PAC Chairman | హైదరాబాద్, సెప్టెంబర్ 9(నమస్తే తెలంగాణ): ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్ పదవిని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి కట్టబెట్టడం తీవ్ర వివాదాస్పదమైంది. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని, గతంలో ఎన్నడూలేనివిధంగా సభా సంప్రదాయాలు, సభా మర్యాదలు, సభా నియమావళిని పట్టించుకోకుండా అరికెపూడి గాంధీని పీఏసీ చైర్మన్‌గా నియమించిందని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది. శాసనసభ నియమాల పట్ల అవగాహన ఉన్నవారు, రాజ్యాంగ నిపుణులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్ర శాసనసభలో మూడు కమిటీలు ఆర్థికపరమైన అంశాలకు సంబంధించినవి ఉంటాయి. వీటిలో ప్రధానమైనది ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ). దీనికి తొమ్మిది మంది సభ్యులను శాసనసభ ఎన్నుకుంటుంది. పార్టీలకు ఉండే బలాబలాలను బట్టి పీఏసీలో స్థానాలు దక్కుతాయి.
చైర్మన్ పదవిని ప్రధాన ప్రతిపక్షానికి ఇస్తారు. ఇది శాసనసభ నియమావళిలోనే ఉంటుంది. అయితే, శాసనసభ నియమావళిని, పార్లమెంటరీ వ్యవస్థ స్ఫూర్తిని దెబ్బతీసేలా తొలిసారి అధికార పార్టీలో చేరిన ప్రతిపక్ష ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారు. ఇలా చేయడం బహుశా దేశంలోనే తొలిసారి. పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కని సందర్భంలో కూడా పీఏసీ చైర్మన్ పదవిని ప్రతిపక్షంలో అతిపెద్ద పార్టీగా గుర్తించి ఆ పార్టీ నామినేట్ చేసినవారికి ఇచ్చారు. కానీ, మన రాష్ట్రంలో మాత్రం ప్రతిపక్ష హోదా ఉండి, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీ సిఫార్సు చేసిన, పార్టీ తరఫున నామినేషన్ వేసిన వ్యక్తిని కాదని అధికార పార్టీలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే వివిధ కార్యక్రమాలు, పథకాల అమలు సహా వివిధ అంశాలను పర్యవేక్షించేందుకు, వాటిపై సమీక్షలు చేసేందుకు శాసనసభలోని ఎమ్మెల్యేలతో కమిటీలను ఏర్పాటుచేస్తారు. ఇలా మొత్తం 18 శాసనసభ కమిటీలు ఏర్పాటవుతాయి. ఒక్కో కమిటీలో 13 మంది సభ్యులుంటారు. వీరిలో తొమ్మిది మందిని శాసనసభ నుంచి, నలుగురిని శాసనమండలి నుంచి ఎన్నుకుంటారు. ప్రతి కమిటీలో పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం కల్పించాలి.
శాసనసభలోని సభ్యుల సంఖ్య ఆధారంగా ఆయా పార్టీలకు కమిటీల్లో ప్రాతినిధ్యం దక్కుతుంది. వీటిలో 15 కమిటీలు సంక్షేమంతోపాటు వివిధ అంశాలకు సంబంధించిన అంశాలపై ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర సంక్షేమ శాఖలకు సంబంధించిన కమిటీ, ఎథిక్స్ కమిటీ, ప్రివిలేజెస్ కమిటీ, పిటిషన్స్ కమిటీ, ఎన్విరాన్మెంట్ కమిటీ.. ఇలా ఉంటాయి. మరో మూడు కమిటీలు అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ, ఎస్టిమెట్స్ కమిటీలు మాత్రం ప్రభుత్వ ఆర్థిక, పథకాల అమలు తదితర వాటికి సంబంధించిన అంశాలను చూస్తాయి. వీటిని ఫైనాన్స్ కమిటీలని కూడా అంటారు. ఈ కమిటీల్లో సభ్యుల ఎంపిక కోసం పార్టీలవారీగా నామినేషన్ వేస్తారు. వారి ప్రాతినిధ్యానికి అనుగుణంగా సభ్యులు ఎన్నికవుతుంటారు. పార్టీలు వారికి ఉండే సంఖ్యాబలాన్ని మించి నామినేషన్లు దాఖలు చేస్తే.. ఆ కమిటీకి ఎన్నికలు కూడా నిర్వహించాల్సి ఉంటుంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (ప్రజాపద్దుల కమిటీ) రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి ఖర్చు, పనిని సమీక్షించి, లోటుపాట్లను ఎత్తిచూపి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తుంది.
ప్రతిపక్షానికే పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వాలి
శాసనసభలో అనాదిగా ఈ కమిటీ చైర్మన్ పోస్టును ప్రతిపక్షానికి ఇస్తున్నారు. ‘రూల్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ’ రూల్-250 ప్రకారం పీఏసీకి ఎన్నికలు నిర్వహిస్తారు. ‘ప్రిన్సిపల్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్’ అని స్పష్టంగా నియమావళిలో ఉన్నది. దీని ప్రకారం అసెంబ్లీ తొమ్మిది మంది సభ్యులను పీఏసీకి ఎన్నుకోవాలి. రాష్ట్ర శాసనసభ ఏర్పడేనాటికి, పీఏసీ కమిటీకి నోటిఫికేషన్ ఇచ్చే సమయానికి బీఆర్ఎస్కు ఉన్న బలం 38 మంది సభ్యులు. ఒక్కొక్క సభ్యుడిని ఎన్నుకోవడానికి 12.67 (13 మంది) మంది మద్దతు కావాల్సి ఉంటుంది. ఈ లెక్కన 119 మంది సభ్యులు ఉన్న శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలకు పీఏసీలో అవకాశం దక్కాలి. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరుండాలన్నది బీఆర్ఎస్ పార్టీ నిర్ణయిస్తుంది. ఇందుకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత కేసీఆర్.. మాజీ మంత్రులు టీ హరీశ్‌రావు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డితో పీఏసీకి నామినేషన్ వేయించారు. నామినేషన్ల గడవు ముగిసి చాలాకాలమైంది.
హఠాత్తుగా తెరపైకి గాంధీ
బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన అరికెపూడి గాంధీ జూలై 13న కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆయనకు కాంగ్రెస్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీలోనే లేని గాంధీ.. హఠాత్తుగా బీఆర్ఎస్కు దక్కాల్సిన పీఏసీ చైర్మన్ పదవిని పొందడం గమనార్హం. అసలు ఆయన అభ్యర్థిత్వాన్ని ఎవరు బలపరిచారన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నది.
ఎన్నిక ఎందుకు నిర్వహించలేదు?
పీఏసీకి తొమ్మిది మందిని ఎన్నుకోవాల్సి ఉండగా, అంతకు మించిన నామినేషన్లు వస్తే స్పీకర్ ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ తరఫున హరీశ్‌రావు, గంగుల కమలాకర్, ప్రశాంత్‌రెడ్డితోపాటు ఒకవేళ నిజంగానే అరికెపూడి గాంధీ నామినేషన్ వేసి ఉంటే.. తొమ్మిది స్థానాలకు పది నామినేషన్లు వచ్చి ఉంటే ఎన్నిక ఎప్పుడు నిర్వహించారన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. ఉన్న స్థానాల కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే ఎన్నిక నిర్వహించాలి. ఎన్నిక నిర్వహించకుండానే హరీశ్‌రావు నామినేషన్‌ను తిరస్కరించారు. ఇది స్పీకర్ తనంతట తానుగా నిర్ణయం తీసుకునే విషయం కాదని రాజ్యాంగ నిపుణులు చెప్తున్నారు. ఎలిమినేషన్ ప్రాసెస్‌లో ప్రజాపద్దుల కమిటీ సభ్యులను ఎన్నుకోరని స్పష్టంచేస్తున్నారు. ఎలిమినేషన్ ప్రక్రియలేని కమిటీలో ఇలాంటి నిర్ణయం తీవ్ర చర్చకు దారితీస్తున్నది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను పీఏసీ వంటి కీలకమైన కమిటీకి చైర్మన్‌గా స్పీకర్ ఎలా నియమించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. గాంధీపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో స్పీకర్ పీఏసీ చైర్మన్‌గా గాంధీని నియమించడం వివాదాస్పదం అవుతున్నది. ఇదే విషయంపై ‘నమస్తే తెలంగాణ’ శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులను వివరణ అడిగేందుకు ప్రయత్నించగా ఆయన ఫోన్లో అందుబాటులోకి రాలేదు.
అనాదిగా పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్షానికే..
రాష్ట్రంలో అందుబాటులో ఉన్న సమాచారం మేరకు 1958-1959 నుంచి ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేకే పీఏసీ చైర్మన్ పదవి ఇస్తున్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాగం జనార్ధన్‌రెడ్డిని పీఏసీ చైర్మన్‌గా టీడీపీ నిర్ణయించింది. సీఎం హోదాలో ఉన్న రాజశేఖర్‌రెడ్డి మాత్రం నాగం ఎన్నికను వ్యతిరేకించారు. నాడు స్పీకర్ హోదాలో ఉన్న నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం పీఏసీ చైర్మన్ పదవిని ప్రతిపక్ష నేత తమ పార్టీలో ఎవరికి ఇవ్వాలంటే వారికి ఇవ్వాల్సిందేనని చెప్పి నాగంను పీఏసీ చైర్మన్‌గా నియమించారు. జాతీయ స్థాయిలో చూసినా, ప్రధాని నరేంద్రమోదీ కూడా పార్లమెంటులో పీఏసీ చైర్మన్ పదవిని ప్రతిపక్ష నేత సిఫార్సు చేసినవారికే ఇచ్చారు. 2014-2016 మధ్యకాలంలో 543 మంది సభ్యులు ఉన్న సభలో కేవలం 44 మంది సభ్యులున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన కేవీ థామస్‌ను పీఏసీ చైర్మన్‌గా నియమించారు. 2016-2019 వరకు కాంగ్రెస్ పార్టీకే చెందిన మల్లిఖార్జున ఖర్గే పీఏసీ చైర్మన్‌గా వ్యవహరించారు. 2019-2024 వరకు అదే పార్టీకి చెందిన అధిర్ రంజన్‌చౌదరి, తాజాగా 2024లో కేసీ వేణుగోపాల్ పీఏసీ చైర్మన్లుగా నియమితులయమ్యారు. కానీ, రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి సర్కారు మాత్రం ఫిరాయింపులకు ప్రోత్సహించి, కాంగ్రెస్‌లో చేర్చుకున్న ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ పోస్టు ఇవ్వడం చర్చనీయాంశమయ్యింది.
రాహుల్ గాంధీవి డొల్లమాటలే: హరీశ్‌రావు
దేశంలో రాజ్యాంగ హననం జరుగుతున్నదని, ప్రజాస్వామ్యం ఖూని అవుతున్నదంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేతిలో రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని డొల్లమాటలు చెప్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రతిపక్షానికి పీఏసీ చైర్మన్ పదవిని ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీనే తీసుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని దుయ్యబట్టారు. చేతిలో రాజ్యాంగం పట్టుకొని నీతులు చెప్పే రాహుల్‌గాంధీ మాటలన్నీ నీటిమూటలేనని ఎద్దేవా చేశారు. రాజ్యాంగంపై రాహుల్‌గాంధీకి గౌరవం ఉంటే తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పీఏసీ చైర్మన్ విషయంలో తగిన ఆదేశాలు జారీచేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో పీఏసీ చైర్మన్ పదవిని కాంగ్రెస్ పార్టీకి చెందిన కేసీ వేణుగోపాల్ తీసుకున్నారని, తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన అరికపూడి గాంధీకి ఇచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ చర్య రాజ్యాంగాన్ని నిట్టనిలువున పట్టపగలే ఖూనీ చేయడమేనని, రాజ్యాంగాన్ని పరిహాసం చేయడమేనని మండిపడ్డారు. రాహుల్‌గాంధీకి రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కులేదని చెప్పారు.
పీఏసీ కమిటీ ఇదేఅరికెపూడి గాంధీ చైర్మన్‌గా వ్యవహరించే పీఏసీ కమిటీలో సభ్యులుగా ఎమ్మెల్యేలు ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, చిక్కుడు వంశీ కృష్ణ, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, రామారావు పవార్, అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా, కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీలు టీ జీవన్‌రెడ్డి, టీ భానుప్రసాద్‌రావు, ఎల్ రమణ, సత్యవతి రాథోడ్‌ను నియమించారు.
ఎస్టిమేట్స్ కమిటీ
ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్‌గా నల్లమద పద్మావతి నియమితులయ్యారు. సభ్యులుగా ఎమ్మెల్యేలు వాకిటి సునీత లక్ష్మారెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మాగంటి గోపీనాథ్, సీహెచ్ విజయరమణారావు, కోరం కనకయ్య, రాందాస్ మలావత్, మామిడాల యశస్విని, పీ రాకేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్, సుంకరి రాజు(శంబీపూర్రాజు), తక్కళ్లపల్లి రవీందర్రావు, వీ యాదవరెడ్డి నియమితులయ్యారు.
పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ
పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ చైర్మన్‌గా కే శంకరయ్యను నియమించారు. సభ్యులుగా ఎమ్మెల్యేలు సబితాఇంద్రారెడ్డి, కేపీ వివేకానంద, వేముల వీరేశం, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, మక్కన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, పీ సంజీవ్‌రెడ్డి, తోట లక్ష్మీకాంతారావు, కౌసర్ మోహియుద్దీన్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి, తాతా మధుసూదన్, మీర్జా రియాజుల్ హసన్ నియమితులయ్యారు.