Anirudh Reddy | మహబూబ్‌నగర్, జనవరి 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ ప్రభుత్వంలో కరప్షన్ పెరిగిపోతున్నదని, బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్లదే హవా నడుస్తున్నదని.. భూ మాఫియా పేట్రేగిపోతున్నదంటూ మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. ఎంతటి పెద్దవాడైనా రోడ్డుమీదికిడుస్తానంటూ హెచ్చరించారు. ఆదివారం జడ్చర్లలో ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు ఉమ్మడి జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి నాలుగు పథకాలు ప్రారంభిస్తున్న సందర్భంలో జడ్చర్ల ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారాన్ని లేపింది.
కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతున్నదని.. మంత్రులకు ఎమ్మెల్యేలకు సఖ్యత ఉందా..లేదా..? ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్నారా..? అని అనుమానాలు కలుగుతున్నాయి. ‘ప్రజా పాలన బాగుంది..ప్రజలకు కావాల్సిందే ఈ రోజు జరుగుతున్నది.. అయినా ఆ గవర్నమెంట్‌కు ఈ గవర్నమెంట్‌కు కొంచమే తేడా ఉంది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇంకా కొంచెం అవినీతి ఉన్నది. కొంతమంది రెవెన్యూలో సమస్యలు ఉంటే మళ్లీ ప్రొహిబిట్లో పెట్టి వసూలు చేసుకుంటున్నారు. ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరైనా గాని.. ఎంత పెద్ద వారైనా గాని.. కొంతమంది బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్లు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్లకే మాట్లాడుకొని ల్యాండ్ ప్రొహిబిటేడ్లో ఉంటే ముప్పై, నలభై పర్సెంట్ రాయించుకొని చేస్తున్నారు. కొంత మంది నా దగ్గరకు వచ్చారు. కచ్చితంగా ఎంత పెద్ద నాయకుడైనా వాన్ని రోడ్డు మీదకు లాగుతా’ అని అనిరుధ్‌రెడ్డి హెచ్చరించారు.