సంగారెడ్డి ఆగస్టు 25(నమస్తే తెలంగాణ): రుణమాఫీపై రైతుల ఆందోళనలను పక్కదోవ పట్టించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రా పేరుతో డ్రామాలు ఆడుతున్నారని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కందిలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో సభ్యత్వ నమోదులోఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఆరు గ్యారెంటీల అమలును విస్మరించి రేవంత్‌రెడ్డి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో అక్రమ నిర్మాణాలకు సంబంధించి సీఎం తమ్ముడు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులపైనా ఆరోపణలు వస్తున్నాయని, వారి నిర్మాణాలను సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు తొలిగించరని ప్రశ్నించారు.
మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఇతరులు అక్రమ నిర్మాణాలు చేపట్టిన ట్టు ఆరోపణలు వస్తున్నాయని, రేవంత్‌రెడ్డికి దమ్ముంటే వారి భవనాలను తొలిగించాలని డిమాండ్ చేశారు. దా నం నాగేందర్‌పై కేసు నమోదు చేసిన ప్రభు త్వం ఆయనను ఎందుకు అరెస్టు చేయటంలేదని ప్రశ్నించారు. చెరువుల్లో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై ప్రభు త్వం ఎందుకు చర్యలు తీసుకోవటంలేదని నిలదీశారు. హైదరాబాద్‌తోపాటు తెలంగాణలో చెరువులను ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.