేదు. అయితే, గురువారం ఆయన ఇచ్చిన వివరణలో కుటుంబసభ్యుల పేరు మీద నాలుగు ఎకరాలు కొనుగోలు చేసినట్టు పేర్కొన్న గాంధీ.. ఎన్నికల అఫిడవిట్లో 6 ఎకరాలు తన కుటుంబసభ్యుల మీద ఎలా చూపించారనేది అంతు చిక్కని ప్రశ్న. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికలకు సమర్పించిన నామినేషన్ పత్రంలో మాత్రం తన భార్య శ్యామలాదేవి పేరిట 2 ఎకరాలు ఉన్నట్టు, ఈ భూమిని సరిగ్గా అదే తేదీ 19/7/2006న ప్రణీతతో కలిసి కొనుగోలు చేసినట్టు చూపించారు.
2000 సంవత్సరం కంటే ముందే భూములు కొనుగోలు చేసి ఉంటే, 2006 వరకు ఆయా భూములను ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు? రెవిన్యూ అధికారుల గురువారం ఇచ్చిన వివరణలో.. హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి 2006 సేల్డీడ్లను 2010లో మ్యుటేషన్ చేసినట్టు తెలిపారు. నిజంగా ఎమ్మెల్యే గాంధీ క్లియర్ టైటిల్‌నే కొనుగోలు చేసినప్పుడు కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఏమిటి?
2010లోనే మ్యుటేషన్ అయిన తన భూమి కనబడటం లేదని, కనపడని సర్వే నంబర్లను ఇంక్లూడ్ చేయాలని 2022లో అంటే దాదాపు 12 ఏండ్ల తరువాత ఎందుకు దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చింది?
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌కు చేసుకున్న దరఖాస్తులో క్రమసంఖ్య1లో సేల్‌డీడ్ నంబర్ 16818/2006, కొనుగోలు తేదీ19/7/2006 ప్రకారం తన భార్య పేరు మీద 2 ఎకరాల స్థలం ఉన్నట్టు పేర్కొన్నారు. తిరిగి క్రమ సంఖ్య 9లో సరిగ్గా ఇదే డాక్యుమెంట్ నంబర్ మీద ప్రవీణ్‌కుమార్ పేరుపై 2 ఎకరాలు ఉన్నట్టు సూచించారు. కనీసం ఈ తప్పును కూడా పరిశీలించకుండా జిల్లా కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఇవ్వటం గమనార్హం. నిజానికి అంతా క్లియర్‌గా ఉన్నప్పుడు ఏడాదికోసారి పేర్లు ఎందుకు మారుతున్నట్టు?
కాగా గాజుల రామారం గ్రామం సర్వే నంబర్ 307లోని 12 ఎకరాల సీలింగ్భూమి పట్టాభూమిగా మారిందని, ఎమ్మెల్యే గాంధీ కుటుంబసభ్యుల పేరిట మారిందంటూ ‘సీలింగ్ భూమి.. సమర్పయామి’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమైన నేపథ్యంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ రివ్యూ సమావేశం నిర్వహించినట్టు తెలిసింది. సేల్‌డీడ్ 2006ను హైకోర్టు తీర్పు ప్రకారం 2010లో మ్యుటేషన్ చేసినట్టు, మిస్సింగ్ సర్వే నంబర్ పేరిట 2022లో పాస్‌పుస్తకాలు జారీ చేసినట్టు, ఈ ఏడాది డిసెంబర్లో నాలా కన్వర్షన్ చేసినట్టు సంబంధింత అధికారులు కలెక్టర్‌కు నివేదించారని తెలిసింది. సర్వే నంబర్ 307లో 238 ఎకరాలు గతంలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు లీజుకు ఇచ్చారని, ఎస్ఎఫ్సీకి కేటాయించిన 238 ఎకరాలు క్లియర్‌గా ఉంటే మిగిలిన వివాదాలతో తమకు సంబంధం లేదని కలెక్టర్‌కు వివరణ ఇచ్చినట్టు సమాచారం. సమావేశంలో రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్‌ను తప్పుదారి పట్టించినట్టు తెలుస్తున్నది.
రాష్ట్రంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చాక గాజుల రామారంలోని సర్వే నంబర్ 307 మీద 1977 జనవరి 11న ఒకసారి, 1977 ఫిబ్రవరి 12న రెండోసారి, 1977 ఫిబ్రవరి 23న మూడోసారి అప్పటి జిల్లా కలెకర్టర్ మొత్తం మూడుసార్లు నోటిఫికేషన్ ఇచ్చి 317.6 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసున్నది. అప్పటినుంచి రెవెన్యూ రికార్డుల్లో ఈ భూమిని ఖరీజ్ ఖాతాగా చూపిస్తున్నారు. ఇందులోంచి 2007లో 238 ఎకరాలు ఎస్ఎఫ్సీకి 99 ఏండ్లుకు లీజుకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అది పోగా 79 ఎకరాలకు ఎవరు బాధ్యులు? ప్రభుత్వం కాదా? కేవలం 238 ఎకరాలు ఉంటే చాలు అనుకంటే మిగిలిన ప్రభుత్వ భూమిని ఎవరికి ధారాదత్తం చేయాలనుకుంటున్నారు? స్టోన్‌క్రషర్లకు భూములు లీజుకు ఇచ్చినట్టు రెవెన్యూ రికార్డుల్లో ఉన్నది. ఎమ్మెల్యే కుటుంబసభ్యులు చేస్తున్న దరఖాస్తులో సూపర్మెటల్ ఇండస్ట్రీ లీజ్ తీసుకొని నడిపినట్టు పేర్కొన్నారు. లీజ్ భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు, విచారణ చేయకుండా కోర్టు ఆదేశమంటూ గుట్టుచప్పుడు కాకుండా మ్యుటేషన్ చేయడం వెనుక ఎవరి ఒత్తిడి ఉన్నది? గాజులరామారం రెవెన్యూ రికార్డు- 1999 ప్రకారం సర్వే నంబర్ 307 ‘ఖరీజ్ ఖాతా’ అంటే సీలింగ్ మిగులు అని ఉన్నది. ఈ భూమి ఎటు పోయిందో తేల్చకుండా కేవలం 238 ఎకరాలు ఉంటే చాలనుకోవడం వెనుక మర్మమేమిటేనని స్థానికులు చర్చించుకుంటున్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఔటర్ రింగ్‌రోడ్డు లీజు ఒ ప్పందంపై విచారణకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్)ను ఏర్పాటు చేస్తున్న ట్టు ప్రకటించారు. ఈ మేరకు గురువా రం శాసనసభలో ప్రకటన చేశారు. విచా రణకు అనుమతి ఇవ్వాల్సిందిగా స్పీకర్‌ను కోరారు. మంత్రివర్గంలో చర్చించి విధివిధానాలు నిర్ణయిస్తామని తెలిపా రు. ఓఆర్ఆర్ లీజు ఒప్పందంలో బీఆర్ఎస్ నేతలకు అయాచిత లబ్ధి జరిగిందని, ఓడిపోతామని తెలిసే ఎన్నికల ముందు లీజు ఇచ్చారని ఆరోపించారు.